ప్రతిక్షాలు ఎప్పుడూ అధికార పార్టీని తిట్టిపోయాలి. ఏం చేసినా వేలెత్తిచూపాలి. అప్పుడు జనంలో తమకు ఇమేజ్. ఇదే ఇప్పటి వరకూ ఏపీ రాజకీయాల్లో జరుగుతూ వచ్చింది. ప్రభుత్వ తప్పిదాలను వేలెత్తిచూపే చేతులు.. మంచి చేసినపుడు చప్పట్లు కూడా కొట్టగలగాలి. అంతటి ఉదారత.. పరిణితి ఎంతవరకూ సాధ్యమనే ప్రశ్నకు.. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సమాధానమిచ్చాడు. సొంతపార్టీ నేతలే వెలెత్తిచూపుతున్న సమయంలో జగన్‌కు బాసటగా నిలిచాడనే పేరు తెచ్చుకున్నాడు. జగన్‌పై సీబీఐ అభియోగాలున్నాయి. ఇప్పటికే న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయి. అవన్నీ నిర్ధారణ అయేంత వరకూ జగన్ మోహన్‌రెడ్డి నిర్దోషి కిందే లెక్క అనేది వైసీపీ శ్రేణుల వాదన. పవన్ కూడా తనకు జగన్‌తో ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవన్నాడు. జగన్ పాలన బావుంటే తాను సినిమాలు చేసుకుంటానంటూ కూడా ఏనాడో చెప్పారు. ఇప్పుడు జగన్ ఏడాది పాలనలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. నవరత్నాల పేరిట జనాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని గుర్తుచేసేలా చేయటంలో సఫలమయ్యారు. ఏడాది పాలనలో రూ.40,000 కోట్లు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించటం. 30 లక్షల మందికి ఏకకాలంలో ఇంటిస్థలాలు మంజూరు చేయటం… 108, 104 వాహనాలతో సత్వరమే ఆరోగ్యం, ప్రమాదాల భారీన పడిన వారికి ప్రాణాలు పోయటం వంటి కార్యక్రమాలపై పవన్ ప్రశంసలు కురిపించాడు. కరోనా వైద్యపరీక్షల్లోనూ జగన్ చాలా ముందుచూపుతో వ్యవహరించారు. ప్రచార ఆర్భాటం వదిలేసి పనిపై దృష్టిఉంచారు. ఏకంగా 10 లక్షల మందికి కొవిడ్ 19 వైద్యపరీక్షలు చేయించి ఔరా అనిపించారు. ఓ విధంగా చెప్పాలంటే దేశానికే ఆదర్శమయ్యారనాలేమో!మంచిపనిని మెచ్చుకోవటం వంటి గొప్ప సంప్రదాయానికి తెరలేపాడు. కేంద్రంలో వాజ్‌పేయి, పీవీ నరసింహారావు వంటి ఉద్దండులు రాజకీయాల్లో ఉన్నపుడు ఇటువంటి ఘటనలు కనిపించేవి. 2020లో పార్టీలు కులాలు, మతాలుగా విడిపోయి కోట్లాటకు దిగి బండబూతులు తిట్టుకునే సమయంలో
పవన్ కొత్త రాజకీయాలకు నాంది పలికారు. వైసీపీ జెండా పై గెలిచిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వేళ పపన్ మెప్పుకోలు.. ఓ విధంగా వైసీపీ సర్కారుకు బూస్ట్‌గానే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.