చిరంజీవితో సోము క‌ల‌యిక.. రాజ‌కీయ కాక‌!

మెగాస్టార్ చిరంజీవితో ఏపీ బీజేపీ కొత్త అధ్య‌క్షుడు సోము వీర్రాజు క‌ల‌యిక రాజ‌కీయంగా కాక పుట్టిస్తోంది. తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద‌దిక్కు చిరంజీవి. రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తోనూ స‌న్నిహితంగా ఉంటున్నారు. కేంద్రంలోని కాషాయ‌పార్టీతోనూ అదే సాన్నిహిత్యం నెరపుతున్నారు. ఇదికేవ‌లం రాజ‌కీయంగా గాక‌పోయినా సినీ రంగం కోసం చాలా అవ‌స‌రం కూడా. దివంగ‌త దాసరి నారాయ‌ణరావు బాట‌లోనే చిరంజీవి కూడా అంద‌ర్నీ క‌లుపుకుని వెళ్లాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీనిపై ఏ కొద్దిమందో విమ‌ర్శ‌లు చేసినా టాలీవుడ్ మాత్రం అన్న‌య్య వైపు ఉంటున్నారు. సినీ-రాజ‌కీయాల‌ను వేరు చేయ‌టం పాలునీళ్ల‌ను వేరు చేసిన‌ట్టుగానే ఉంటుంది. ఇప్పుడ చిరంజీవితో సోము వీర్రాజు క‌ల‌వ‌టం రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌పై అంచ‌నాల‌ను భారీగా పెంచింది. ఇద్ద‌రూ కాపు వ‌ర్గానికి చెందిన వారు కావ‌టం.. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌టం కూడా ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిందే. మ‌రోవైపు కాపుల‌ను ఏక‌తాటిపైకి తీసుకురావ‌టం ద్వారా వైసీపీ, టీడీపీల‌కు ధీటుగా బీజేపీ ఎద‌గాల‌నేది కాషాయ‌నేత‌ల వ్యూహం.

దానికి త‌గిన‌ట్టుగానే క‌న్నాను తొల‌గించినా మ‌ళ్లీ అదే కాపు వ‌ర్గానికి చెందిన సోముకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. తెలంగాణ‌లోనూ బండి సంజ‌య్ మున్నూరు కాపు వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. ఇలా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉన్న కాపు ఓట‌ర్ల‌ను త‌మ వైపున‌కు తిప్పుకోవాల‌నేది కాషాయ వ్యూహం. దీనికి జ‌న‌సేన మ‌రింత బ‌లాన్నిస్తుంద‌నే ఆలోచ‌న కూడా లేక‌పోలేదు. కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మాన్ని మ‌రోసారి కీల‌క నాయ‌కుడు ద్వారా తెర‌మీద‌కు తీసుకురావాల‌నే ప్లాన్ కూడా కాపు నేత‌ల్లో ఉంది. దీనికి చిరంజీవి, ప‌వ‌న్‌, వంగ‌వీటి రాధాకృష్ణ వంటి వారు సార‌థ్యం వ‌హిస్తార‌ని చెబుతున్నా.. కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మం ఎవ‌రు సార‌థ్యంలో జ‌రుగుతుంద‌నే అంశంపై స్ప‌ష్ట‌త రాకుండా ఉంది.

ఇటువంటి స‌మ‌యంలో చిరంజీవితో సోము బేటీ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇది కేవ‌లం ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టినందు చిరు ఇచ్చిన పుష్ప‌గుచ్చ‌మా.. రాబోయే రాజ‌కీయాల్లో నేను మీ వెన్నంటి ఉంటానంటూ ఇచ్చిన సంకేతమా! ఏమైనా ఇటు మెగా అభిమానుల‌కు.. అటు కాపు సామాజిక‌వ‌ర్గానికి ఈ ఇద్ద‌రి క‌ల‌యిక మ‌హ‌దానందంగా ఉందంటున్నారు. చిరు దీవించిన‌ట్టుగా వ‌స్తున్న మ‌రో అంశం.. బీజేపీ, జ‌న‌సేన 2024లో ఏపీలో అధికారంలోకి రావాల‌ని.. ఇది నిజ‌మా.. కేవ‌లం ప్ర‌చార‌మా! అనేది కూడా ఆస‌క్తిక‌రంగా మారింద‌న్న‌మాట‌.

1 COMMENT

  1. ఒక జాతీయ పార్టీ తన బలం పుంజుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా రావాలంటే ఎలాంటి ఎత్తుగడలు అవసరం.ఆర్టికల్ బాగుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here