నీతికి కేరాఫ్ మేమేనంటూ ఊదరగొట్టిన తెలుగుదేశం అవినీతి ఒక్కోకటీ వెలుగు చూస్తుంది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి రాజధానిని అడ్డంపెట్టుకుని ఎంత నాటకమాడరనేది వైసీపీ సర్కారు బయటపడుతుంది. ఏదైనా పద్దతిగా చేస్తామని జబ్బలు చరచుకున్న తెలుగు తమ్ముళ్లు.. ఇప్పుడు జగన్ దెబ్బకు ఉలిక్కిపడుతున్నారు. కలుగులో భద్రంగా ఉన్నామన నింపాదిగా ఉన్న నేతలను జుట్టుపట్టి మరీ బయటకు తీస్తున్నారు. 2014లో చంద్రబాబునాయుడు అనుభవం.. కొత్త రాష్ట్రానికి అవసరమనే సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. ఫలితంగా జగన్‌ను మరోసారి చూద్దామని ఏపీ ఓటర్లు బాబును నెత్తినపెట్టుకున్నారు. అమరావతి రాజధాని ప్రకటనతో సీమ, కోస్తాలో కొంత వ్యతిరేకత వ్యక్తమైనా.. బాబు తీసుకున్న నిర్ణయాన్ని నాటి విపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి కూడా సమర్ధించారు. కానీ.. రాజధాని వంకతో బాబు అండ్ కో చేసిన మాయలు, అవినీతి అంతా ఇంతా కాదని తాజాగా పోలీసు, సీఐడీ,ఏసీబీ దర్యాప్తుల్లో వెలుగుచూడటంతో టీడీపీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. 2019లోనూ తామే పవర్‌లోకి వస్తామని ఐదేళ్లపాటు సాగించిన అక్రమాలకు తగినమూల్యం చెల్లించుకోవాల్సి రావటంతో సాయం కోసం దిక్కులు చూస్తున్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ ప్రమేయంపై ఏసీబీ అన్ని ఆధారాలు సేకరించింది. పేదలకు అందాల్సిన వైద్యాన్ని కూడా సొమ్ము చేసుకున్న మాజీల కక్కుర్తిని ఏసీబీ సాక్ష్యాలతో సహా వెలుగులోకి తెచ్చింది. అచ్చెన్న అరెస్టయ్యారు. ఇప్పుడు పితాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నేత భాస్కరరావు హత్యలో ప్రధాననిందితుడుగా అరెస్టయ్యాడు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగించిన మైనింగ్ మాఫియా పై సీబీఐ కన్నేసింది. ఇప్పుడు.. అమరావతి రాజధాని చుట్టూ పేదల అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన వ్యవహారంలో విజయవాడకు చెందిన వ్యాపారి గుమ్మడి సురేష్ ప్రమేయం ఉన్నట్టు సీఐడీ తేల్చింది. దీనికి సహకరించిన తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్‌బాబును కూడా తాజాగా సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో
దర్జాగా దోచుకున్న తమ్ముళ్ల గురించి కూడా ప్రభుత్వం సమాచారం సేకరిస్తుందట. ఎటుచూసినా.. తెలుగు తమ్ముళ్లకు గడ్డుకాలం నడుస్తుందనే భావన నెలకొంది. దీన్ని ముందుగానే ఊహించిన కొందరు టీడీపీ నేతలు ఎంచక్కా.. సొంత వ్యాపారాలు, వ్యవహారాలు నడుపుకునేందుకు హైదరాబాద్, బెంగళూర్, కోల్‌కతా, పుణే, గోవా తదితర ప్రాంతాలకు మకాం మార్చటం కొసమెరుపు.
నిజంగానే టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారా.. కావాలనే వైసీపీ కక్ష సాధిస్తుందా.! దీని వెనుక వాస్తవాలు తెలియాలంటే 2024లో టీడీపీ అధికారంలోకి రావాల్సిందే