ఇది ఊహించిందే. లాబీయింగ్ చేయటంలో ఘటనాఘటన సమర్థుల ముందు కన్నా ఓడిపోయాడు. ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మినారాయణను అదిష్ఠానం తొలగించింది. ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చిన సోము వీర్రాజుకు ఆ స్థానం అప్పగించింది. ఇక్కడే లాభీయింగ్ చేసిన కాషాయ వలస నేతలకు ఊహించని ఝలక్ ఇచ్చినట్టయింది. కాపు వర్గానికి చెందిన కన్నా లక్ష్మినారాయణ నిష్క్రమించగానే.. తమలో ఎవరో ఒకరికి పట్టం కడతారని ఊహించిన వారికి మళ్లీ కాపు వర్గ నాయకులకే అవకాశం ఇవ్వటం షాక్‌గా మిగిలిందట. నిజానికి కన్నా సమర్థవంతమైన నాయకుడుగా గుర్తింపు పొందారు. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. వ్యవసాయమంత్రిగా గట్టిగానే పనిచేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత రోశయ్య సీఎం అయ్యారు. ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నపుడు.. సీఎంగా కన్నా పేరు తెరమీదకు వచ్చింది. దాదాపు అంతా పూర్తయిందనుకున్న సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి లాబీయింగ్ ఫలించింది. కన్నా కు వరించాల్సిన సీఎం సీటు తృటిలో తప్పిపోయిందనే ప్రచారమూ లేకపోలేదు. ఆ తరువాత రాష్ట్ర విభజనతో హస్తం గల్లంతు. ఆ తరువాత కన్నా బీజేపీలోకి చేరటం జరిగాయి. కమ్మ, రెడ్డి, కాపు, బీసీ వర్గాలు ఏపీలో చాలా కీలకం. ఓటుబ్యాంకు పరంగా కాపు ఓటర్లు.. గెలుపోటములను నిర్ణయించటంలో కీలకం. అందుకే కన్నాకు పదవి కట్టబెట్టింది బీజేపీ. కానీ.. కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ వంటి వారికి ఇది రుచించలేదనే గుసగుసలున్నాయి. పైగా వైసీపీ పట్ల దూకుడుగా ఉంటూ.. టీడీపీ అనుకూలవాదిగా ముద్రపడేసుకున్నారు. ఆచితూచి స్పందించాల్సిన సమయంలో కాస్త బ్యాలెన్స్ కోల్పోయారు. పైగా
చురుగ్గా రాష్ట్రంలో తిరగటంలో విఫలమయ్యారు. 2019లో ఘోర ఓటమి కూడా మరో కారణంగా చెప్పుకోవాలి. ఇలా.. ప్రతికూల వాతావరణం.. అంతర్గత శత్రువుల పుణ్యమాంటూ.. సమర్థుడైన నేతగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కన్నా.. అలా తలవంచి తప్పుకోవాల్సి వచ్చింది. సోము వీర్రాజు పై బీజేపీ చాలా నమ్మకం ఉంచింది. సమర్థుడైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆర్ ఎస్ ఎస్ నుంచి రావటం వల్ల క్లిష్ట సమయాల్లో ధీటుగా నిలబడగల సత్తా ఆయనకు ఉందనేది కాషాయపార్టీ అంచనా.
కానీ.. పార్టీలో ఉంటూ.. పక్కపార్టీకు కొమ్మకాసే నేతల పట్ల సోము ఎలా ఉంటారనేది ఆసక్తిగా మారింది. మరోసారి కాపు వర్గానికే పట్టంకట్టిన బీజేపీ.. కాపులపై గురిపెట్టిందనే చెప్పాలి. పైగా జనసేనాని పవన్‌తో పొత్తు ఉండనే ఉంది. ఇలా.. కాపులను బీజేపీ వైపు ఆకర్షించి.. 2024 నాటికి అటు బీజేపీ, ఇటు జనసేన బలంగా మారాలని భావిస్తున్నాయనేది విశ్లేషకుల అంచనా.