మొన్న సుశాంత్‌సింగ్.. నిన్న సమీర్‌శర్మ.. నేడు భోజ్‌పురి నటి అనుపమ పథాక్. ఎందుకిలా అర్ధాంతరంగా జీవితాన్ని వదిలేసుకున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన వెండితెరపై ఎదిగిన వీరంతా ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ అంతుబట్టని ప్రశ్నలు.. బాలీవుడ్, టాలీవుడ్ పేరు మారిన… సినీ మాయాలోకంలో ఎన్నో ఊసరవెల్లులుంటాయి. అదను చూసి కాటేస్తుంటాయి. వాటిని తప్పించుకున్న వారు ప్రశాంతంగా ఉంటున్నారు. విషపుకోరల్లో చిక్కిన అందాలు నిస్సహాయంగా ఏమి చేయలేక మరణాన్ని ఆశ్రయిస్తున్నారనేది జగమెరిగిన సత్యం.
నాటి ఫటాఫట్ జయలక్ష్మి నుంచి ఈ తరం అందాల రాశి శ్రీదేవి మరణాల వెనుక దాగిన మిస్టరీ ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోతున్నాయి. సుశాంత్‌సింగ్ సూసైడ్ చూడండీ.. ఆర్ధిక ఇబ్బందుల్లేవు.. కుటుంబ కష్టాలు కనిపించవు. అయినా కుంగుబాటుకు గురయ్యాడట.. భరించలేక సైలెంట్‌గా వెళ్లిపోయాడట. శ్రీదేవి కూడా దుబాయ్‌లో పెళ్లికోసం వెళ్లి.. నీటిటబ్‌లో మునిగి చనిపోయిందట. తమిళనాడు సీఎం జయలలిత కూడా ఒకప్పటి తార. ఆమె కూడా రోజుల తరబడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తెలుగు తెరపై దివ్యభారతి, సిల్క్‌స్మిత, శ్రీదేవి బాలీవుడ్‌లో ఎంతోమంది అందమైన జీవితాన్ని అనుభవిస్తూ అకస్మాత్తుగా ఆత్మహత్యలు చేసుకున్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు మాత్రమే అనే సామెత వాడుకలో ఉంది. సినీ ప్రపంచంలోనూ హత్యలు కూడా ఆత్మహత్యలుగా చిత్రీకరించబడతాయి. ఎవరి భుజం మీద నుంచో.. ఇంకెవరో తుపాకీ పేల్చి.. తమ ప్రతీకారం తీర్చుకుంటున్నారు.