ఒక శ్రీరెడ్డి.. మరో కత్తి మహేష్.. ఇంకో వర్మ.. ఇప్పుడీ రాపాక.. అందరి గురి మెగా ఫ్యామిలీపైనే. ఇంతకీ వాళ్లు.. వీళ్లకు ఏమైనా స్థలం తగాదాలున్నాయా! పొలంగట్టు వివాదాలున్నాయా! అంటే అబ్బే అలాంటిదేమీలేదనే సమాధానమే వస్తుంది. మరి.. వీరంతా దఫాలవారీగా వంతులేసుకుని చిరంజీవి.. పవన్‌కల్యాణ్‌పై ఎందుకు విమర్శలకు దిగుతారనేది ఇప్పటికీ మెగాభిమానులకు అంతుబట్టని ప్రశ్నగానే ఉందట. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినపుడు చిరంజీవిని చాలామంది రాజకీయాలు వద్దని వారించారు. అయినా వినలేదు. ఫలితంగా కొద్ది సమయంలోనే పార్టీను హస్తంలో కలిపేశారు. ఇది నిజంగానే పీఆర్ పీ వెంట నడచిన కార్యకర్తలు, అభిమానులకు షాక్ అనే చెప్పాలి. దీనివల్ల కాపు సామాజికవర్గం అంటే.. టీడీపీ, వైసీపీ రెండూ పీఆర్‌పీ ఏజెంట్‌గానే లెక్కలు వేసుకునేవి. తమ పార్టీలో ఉన్న కాపులనూ అదే కళ్లతో చూసేవి. ఇప్పుడు జనసేనతో పవన్‌కళ్యాణ్ మార్పుకోసమంటూ ముందుకు వచ్చారు. 2019లో జనసేన విజయం పక్కా అనే ధీమా కూడా ఉంది. కానీ.. పవన్ పోటీచేసిన రెండుచోట్ల ఓడటంతోపాటు.. కేవలం రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గెలిచి ఒక్క ఎమ్మెల్యేగా గాజుగ్లాసు తరపున నిలిచాడు. ఓటమి తరువాత పవన్ ఢీలా పడలేదు. జగన్ సరైన పాలన ఇస్తే తాను సినిమాలు చేసుకుంటానంటూ మరో పిలుపు కూడా ఇచ్చాడు. గెలుపోటములకు అతీతంగా తన వెంట నడిచేవారు మాత్రమే రావాలంటూ పిలుపునిచ్చారు పవన్.
అయితే క్షేత్రస్థాయిలో కేడర్ ఉన్నా.. వారిని సంఘటితం చేసేందుకు నాయకత్వం లేకపోవటంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు నిస్తేజంగా ఉండిపోయారు. కరోనా సమయంలోనూ జనసేన పేరిట వేలాది మంది ఆకలి తీర్చారు జనసైనికులు. ఇప్పటికీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ.. జనసేనను బలహీనం చేయాలనే అసాంఘికశక్తుల పథకరచనను సేనాని విస్మరిస్తున్నారు. నాడు మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు పార్టీ వీడుతూ దూషణ పర్వం చేశారు. ఇప్పుడు అదే బాటలో రాజోలు నుంచి గాజుగ్లాసు గుర్తుమీద గెలిచిన రాపాక వరప్రసాద్ తాను.. వైసీపీ ఎమ్మెల్యేనంటాడు. మరి రాజీనామా చేయటమో.. లేకపోతే వైసీపీ కండువా కప్పుకోవటమో చేయవచ్చుగా అంటే.. తూచ్.. మాలోనూ నాలుగు గ్రూపులున్నాయి. ఇప్పుడు నేను పోతే ఆ మూడు గ్రూపులతో గొడవ అంటూ సర్దిచెబుతాడు. పైగా జనసేన గాలివాటం పార్టీ అంటూ ఎద్దేవాచేయటం కొసమెరుపు. పవన్ కూడా మొన్న వర్మను.. ఇప్పుడీ రాపాకను ఇలాగే వదిలేయటం పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సేనాని మౌనాన్ని ఎలా తీసుకోవాలనేది అర్ధం చేసుకోలేకపోతున్నారు. పవన్‌లోని దూకుడును చూసే చాలామంది యూత్ ఆయన వెంట నడుస్తున్నారు. అటువంటి.. పవన్ మాటలకు విరామం ఇచ్చి మౌనంగా ఉండటంపై పవన్ పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చిందనేది జనసైనికుల అభిప్రాయం.