ఎంతైనా దక్షిణాధి రాజకీయాల్లో ప్రాంతీయపార్టీలదే హవా. జాతీయపార్టీలు కూడా ఏదోఒక పార్టీతో పొత్తుపెట్టుకోవాల్సిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఓటరు నాడి భిన్నంగా ఉంటుంది. ఒక్కఛాన్స్ అంటూ ఎవరు బతిమాలినా.. పోన్లే ఈ సారికి ఈ పార్టీకే ఓటేద్దామంటూ పోలిటికల్ ఎమోషన్‌కు లోనవుతారు. ఐదేళ్ల ముందు ఛీ కొట్టి ఘోరంగా ఓడించిన రాజకీయపార్టీను ఐదేళ్ల తరువాత నెత్తిన పెట్టుకుంటారు. ఒకప్పుడు చంద్రబాబునాయుడును విజన్ ఉన్న నేత అంటూ జేజేలు పలికారు. జగన్‌పై సీబీఐ దర్యాప్తు, అక్రమాస్తుల అభియోగాలతో బాబోయ్ అన్నారు. కానీ అదే జగన్ మోహన్‌రెడ్డిని అఖండ విజయంతో సీఎంను చేశారు.
ఇది కేవలం ఏపీకే మాత్రమే కాదు.. అటు తమిళనాడు, కర్ణాటక, ఒడిషా, తెలంగాణల్లోనూ ఇదే వాతావరణం.. ఓటరు బావోద్వేగం కనిపిస్తుంటాయి. ఇటువంటి తరుణంలో ఏపీలో బీజేపీ బలపడాలని.. వీలైతే అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతుంది. జనసేనతో పొత్తు ద్వారా దాన్ని సాకారం చేసుకోవాలనుకుంటుంది. కానీ.. అంత పెద్ద లక్ష్యానికి పవన్ కళ్యాణ్‌కు మరో బలం తోడవ్వాలి. అదే చిరంజీవి.. ప్రజారాజ్యం పార్టీ స్థాపించటం.. కాంగ్రెస్‌లో కలిపేయటం ద్వారా కొంత చెడ్డపేరు మూటగట్టుకున్న చిరంజీవిపై అభిమానుల్లో ధ్వేషం కంటే అభిమానం పాళ్లే ఎక్కువగా ఉంది. ఆ నాడు వైఎస్ పై ప్రజలకు పూర్తివిశ్వాసం ఉండటం.. ఐదేళ్లు వేచిచూద్దామనే ధోరణి చిరంజీవిలో లేకపోవటంతో 2014లో చంద్రబాబుకు లక్ కలిసొచ్చింది. 2019లో టీడీపీ పై ప్రజా వ్యతిరేకత, వైసీపీకు ధీటుగా మరో ప్రత్యామ్నాయం లేకపోవటంలో జగన్ వైపు జనం మొగ్గుచూపారు. కానీ జగన్‌పై ప్రజల అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ పాలనలో మాత్రం అంతంతమాత్రంగానే అమలవుతున్నాయి. ఇవన్నీ అధికార పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకతను పెంచుతాయనేది విపక్షాల అభిప్రాయం.
ఈ వాతావరణాన్ని తమకు అనువుగా మలచుకుని పాగా వేయాలనే ఎత్తుగడలతో బీజేపీ ఏపీపై దృష్టిసారించింది. కేంద్రం ద్వారా ఏపీకు అవసరమైన తోడ్పాటును అందిస్తూనే కమలం పట్ల సానుకూలత పెంచుకోవాలని చూస్తుంది. నిజంగానే బీజేపీ ఏపీలో బలపడితే.. ఏ పార్టీకు నష్టం అనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో దెబ్బతిన్న టీడీపీకే దీనివల్ల ఎక్కువ నష్టమనేది వైసీపీ వాదన. అందుకే చిరంజీవికి కాషాయకండువా కప్పి.. పవన్‌కు మరింత బలం చేకూర్చేందుకూ మంతనాలు సాగిస్తోంది. కాపులకు బీసీ రిజర్వేషన్లు అది కూడా బీసీలకు నష్టం కలగకుండా ఇచ్చేందుకూ మార్గాలను అన్వేషిస్తున్నారట. తద్వారా కాపులు,బీసీలను తమవైపునకు మళ్లించుకోవటం తోపాటు హిందుత్వ భావనతో అధికశాతం హిందూ ఓటర్లను ఆకర్షించటం వల్ల వైసీపీకూ కాస్త ఇబ్బందికరమనేది టీడీపీ విశ్లేషణ. బీజేపీ వ్యూహం విజయవంతమైతే…. అధికారం సాధించటం సంగతి ఎలా ఉన్నా బలమైన పార్టీగా ఏపీలో పాగా వేయగలదనేది కమలనాథుల అంతరంగం.