ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో ఆడే పోకిరి.
ఈ డైలాగును ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వర్తింపచేసి చూడండి.
మహేశ్ బాబు స్థానంలో జగన్ మోహన్ రెడ్డి అభిమానులకు కనిపించ్లేదూ.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చూపిస్తున్న సినిమా ఇది . రాజకీయ పరిభాషలో అసలు సిసలైన రాజనీతి.. చాణక్యత. అవినీతి కేసులో మాజీ మంత్రి, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తర్వాత అంతటోడు అచ్చెన్నాయుడిని సింపుల్ గా పదే పది నిమిషాల్లో హ్యాండ్సప్ అనడం, అరెస్టు చేయడం, కార్లో ఎక్కించేయడం జరిగిపోయాయి.
అరెస్టయిన అచ్చెన్న.. జోకేసిన చంద్రన్న
అచ్చెన్నాయుడు అరెస్టవగానే చంద్రబాబు మందీ మార్బలం మీడియా అంతా ఒకటే మాట (గోల). బీసీ నాయకుడిని అరెస్టు చేశారని. ఇదంతా బీసీల మీద జరుగుతున్న కుట్రగా ఎవరికి తోచింది వారు సోదాహరణ సహితంగా వివరించేశారు. ఆయాసం తెచ్చుకున్నారు. ఇక్కడే చంద్రబాబు తరహా నక్క జిత్తుల రాజకీయం బయటకొచ్చింది. అచ్చెన్నాయుడు బీసీ కాబట్టి.. ఆయన్ని అరెస్టు చేయడం బీసీ జాతికి చేసిన ద్రోహంగా అభివర్ణించేశారు.
తరం మారుతున్నది.. వరుస మారుతున్నది
చంద్రబాబు పాత సినిమాల్లో రాజనాల తరహా రాజకీయం చేస్తున్నారని విమర్శించేవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. బ్లాక్ అండ్ వైట్ టీవీలు కాదు.. యాండ్రాయిడ్ సెట్లు వచ్చేశాయి. ఇప్పుడంతా లేటెస్ట్ వర్షన్. అప్డేట్ కాకపోతే ఔట్ డేట్ అయిపోతారంతే. ఆంధ్ర ఐటీ పితామహ అని పిలిపించుకునే చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఎలా మర్చిపోతున్నాడబ్బా.
అచ్చెన్నాయుడు బీసీ కావచ్చు. ఆయన బీసీలకు చేసిన ఉపకారం, బీసీల కోసం చేసిన పోరాటం ఏదైనా ఉందా? తాను ఎమ్మెల్యే అయిండు, తాను మంత్రి అయిండు. తాను శాసనసభాపక్ష ఉపనేత అయిండు. సో,….
అయినా బీసీలను అరెస్టు చేయకూడదని రాజ్యాంగంలో ఉందా? బీసీలు అవినీతి చేయొచ్చా? (మనోభావాలు దెబ్బతీసుకోకండి. ఇక్కడ మేటర్ అవినీతి. బీసీ కాదు) అచ్చెన్న కావచ్చు.. లచ్చన్న కావచ్చు.. అవినీతి చేస్తే బీసీ కాబట్టి.. పోనీలే పాపం అని వదిలేస్తారా? అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడిండా, లేదా.. అనేది న్యాయస్థానాలు తేలుస్తాయి. అప్పటివరకు ఆయన నిందితుడు. ఆయనకు కొన్ని హక్కులు కూడా ఉంటాయి. వాటిని వాడుకోవాలి కానీ.. ఎంతసేపు బీసీ నాయకుడిని అరెస్టు చేశారని గొంతు చించుకుంటే ఎట్ల? చంద్రబాబుకు బీసీలు గుర్తొచ్చారే… అని కొందరు హార్డ్ కోర్ తెలుగు తమ్ముళ్లు కూడా సెటైర్లు వేశారంటే ఆయన ఎంతగా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందో చెప్పకనే చెప్తుంది.
