కరోనా రెండోసారి ఫ్రాన్స్‌లో డేంజర్‌బెల్స్ మోగించనుందనే ఆ దేశ శాస్త్రవేత్తల హెచ్చరికతో భయాందోళనలు నెలకొన్నాయి. ఫ్రాన్స్‌లో 2.25 లక్షల కరోనా కేసులు నమోదు కాగా 30,270 మంది వరకూ మరణించారు. ఇటీవల కొవిడ్ 19 కేసులో ఇటలీ, జర్మనీతోపాటు ఫ్రాన్స్ కూడా బీభత్సంగా మారింది. అటువంటి పరిస్థితి నుంచి కోలుకుంటున్న సమయంలో రెండోసారి వైరస్ విరుచుకుపడుతుందనే సమాచారం ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. గతంతో పోల్చితే ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదుపుచేయలేని పరిస్థితి కూడా రావచ్చనే అభిప్రాయం వ్యక్తంచేశారు. దీనంతటికీ కారణం ప్రజల అవగాహన లోపం. సెలవురోజులు, పార్టీల్లో గుంపులుగుంపులుగా చేరటం వల్ల ఇటువంటి దుస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. నిజమే.. ప్రపంచవ్యాప్తంగా వైరస్ విస్తరిస్తున్న సమయంలో వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్న మాట ఒక్కటే.. భౌతికదూరం పాటించాలి. కేవలం ఇదొక్కటి మాత్రమే వైరస్ భారీనపడకుండా కాపాడుతుంది. కానీ.. ఏ ఒక్కరూ ఆగలేరు. సరదాలు కొద్దికాలం వాయిదా వేసేందుకు ఇష్టపడట్లేదు. ఇదే విధంగా కొనసాగితే.. ఎప్పటికీ.. వైరస్ జనం మధ్యనే ఉంటుందనే హెచ్చరికలు స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తోంది. పదేళ్లపాటు వైరస్‌తోనే సహజీవనం చేయాలంటూ చేసిన ప్రకటన ఇప్పటికే గుబులు పుట్టిస్తుంటే.. రెండోసారి కూడా వైరస్ ప్రపంచదేశాలను చుట్టుముడుతుందనే వార్తలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి.