ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఎన్నికలున్నా.. లేకపోయినా సమీకరణలు మారుతుంటాయి. ఒకప్పుడు బెజవాడను రాజకీయ రాజదానిగా చెప్పేవారు. కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రుల మార్పులకు విజయవాడ రాజదాని. అంతటి రాజకీయ చైతన్యం గల చోట.. ఎత్తుకు పై ఎత్తులు వేయగల ఉద్దండులున్నారు. అదంతా గతం.. 2014కు ముందు రాజకీయాలు పార్టీల బలాబలాలపై ఆదారపడి ఉండేవి. కానీ.. రాష్ట్ర విభజనతో గెలుపోటములు కులాల అండను బట్టి మారుతూ వస్తున్నాయి. కమ్మ వర్సెస్ రెడ్డి వర్గాల మధ్యనే ఆధిపత్యపోరు సాగేది. జనబలం ఉన్నా కాపు సామాజికవర్గం మాత్రం పట్టును నిలుపుకోలేకపోతుంది. ఏదోఓక పార్టీ పంచన చేరి వ్యాపార, రాజకీయ, సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో వచ్చినా ఆ నాడు వైఎస్సార్ సీఎంగా ఐదేళ్ల పనితీరు ప్రతికూల ఫలితాన్నిచ్చింది. ఆ తరువాత మెగాస్టార్ తన పార్టీను కాంగ్రెస్‌లో కలిపేయటం మచ్చగా మిగిలింది. ఆ తరువాత 2014లో జనసేన పేరిట పవన్ పార్టీ పెట్టి టీడీపీకు మద్దతు ప్రకటించి మంచి మార్కులు తెచ్చుకున్నారు. కానీ.. 2019లో అదే పొత్తు పవన్‌కళ్యాణ్ ఓటమికి కారణమైంది. ఐదేళ్ల కాలంలో కమ్మవర్గానికి వ్యతిరేకంగా మిగిలిన కులాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పైగా జనసేనాని మా వాడేనంటూ తెలుగు తమ్ముళ్లు చేసిన ప్రచారం.. దీనికి తగినట్టుగా వైసీపీ కూడా.. టీడీపీ, జనసేన ఒక్కటే నంటూ ప్రచారం చేయటం పవన్‌ను ఘోరంగా దెబ్బతీశాయి. అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటర్ల బలం ఉన్నా.. వారిని పోలింగ్ బూత్‌ల వద్దకు తీసుకురావటంలో జనసేన అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. నాయకత్వలోపం ప్రధాన సమస్యగా వెంటాడింది. అయినా.. 2019 ఎన్నికల్లో 6.8శాతం ఓటింగ్ జనసేన సొంతమైంది. దాదాపు 22 లక్షల మంది ఓటర్లు సేనకు జై కొట్టారు. 2014 ఎన్నికల్లో వైసీపీ 67 సీట్లు గెలిచింది. 44.58శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ, టీడీపీ కూటమికి 46.79శాతం ఓట్లు వచ్చాయి. అప్పుడు జనసేన ఇచ్చిన మద్దతు టీడీపీను గెలిపించాయి. ఒంటరిగా బరిలోకి నిలిచి 6.8శాతం ఓట్లకు 2019లో చేరటం అంత ఆషామాషీ కాదు. దాదాపు 20 నియోజకవర్గాల్లో అంతర్గతంగా కొందరు నేతలు
చివరి నిమిషంలో వైసీపీ వైపు దూకటం చాలాచోట్ల ఓటమికి కారణమైంది. 50శాతం ఓటర్లు 2019లో వైసీపీ వైపు చూశారు. వీరిలో దాదాపు 20శాతం మంది ఓటర్లు టీడీపీ వ్యతిరేక ఓటు వేసినవారనే వాదన లేకపోలేదు. వైఎస్సార్ తనయుడు, పైగా.. 2014లో ఓడిపోయాడనే సానుభూతి అన్నీ కలసి వచ్చాయి. టీడీపీ వ్యతిరేక ఓటు జనసేనకు వేసేందుకు సిద్ధమైన ఓటర్లు కూడా చివర్లో టీడీపీ, వైసీపీ ప్రచారాన్ని నిజమని నమ్మి వైసీపీ అభ్యర్థుల వైపు మొగ్గుచూపారు. వైసీపీ సర్కారు ఏర్పడి ఏడాది దాటింది. ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై దాదాపు 66 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఇప్పటికే దాదాపు 2లక్షల కోట్లరూపాయలు అప్పులు చేశారనే ఆరోపణలున్నాయి. నవరత్నాలు జనాల్లోకి బాగానే వెళ్లినా టీడీపీ జన్మభూమిని మించిన అవినీతికి చాలాచోట్ల వైసీపీ తెరలేపిందనే పుకార్లు కూడా జనాల్లో వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. టీడీపీ కూడా
అదే అవినీతిలో మునిగినట్టు.. వైసీపీ పెడుతున్న కేసులు.. అరెస్టులు కళ్లెదుట కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో
బీజేపీ, జనసేన కలయిక 2024 నాటికి కలసివస్తుందనే అభిప్రాయం ఆ రెండు పార్టీల్లో నెలకొంది. ప్రజా వ్యతిరేకతను అవకాశం చేసుకుని రెండు పార్టీలు చురుగ్గా జనాల్లోకి వెళితే.. పవన్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. కాపు వర్గం నుంచి కూడా ఈ దఫా
మంచి ఆదరణ లభిస్తుందని బీజేపీ, జనసేన అంచనాలు వేసుకుంటున్నాయి. అటు కమల సారధి కన్నా లక్ష్మినారాయణ కాపు వర్గానికి చెందిన నాయకుడు. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మున్నూరు కాపు వర్గం వ్యక్తే. బీజేపీ వ్యూహాత్మకంగా కాపులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుంది. రాజకీయంగా ఏపీలో నెలకొన్న పరిస్థితులను
కమలం, గాజుగ్లాసు రెండూ తమకు అనుకూలంగా మలచుకుంటే విజయం తమదే అనేది జనసైనికుల నమ్మకమట.