మీరు చదివింది నిజమే.. కొత్త సంవత్సరం సరదాగా ఎంజాయ్ చేయటం కొత్తేమి కాదు. కుర్రాళ్లయతే.. ఫుల్‌గా మజా చేయటానికే ఓటేస్తారు. మరి 2021 అంటే.. ఈ రోజు నైట్ పార్టీ కోసం మందు.. చిందు.. బిర్యానీ రెడీ చేసుకుంటున్నారా! అయితే ఓకే.. కానీ ఒక్క చిన్నమాట. కొత్త ఏడాదిని ఆహ్వానించేందుకు ఆ మాత్రం ఉండాల్సిందే. కానీ కరోనా పుణ్యమాంటూ 10 నెలలుగా విందులు.. వినోదాలు అన్నీ దూరమయ్యాయి . కొవిడ్19 పాజటివ్ కేసులు తగ్గుతున్నాయని చంకలు ఎగరేసుకుంటుండగానే కొత్త కరోనా యూకే నుంచి వచ్చేసింది. చైనాకు పుట్టిన బిడ్డగా స్రెయిన్ ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లోనూ క్రమంగా కొత్త కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీని ప్రభావం ఎక్కువగా యువత, పిల్లలపై పడుతుండటంతో సంబరాలకు దూరంగా ఉండాలంటూ చాలా దేశాలు కొత్త హుకుం జారీచేశాయి. ఇండియాలోనూ రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. పైగా కొత్త కరోనా వేగంగా విస్తరించటమే కాదు.. దాని ఫలితంగా భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్యం ఎదుర్కోవాల్సి వస్తుందనే సంకేతాలు వస్తున్నాయి. మరో వైపు వైరస్‌కు టీకా అందుబాటులోకి వస్తున్నా.. అది ఎంత కాలం పనిచేస్తుందనేది చెప్పటం.. కనీసం అంచనా వేయటం కూడా కష్టంగా ఉందట. మొన్నీ మధ్య వ్యాక్సిన్ తీసుకున్న ఒక నర్సు కొవిడ్19 పాజిటివ్ భారిన పడ్డారు. ఈ లెక్కన.. వ్యాక్సిన్ తీసుకున్నా కూడా 10-14 రోజుల వరకూ జాగ్రత్తగా ఉండాలట. కాదని .. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందేనట. కొద్దిరోజులుగా కరోనా కేసులు ఇండియాలోనే కాదు.. ఏపీ, తెలంగాణలోనూ పెరుగుతున్నాయి. కాబట్టి.. ఇంట్లోనే సంబరం చేసుకుంటే.. వైరస్ నుంచి తప్పించుకోవచ్చంటున్నారు వైద్యులు. ఇది చాలదన్నట్టుగా.. చలిగాలులు పెరిగాయి. చలిగా ఉందని. పెగ్గుమీద పెగ్గు వేశారా.. శరీరంలోని నీటిశాతం తగ్గి.. అపస్మారక స్థితికి చేరే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. 2021 స్వాగతం చెప్పాలనే ఆనందంలో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దదనేది డాక్టర్ల హెచ్చరిక.