వైకుంఠపాళి కాదు చదరంగం ఆడేస్తున్న జగన్
రాజకీయ వైకుంఠపాళిలో ఎప్పుడు ఎవరు నిచ్చెన ఎక్కుతారో, ఎవరు ఎలా పాము నోటికి చిక్కుతారో తెలీదు. కానీ ముఖ్యమంత్రి జగన్ ఆ గేమ్ ఆడడం లేదు. చదరంగం ఎంచుకున్నారు. విపక్షం వేసే ఎత్తులను చిత్తు చేయడమే పని. బీసీ నాయకుడని కూడా చూడకుండా అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని బీసీల పార్టీగా చెప్పుకునే టీడీపీ.. రోజంతా మొత్తుకున్నాక.. తెల్లారేసరికి అదిరిపోయే రిప్లై వచ్చింది. ఈసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వారుసుడు అస్మిత్‌రెడ్డి అరెస్టు.
ఆయన ఫలానా నాయకుడని మొత్తుకోరేం…
ఎప్పుడైతే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అరెస్టు చేశారో.. పొద్దున్నే కొందరు ఖండించారు. తప్పితే అచ్చెన్నాయుడి అరెస్టు రోజు మాదిరి హంగామా చేయలేదు. ఎందుకిలా? అంటే అక్కడ మాత్రం టీడీపీ వదిలేస్తుందా.. కొందరికి కలిగిన అనుమానమిది? అదే మరో సామాజికవర్గ నాయకుడిని అరెస్టు చేసి ఉంటే ఇలాగే లైట్ తీసుకుని ఉండేటోళ్లా.. మరికొందరి సందేహం? ఈ సందర్భంలో వీటికి అర్థం పర్థం లేదు. ఎందుకంటే.. రాజకీయ చదరంగంలో జగన్ వేసి ఎత్తు అలాంటిది. జేసీ ప్రభాకర్ రెడ్డిది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒకే సామాజిక వర్గం. అందుకే పని డ్రాప్ సైలెన్స్. టీవీ ఫోన్ ఇన్లలోను టీడీపీ స్వరం బిలో యావరేజ్.
అచ్చెన్న నీతిమంతుడా.. జేసీ అవినీతి పరుడా?
జేసీ కుటుంబం దశాబ్దాలుగా మైనింగ్, ట్రాన్సుపోర్టు బిజినెస్ లో ఉంది. అలాంటిది ఇప్పుడు బస్సుల్ని, లారీల్ని తెగనమ్ముకుంటున్న పరిస్థితి. జగన్ సీఎం అయ్యాక ఎక్కడికక్కడ బ్రేకులు పడుతున్నాయి. మావాడే.. మావాడే.. అని దివాకర్ రెడ్డి కూలింగ్ గ్లాసెస్ తీసేసి మాట్లాడుతున్నా.. అటువైపు నుంచి స్పందన శూన్యం. రాజకీయాల్లో తలపండిన, తెలివి మీరిన జేసీ బ్రదర్స్ కు తత్వం బోధపడింది. అందుకే వాళ్ల జాగ్రత్తల్లో వాళ్లున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు ప్రత్యర్థి అదును చూసి పవర్ పంచ్ చూపించాడు.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో అనంతపురం జిల్లా షేక్ అవుతుందని, తాడిపత్రి భగ్గుమంటుందని తమ్ముళ్లు అనుకున్నారట. అధినేత ఆలోచన కూడా అదే. అందుకే సక్సెస్ ఫుల్ గా నిరసనలకు పిలుపునిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో సక్సెస్ కాలేదు. అతెందుకు.. సొంత జిల్లాలోని టీడీపీ మాజీ మంత్రులు, సీనియర్లు కూడా జేసీ అరెస్టును ఖండించలేకపోయారు. దీనిక్కారణం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలా… జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పు చేసి ఉంటారనే నమ్మకమా!
ఏది ఏమైనా.. మొన్న అచ్చెన్న.. నిన్న ప్రభాకర్.. రేపు ఎవరు? తెలుగు తమ్ముళ్లకు నిద్రలేకుండా చేస్తున్న ప్రశ్న ఇది. పొద్దు పొద్దున్నే శుభవార్త విన్నామంటూ పండుగ చేసుకుంటున్న ‘ఫాన్స్’లోను ఆసక్తి పెరిగిపోతోంది. చంద్రబాబు టీంలో ఏరోజుకారోజు సౌండ్ తగ్గిపోతోంది.