మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. చిరుతగా వెండితెరకు పరిచయమైన మెగా వారసుడు. చిరంజీవి తనయుడుగా తనదైన ముద్ర వేసుకున్నాడు. తండ్రి చిరంజీవి, బాబాయి పవన్‌కళ్యాణ్‌ల స్పూర్తిని కొనసాగిస్తున్నాడు. కేవలం నటుడుగానే గాకుండా.. సినీ, వ్యాపార, సేవా రంగాల్లోనూ దూసుకెళ్తున్నాడు. రంగస్థలంలో చరణ్ నటనకు విమర్శకులు సైతం 100 మార్కులు వేశారు. ఆ తరువాత వచ్చిన బోయపాటి సినిమా వినయవిధేయరామ నిరాశ పరిచింది. అయినా.. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెరవబోతున్నాడు. నందమూరి తారకరామారావు, సూపర్‌స్టార్ కృష్ణ పోషించిన అల్లూరి పాత్రను ఈ తరం నటుల్లో రామ్‌చరణ్‌కు దక్కటం నిజంగా అద్భుతమైన అవకాశంగానే అభిమానులు భావిస్తున్నారు. కరోనా వల్ల సినిమా ఆలస్యమైనా.. ప్రేక్షకులను మాత్రం రంజింపచేస్తారనే అంచనాలున్నాయి. తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు చెర్రీ. ఇదే ఊపుతో.. తండ్రి చిరంజీవి నటిస్తోన్న ఆచార్యలో అతిథిపాత్రలో కనిపించనున్నాడట. మరో సంచలనమైన విషయం ఏమిటంటే.. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ చెర్రీ నటించబోతున్నారు. సినీవర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. త్రివిక్రమ్ మాంచి కథను ఇటీవలే రామ్‌చరణ్‌కు వినిపించారట. కథ కూడా తనకు నచ్చిందనే చెప్పారట. అయితే ఇది ఎంత వరకూ నిజమనేది తెలియాలంటే మెగాపవర్‌స్టార్ నోరువిప్పాల్సిందే.