తెలుగు సినిమా పెద్దన్న మెగాస్టార్. ఎవరు ఔనన్నా.. కాదన్నా.. టాలీవుడ్‌లో నడుస్తున్నది ఇదే. ఏ కొద్దిమందో వ్యతిరేకించినంత మాత్రాన ఇది నిజం గాకపోదంటూ మెగా అభిమానులు సెటైర్లు కూడా వేస్తున్నారండోయ్. లాక్‌డౌన్ వేళ వేలాది మంది సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ పేరుతో ఛారిటీ ఏర్పాటు చేసి ఆకలిదప్పులు తీర్చారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా అన్నీ తానై చక్కదిద్దుతున్నారు. ఒకప్పుడు. దర్శకరత్న దాసరి నారాయణరావు కుర్చీను అన్నయ్య ఇలా భర్తీ చేస్తున్నాడంటూ సినీవర్గాలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నాయి. ఇప్పుడు సినిమా షూటింగ్‌లు ఎప్పుడు మొదలుపెట్టాలి. ఎలా ప్రారంభించాలి. దాదాపు ఐదు నెలలుగా సినిమాషూటింగ్‌లు నిలిచాయి. సినిమా థియేటర్లు మూతబడ్డాయి. ఇటువంటి సమయంలో ప్రభుత్వం సినీ షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినా వైరస్ భయంతో ఎవ్వరూ సాహసం చేయలేకపోతున్నారు. చిరంజీవి ద్విపాత్రాభినయంతో దర్శకుడు కొరటాల శివతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆచార్య దాదాపు పూర్తికావచ్చిందట. కొంతభాగం పూర్తిచేస్తే ఎడిటింగ్ వర్క్ మిగిలి ఉంటుందట. కాబట్టి మెగాస్టార్ మొదటి అడుగు వేస్తే.. మిగిలిన చిన్న, పెద్ద సినిమాలు కూడా తగిన జాగ్రత్తలతో ముందడుగు వేయాలని భావిస్తున్నాయట. మరి మెగాస్టార్ మాత్రం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ వద్దనే అంటున్నారట.