అమ్మ బ్రహ్మదేవుడో…. కొంప ముంచినావురో! వెండితెరపై కనిపిస్తే మెరుపు మెరిసినట్టు.. దేవకన్య కనిపించినట్టు కలిగే అనుభూతులు. అంత అందాన్ని వర్ణించాలంటే కవుల చేతిలో కలాలు కూడా పదిసార్లు ఆలోచిస్తాయి. ఇక బుర్రలు ఎంతగా మదనపడిపోయి ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. బ్రహ్మదేవుడుకి.. ఒకరోజు ఆలోచన వచ్చిందట. ఎప్పుడూ స్వర్గంలోనేనా అప్సరసలు ఉండేది. భూలోకులు ఏం తప్పుచేశారనే బాదపడ్డారట. అలా.. అతిలోకసుందరి రూపం భువిపైకి చేరిందట… శ్రీదేవి.. మూడు అక్షరాల అందాన్ని ఇంతకు మించి ఎలా వర్ణించాలో అర్ధం కావట్లేదు. ఎందుకిపుడు శ్రీదేవి ముచ్చట అనుకుంటే.. 1963 ఆగస్టు 13న పుట్టారు. ఈ రోజు ఆమె జయంతి. అందుకే ఒక్కసారి ఆ దేవతను.. వసంతకోకిలను కదలిక.. అతిలోకసుందరి గురించి గుర్తుచేస్తోంది.
బడిపంతులు సినిమా.. టెలిఫోన్ గురించి ఓచిన్నారి ఎంచక్కా పాట పాడింది. బూచోడమ్మా.. బూచోడు బుల్లిపెట్టెలో ఉన్నాడంటూ ఆడిపాడిన ఆ చిచ్చరపిడుగు.. అదే సినిమాలో తాతగా నటించిన ఎన్టీఆర్ సరసన వేటగాడు సినిమాలో హీరోయిన్‌గా వావ్ అనిపించింది. అంతేనా.. ఆకుచాటు పిందెతడిసే పాటతో అప్పటి కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది. ఆ సిరిమల్లె పూవు.. పదహారేళ్ల వయసుతో యువతను ఉర్రూతలూగించింది. ఛాందినీ, నాగినీగా బాలీవుడ్‌ను షేక్‌చేసింది. పూలరెక్కలు.. తేనెచుక్కలు పోతపోసినట్టుగా కనిపించే ఆ దేవకన్య.. బుంగమూతి పెడితే.. నవ్వుకున్నాం. కళ్లతోనే కట్టిపారేస్తే బందీలయ్యాం. వసంతకోకిల సినిమాలో ఆమె నటన చూసి ముగ్గులమయ్యాం. బోనికపూర్‌ను పెళ్లిచేసుకుని ఇల్లాలిగా మారిన తరువాత.. ఇంక ఆ అందాన్ని వెండితెరపై చూడలేమని ఎన్ని గుండెల బాధపడి ఉంటాయో. కానీ ఇంగ్లిష్-వింగ్లిష్ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాగానే.. నాటి అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ.. ఆనందం కొద్దికాలమే సుమా! 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించి ఇంద్రపురి వెళ్లిపోయారు. కోట్లాదిమంది అభిమానులకు కన్నీరు మిగిల్చారు.
శ్రీదేవి అందమే కాదు.. ఆమె జ్ఞాపకాలు కూడా మధురమే. కానీ.. శ్రీదేవి జీవితం అందరూ భావించినట్టుగా.. కళ్లెదుట కనిపించినంత ఆనందంగా సాగలేదు. పసితనం నుంచి అమ్మ చెప్పినట్టుగా.. షూటింగ్‌లకు వెళ్లాలి. కెమెరా ముందు హావభావాలు పలికించాలి. టీనేజ్‌లోనే అప్పటి స్టార్ హీరోల సరసన హీరోయిన్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభనబాబు ఇలా..
అగ్ర హీరోలందరి పక్కన ఆమె ఉండాల్సిందే. శ్రీదేవి సినిమాలో ఉందా! బొమ్మ సూపర్‌హిట్టయినట్టే. అంతగా స్టార్‌డమ్ తెచ్చుకున్న శ్రీదేవి అమాయకత్వం.. బోనీకపూర్‌కు దగ్గరయ్యేలా చేశాయి. అందరూ ఆస్వాదించినట్ట బాల్యాన్ని చూడలేదు. యుక్తవయసులో సరదాలు..షికార్లు లేవు. ఎప్పడూ ఏదో తెలియని అభద్రత, భయం ఆమెలో ఉండేవంటూ సహనటులు చెబుతుండేవారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌కు ఆమే మహారాణి. కానీ.. ఆమె మరణం వెనుక దాగిన వాస్తవాలు ఇప్పటికీ అంతుబట్టని రహస్యం. మళ్లీ ఆ అందం.. నేలపై పుట్టాలి.. మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయాలి.