తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ఏ ఒక్క అవకాశం వదలుకోవట్లేదు. లాభనష్టాలకు అతీతంగా పార్టీలోకి ఎవరొచ్చినా కండువా కప్పి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. వీరివల్ల ఓట్ల శాతం పెరుగుతాయా లేదా అనేది పట్టించుకోవట్లేదు. కేవలం అవతలి వారిని బలహీన పరచాలి.. తాము బలపడకున్న ప్రత్యర్థులను దెబ్బతీయాలనేది బీజేపీ వేసిన ఎత్తుగడగా తెలుస్తోంది. దుబ్బాకలో గెలుపు భాజపాకు జీవం పోసింది. జీహెచ్ ఎంసీలో సాధించిన 50 సీట్లు.. 2023లో తమదే అధికారం అనేంత ఆత్మవిశ్వాసం పెంచింది. అందుకే. తరువాత టార్గెట్ నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ఉంచారు. దీనిలో భాగంగానే అక్కడ కీలక నాయకుడు.. కాంగ్రెస్ పెద్దాయన జానారెడ్డి కుటుంబానికి గాలం వేశారు. గత ఎన్నికల్లో ఓడిన జానారెడ్డిని బీజేపీలోకి తీసుకురావటం ద్వారా నల్లగొండలో పాగా వేయాలనేది కమలం ప్లాన్. అయితే.. ఇప్పటి వరకూ తమకు అటువంటి ప్రతిపాదన లేదంటున్నారు జానారెడ్డి. మరి ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి ఎంత వరకూ మాటపై నిలబడతారనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ చెల్లిగా టీఆర్ ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన విజయశాంతి ఆ తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2018 , 19 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా హస్తం తరపున దూసుకెళ్లారు. కానీ అక్కడ ప్రతికూల ఫలితాలు రావటంతో పార్టీకు దూరం జరుగుతూ వచ్చారు. దుబ్బాక ఎన్నికల్లోనూ పాల్గొనలేదు. ఆ తరువాత ఆమె బీజేపీలోకి చేరతారంటూ ప్రచారాన్ని నిజం చేశారు. ఇప్పుడు అదే వరుసలో ముఖేష్‌గౌడ్ కుమారుడు కాషాయంలోకి చేరారు. ఒకప్పటి శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ కూడా కమలం గూటికి చేరారు. తాజాగా అంజనీకుమార్ యాదవ్, జానారెడ్డి, మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్‌కు బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు ఉత్తమ్ రాజీనామా సమర్పించారు. రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడుగా చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. అయితే.. కొందరు సీనియర్లు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వి.హనుమంతురావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క వంటి వాళ్లు పీసీసీ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. వాళ్లలో ఎవరి ఆశ నెరవేరకున్నా బీజేపీలోకి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. బీజేపీ కూడా
టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్త నేతలు.. ఇబ్బంది పడుతున్న నాయకులను గమనించి కాషాయం కప్పేందుకు రెఢీ అవుతుందట.



