మా ఇళ్లల్లో చనిపోయిన వ్యక్తుల ఫొటోలు ఉంచం. కానీ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటో మాత్రం మా వాళ్ల ఇళ్లల్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన మా మనసులో ఇంకా సజీవంగా బతికే ఉన్నాడనే నమ్మకం.. ఇది హైదరాబాద్ పాతబస్తీకు చెందిన ఓ మైనార్టీ సోదరుడి అభిమానం. ఆయన మరణించి పదేళ్లవుతున్నా.. ఇప్పటికీ అదే మాట. వైఎస్ ఆర్.. ఇది కేవలం ఒక వ్యక్తి కాదు. తెలుగు వారి గుండెచప్పుడు. పంచకట్టుతో నిలువెత్తు రూపం.. నవ్వుతూ పలుకరించే కళ్లు. ఎదుటివాడి కష్టాన్ని అవే కళ్లతో పసిగట్టి.. ఏమయ్యా ఎందుకా కష్టం దాచుకుంటావ్.. అన్నీ నేను చూసుకుంటానంటూ ధైర్యం చెప్పిన పెద్దాయన. కులమతాలకు అతీతంగా అందరికీ ఆయన బంధువు. కాదుకాదు.. ఆత్మబంధువు. పెద్దవాళ్లకు బిడ్డగా కనిపిస్తాడు. పిల్లలకు తాతయ్యగా.. యుక్తవయసు కుర్రాళ్లు తండ్రిగా.. బాబాయిగా.. అన్నగా ఎవరు ఎలా భావిస్తే అలాగే కనిపిస్తాడు. అటువంటి మహానేత లక్షకోట్ల అవినీతి అంటూ ఆరోపణలు వస్తే.. మా అబ్బాయి కంపెనీల మీద విచారణ చేసుకోవచ్చు. ఏదైనా తప్పుచేస్తే చట్టం ఎలా చెబితే అలా చేయనూ వచ్చంటూ.. ధైర్యంగా చెప్పిన ప్రజానాయకుడు. చాలా మంది నాయకులు పుడుతుంటారు. కొందరు మాత్రమే జనం మదిలో చిరంజీవిగా ఉంటారు. వైఎస్ 1975లో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆయన సీఎం కావటానికి 2005 వరకూ పరుగెత్తాల్సి వచ్చింది. ఇన్నేళ్ల ప్రయాణంలో రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడుగా పనిచేశారు. నమ్మినవాళ్లను గుర్తుపెట్టుకుని మరీ ఉన్నతికి బాటలు వేసేవారు.. 2003లో పాదయాత్ర చేసేటపుడు.. చాలా మంది సొంతపార్టీ వాళ్లే పెదవి విరిచారు. 1400 కిలోమీటర్ల ప్రయాణం.. సాధ్యమేనా అంటూ వెనుక నుంచి ఎద్దేవాచేసినవాళ్లూ ఉన్నారు.
కానీ.. అది అందరూ అనుకున్నట్టు పాదయాత్ర కాదు.. దానివెనుక చాలా హోంవర్క్ ఉంది. పల్లెలో రైతుల కష్టాలు, వైద్యం అందక కన్నతల్లి బిడ్డకోసం కార్చిన కన్నీళ్లు. సగటు మధ్యతరగతి కుటుంబాల అతుకుల బతుకులు.. కులవృత్తులు.. ఇలా
అన్నింటినీ చూశాడు. పరిష్కారం చూపేందుకు తనకంటూ లెక్కలు రాసుకున్నాడు. సీఎం కాగానే.. అవన్నీ ఒక్కోటి ఆచరణలోకి తెచ్చాడు. ఆసరా పింఛన్లు, 108 వాహనాలు, ఆరోగ్యశ్రీ.. ఇలా ప్రజలకు ఏం కావాలో అదంతా చేశాడు. 2009లో కూటమి కట్టి విప
క్షాలన్నీ ఏకమైనా.. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఓడించలేకపోయారు. రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశాడు. కానీ.. కాలానికి కన్నుకుట్టినట్టుంది.. ఏవో పాపిష్టికళ్లు వెంటాడినట్టు.. నల్లమల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో కనుమూశాడు. అది నిజంగాకపోతే బావుండు అనుకున్నవారిలో ఆత్మీయులే కాదు.. ఆయన్ను ధ్వేషించేవారూ ఉన్నారు. అంతగా ప్రజలమనసులో
ముద్రవేసుకున్న వైఎస్సార్.. ఇప్పటికీ జనం గుండెల్లో నిలిచే ఉన్నాడు. ఏపీ సీఎంగా జగన్ మోహన్‌రెడ్డి అంతటి స్థాయికి చేరటం.. దారిలో ఎదురైన ఎన్నో అవరోధాలను జయించటం.. ఏడాది పాలనలో జగన్.. వైఎస్ తనయుడుగా గాకుండా.. వైఎస్సార్ ఎవరో తెలుసా.. జగన్ మోహన్‌రెడ్డి తండ్రి అనేంతగా ముద్ర వేసుకున్నాడు. జులై8 వైఎస్ జయంతి సందర్భంగా.. కదలిక పెద్దాయనకు నివాళి అర్పిస్తుంది.