నలభై ఏళ్ల అనుభవం. ఇద్దరు ప్రధానుల ఎంపికలో రాజనీతి. ప్రపంచదేశాల్లో ఉన్న పేరు ప్రఖ్యాతులు. ఇవన్నీ ఎక్కడ. చంద్రబాబునాయుడులోని అపర చాణక్యుడు ఏమయ్యాడు. వయసు పెరగటంతో ఎత్తులు వేయటంలో తప్పటడుగులు వేస్తున్నారా. తలపండిన అపారమైన అనుభవం అవసరానికి ఉపయోగపడకుండా ఉందా! నిజమే.. ఏపీలో రాజకీయాలు కొత్తేమి కాదు. ఎత్తుకు పై ఎత్తులు.. వ్యూహ ప్రతివ్యూహాలతో ఒకర్నొకరు దెబ్బతీసుకోవటం రసవత్తరంగా ఉంటాయి. కానీ.. 2019 తరువాత ఏపీలో రాజకీయం ఏకపక్షంగా మారింది. అది కూడా అధికార వైసీపీకు అనుకూలంగా మారుతుంది. ఇదంతా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడలో భాగమనే ప్రచారమూ లేకపోలేదు. కానీ అంతకు మించిన రాజకీయవేత్తగా పేరున్న చంద్రబాబు దానికి తగినట్టుగా ఎందుకు ఎత్తులు వేయలేకపోతున్నారనేది తెలుగు తమ్ముళ్ల బుర్రను వేధిస్తున్న ప్రశ్న. మాజీ మంత్రులు, టీడీపీ వెన్నుముకగా బావించే అచ్చెన్నాయుడు అరెస్టు, బెయిల్ రాకపోవటం కూడా టీడీపీ నేతలపై పెను ప్రబావం చూపుతుంది.
2014లో గెలిచాక బాబు అండ్ బ్యాచ్ అతి ఆత్మవిశ్వాసం ప్రదర్శించారు. 2019లోనూ తామే అధికారంలోకి వస్తామనే ధీమా.. నాటి ఇంటెల్‌జెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ కూడా టీడీపీను అభాసు పాల్జేశాయి. జన్మభూమి కమిటీల పేరిట గతానికి భిన్నంగా తెలుగు నేతలు, తమ్ముళ్లు అడ్డగోలు దోపిడీకు తెగబడ్డారు. రాజధాని ముసుగులో మంత్రులు చేసిన భూ దోపిడీ కూడా పార్టీను అభాసుపాల్జేసింది. 2019లో కేంద్రంలోని ఎన్‌డీఏ ఓడిపోతుందనే బలమైన ఉద్దేశంతో చంద్రబాబు 2018లో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలను అంతకముందు కర్ణాటక ఎన్నికలను వేదికగా మలచుకున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని చారిత్రక తప్పిదం చేశారు. 1982లో ఏ కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనుకుని స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీను స్థాపించారో అదే హస్తంతో చేతులు కలిపి టీడీపీ ఎజెండాలోని తెలుగువారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారనే
కళంకం మూటగట్టుకున్నారు.
2014లో టీడీపీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన జనసేన, బీజేపీలతో పొత్తు వదలుకోవటం 2019లో పూర్తిగా దెబ్బతీసింది. వైసీపీ అధినేత జగన్ ఒక్కఛాన్స్ బాగా పనిచేసింది. జనసేన వామపక్షాలతో కలసి బరిలోకి దిగినా.. వైసీపీ చేసిన ప్రచారం టీడీపీ మిత్రుడు పవన్ అనే మాటలు జనాలపై బాగానే ప్రభావం చూపాయి. పవన్‌కు ఓటేస్తే బాబుకు వేసినట్టే అనే దానితో టీడీపీ వ్యతిరేక ఓట్లు వైసీపీ సొంతం చేసుకుంది. ఫలితంగా రికార్డు స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను దక్కించుకుంది.
ఆ తరువాత విపక్షంలోకి చేరిన టీడీపీ అనుకున్నంతగా వైసీపీకు ధీటుగా సమాధానం చెప్పలేకపోతుంది. వైసీపీ కూడా టీడీపీ నేతలను వెంటాడి.. వేటాడుతోంది. వేలాది మందిని కేసుల పేరుతో భయపెడుతోంది. ఫలితంగా టీడీపీ చేపట్టే ఆందోళనకు తెలుగు తమ్ముళ్లు ముందడుగు వేయలేకపోతున్నారు. వైసీపీ నిర్ణయాలపై టీడీపీ చేస్తున్న న్యాయపోరాట ఫలితంగా దాదాపు 68 సార్లు హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి వైసీపీ సర్కారు మొట్టికాయలు వేయించుకుంది. ఇదంతా టీడీపీ సాధించిన విజయంగా తెలుగుదేశం నేతలు చెప్పుకోలేకపోతున్నారు. బాబు కూడా హైదరాబాద్‌లో ఉండటం మరింత ఇబ్బందిగా మారింది. రాజధాని మార్పుపై టీడీపీ ఆశించినంతగా ప్రజామద్దతు కూడగట్టలేకపోతున్నారు. అమరావతి కేవలం ఒక సామాజికవర్గానికే సొంతం అనే ప్రచారం జనాల్లోకి బాగా చేరింది. ఫలితంగా అమరావతిని ఆంధ్ర ప్రజలు ఎమోషనల్‌గా స్వీకరించలేకపోతున్నారు. క్లిష్ట సమయంలోనే చురుగ్గా ఆలోచించి ఎత్తులు వేయగల చంద్రబాబు ఎందుకో వెనుకబడినట్టుగా ఏపీ ఓటర్లు భావిస్తున్నారు. అది స్వీయ తప్పిదమా! లేకపోతే… ఏవైనా శక్తులు వెనక్కిలాగుతున్నాయా! అనేది తేలాల్సి ఉంది. ఏమైనా.. 1996 నాటి చంద్రబాబు
మరోసారి బయటకు వస్తే తప్ప.. దేశం పార్టీకు మనుగడ ఉండబోదనేది విజ్ఞుల సూచన.