1986లో వెండితెరపై ఓ సంచలనం. పీపుల్స్‌వార్ గ్రూప్ గురించి తీసిన సినిమా సూపర్‌హిట్టయింది. మరో అద్భుతమైన అంశం ఏమిటంటే.. ఏం పిల్లడో వెళ్దమొస్తవా.. ఏం పిల్లో వెళ్దమొస్తవా అంటూ.. వినిపించిన పాట థియేటర్లనే కాదు.. ప్రజల నోళ్లలోనూ వినిపించింది. ఆ పాట రచయితే వంగపండు ప్రసాద్. ప్రజాకవి.. వాగ్గేయకారుడు.. జానపదమే జనపదం అని నమ్మిన ప్రజాపోరాట యోధుడు. 1943 విజయనగరం జిల్లా పెదబొండపల్లిలో జన్మించారు. 1972 పీపుల్స్‌వార్ గ్రూప్‌కు అనుబంధంగా జననాట్యమండలి స్థాపించింది కూడా వంగపండే. గ్రామస్థాయి కళాకారులను ప్రోత్సహిస్తూ ముందడుగు వేశారు. మూడు దశాబ్దాల కాలంలో దాదాపు 10 భాషల్లో 300కు పైగా పాటలు రాశారు. విప్లవ భావజాలాన్ని జానపదంతో జోడించి ప్రజాకవిగా ఎదిగారు. నాటి నక్సల్బరీ నుంచి ఇప్పటి కరోనా వైరస్ వరకూ ప్రతి సామాజిక అంశాన్ని పాటగా కట్టి.. గజ్జకట్టి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. తెలంగాణలో గద్దర్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. ఉత్తరాంధ్ర, ఆంధ్ర ప్రాంతంలో వంగపండు అంతకు మించిన ఆదరణ పొందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వగృహంలో మంగళవారం గుండెపోటుతో మరణించారు. 77 ఏళ్ల వయసులోనూ జనం గురించి ఆలోచించిన ప్రజాకవి వంగపండు మృతికి ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్, ప్రజాకవి గద్దర్ తదితరులు నివాళులర్పించారు.