ఎన్ని పాటలు… ఎన్ని వేల సంగీత విభావరిలు.. బాలు పాట చెవిని తాకితే చాలు. మనసంతా తేలికగా మారుతుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా ఉపశమన మంత్రం గానగాంధర్వుడి గానం. ఏ దివిలో విరిసిన పారిజాతమో నంటూ ఆ నాడే కాదు.. ఈనాడు కుర్రకారు కలల నెచ్చెలికి సంగీత సందేశం పంపుతూనే ఉన్నారు. రవివర్మకే అందనీ.. ఒకే ఒక అందానివోఅంటూ అభిసారికను గుర్తుచేసుకునే అవకాశాన్ని కల్పించావ్. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదఫీ గరీయతీ.. అంటూ దేశభక్తిని ఇప్పటి తరానికీ దగ్గర చేసిన గాత్రం నీది గాక ఇంకెవరదై ఉంటుంది. అంతర్యామీ అలసితిని అంటూ.. అన్నమయ్య లో నీ స్వరం వినిపిస్తే.. ఎంతగా బాధపడి ఉంటాం.. రామదాసులో సీతమ్మకు చేయిస్తి సింతాకు పతకం అంటూ… రామయ్యను పిలుస్తుంటే.. మా కళ్లెదుట కోదండరాముడు కనిపించినంత పొంగిపోయాం. ఇలా.. ఒకటా రెండా.. ఎన్ని వేల పాటలు. బాత్రూమ్ సింగర్స్‌లోనూ గొప్ప పాటగాళ్లు ఉంటారంటూ ప్రోత్సహించిన మా బాలుగారి దయవల్ల ఎంతమంది ఇప్పటి తరానికి పాటగాళ్లుగా కనిపిస్తున్నారు. పాడుతాతీయగా అంటూ.. ఒకటా రెండా.. ఏళ్లతరబడి.. చిట్టిపొట్టి పదాలు పలకటం కూడా చేతకాని పిల్లలతో ఎన్ని స్వరాలు పలికించారు. నాటి తరానికి ఒక శంకరాభరణం.. ఈ తరానికి శంకర్‌దాదా ఎంబీబీఎస్. ఆ గొంతులో ఎన్ని వైవిధ్యాలు పలికించావో మాకు తెలీదనుకున్నావా. అంతులేనికథ సినిమాలో తాళికట్టు శుభవేళ మెడలో కల్యాణమాల అంటూ.. ఆలపించిన పాటలో ఎన్ని గాత్రాలు వినిపించారు. మీ మిమిక్రీ కళతో సంగీతపరికరాలు సిగ్గుపడేంతగా ఎంతగా అలరించారో మాకు గుర్తుంది. నందమూరి తారకరామారావు అయినా.. అల్లు రామలింగయ్య ఎవరికైనా అదే స్వరంతో మీరు పాడిన పాటలు.. మళ్లీ వినిపించరూ.. అయినా మిమ్మల్ని ఆ వైరస్ ఏం చేస్తుంది బాలుగారూ.. మీ గొంతులో మకరందాలను ఒక్కసారి చూద్దామని వచ్చిన ఆ వైరస్.. తనలోని చేదును వదిలేసి అమృతంగా మారే ఉంటుంది. మీరు త్వరగా కోలుకుని వస్తే.. సరదాగా పాడుతాతీయగ ఆలపిద్దామంటోంది ఈ తరం. ఎందుకిక ఆలస్యం.. గానగాంధర్వుడిగా మరోసారి మమ్మల్ని అలరించాలి. భారత ఉపరాష్ట్రపతి కోరినట్టుగా.. నెల్లూరు గురించి అందమైన పాటనూ పాడాలి.