అపార అనుభవం ఉన్న పైలెట్ దీపక్‌సాథె. భారత వైమానిక దళంలో పనిచేశారు. ఏ విమానాశ్రయంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయో ఆయనకు తెలుసు. కానీ.. కేరళలో కురుస్తున్న భారీవర్షాలు. రన్‌వేపై నిలిచిన వరదనీటిని అంచనా వేయలేకపోయారు. సరైన వెలుతురు లేకపోవటం మరింత ఇబ్బందిగా మారింది. కానీ ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని అంచనా వేసి ఇంజన్ ఆపేశారు. ఫలితంగా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడగలిగారు. అయినా ప్రమాదంలో 19 మంది మరణించారు. 23 మంది తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదంతా శుక్రవారం సాయంత్రం కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన ఘోరప్రమాదం గురించిన విషయాలు. ప్రమాదంలో మరణించిన కో పైలెట్‌కు ఇటీవలే పెళ్లయిందట. దుబాయ్-కేరళ కు అక్కడ చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ నడుపుతున్నారు.
ఈ విమానంలో 191 మంది ప్రయాణిస్తున్నారు. పది నిమిషాల్లో విమానం దిగి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరేవారే. కానీ ఇంతలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. వాస్తవానికి కొజికోడ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం కొండల మధ్యన నిర్మించారు. రన్‌వేకు ఇరువైపులా భారీలోయలుంటాయి. ఎంత అనుభవం ఉన్న పైలెట్‌కు అయినా ఇక్కడ విమానం ల్యాండ్ చేయటం సవాల్‌తో కూడుకున్న విషయమే. అటువంటి చోట భారీవర్షాల కురవటంతో చేరిన వరదనీరు, ఏ మాత్రం కనిపించని రన్‌వేతో భారీ విమానం దూసుకెళ్లింది. రెప్పపాటులో లోయలోకి పడిపోయింది. రెండు ముక్కలైంది. కర్ణాటకలోఇదే తరహాలో 2010లో జరిగిన విమానప్రమాదంలో రెండు ముక్కలుగా చీలిన విమానంలో మంటలు చెలరేగి 180 మంది మరణించారు. కోజికోడ్‌లో జరిగిన ఘటనలో ఇక్కడ అదృష్టం ఏమిటంటే.. విమానం నుంచి మంటలు రాలేదు. ఫలితంగా ప్రాణనష్టం భారీగా తగ్గిందంటున్నారు విమానరంగ నిపుణులు. ఇక్కడ పొంచి వున్న ప్రమాదంపై నిపుణులు గతంలోనే హెచ్చరించినా పెడచెవిన పెట్టడం వల్ల ఈ అనర్థం జరిగిందంటూ ఆవేదన వెలిబుచ్చారు.