ఏపీలో ఏ సంఘటన జరిగినా రాజకీయం చేయటం కొత్తేమీ కాదు. కానీ ప్రజల ప్రాణాలు పోతున్నా ఇదే విధమైన పంథాలో పోవటమే సామాన్యులను కలవరపెడుతోంది. అధికారం చేపట్టిన ప్రతిపార్టీ తమ సొంత కులానికే ప్రాధాన్యతనివ్వటం దశాబ్దాలుగా చూస్తున్న విషయమే. అయిన వారికి కంచంలో.. కాని వారికి ఆకుల్లో వడ్డించే సంప్రదాయంతో ఏపీ జాతీయస్థాయిలో ప్రతిష్ఠను దూరం చేసుకుంటూనే ఉంది. ఇపుడు అదే దారిలో విజయవాడలోని రమేష్ ఆసుపత్రి చుట్టూ రసవత్తరమైన కుల రాజకీయం నడుస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలంటేనే.. కులాధిపత్యం ఉండటం సర్వసాధారణం. మొన్న విజయవాడలోని రమేష్ ఆసుపత్రి నిర్వహణలోని స్వర్ణప్యాలెస్ ఆసుపత్రిలో 12 మంది కొవిడ్ రోగులు మరణించారు. కరోనా భయాన్ని బూచిగా చూపుతూ వైరస్ లేని వారినీ కూడా హోటల్లో ఉంచి మరీ చికిత్స చేశారనేది ప్రభుత్వ అధికారుల విచారణలో తేలిన నిజం. అయితే.. అది కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిది కావటం వల్లనే ప్రభుత్వం కఠినంగా ఉంటుందనే విమర్శలూ లేకపోలేదు. రమేష్ ఆసుపత్రి నిర్వహణలో సభ్యురాలైన డాక్టర్ మమతను పోలీసులు ప్రశ్నించారు. ఆమె రాయపాటి సాంబశివరావు కోడలు కావటం వల్లనే ఇలా చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు చూసే ఆమె కూడా కొవిడ్ రోగులకు అందిస్తున్న వైద్యం విషయంలో బాధ్యురాలు అనేది అధికారుల వాదన. ఆ ప్లేస్‌లో ఎవరున్నా.. వాస్తవాలు తెలుసుకునేందుకు విచారణ తప్పని పరిస్థితి. కానీ.. దీన్ని భూతద్దంలో చూపుతూ.. డాక్టర్ మమత అమాయకురాలని.. ఆమె కొవిడ్‌తో బాధపడుతుందంటూ ఆమె తరపు బంధువులు బోలెడు సానుభూతితో స్పందిస్తున్నారు.
అదే సమయంలో కేవలం ప్రాణాలు కాపాడుతారనే భరోసాతో రమేష్ ఆసుపత్రిలో రోజుకు లక్ష రూపాయల ఫీజులిచ్చి ఉన్న 12 మంది ఊపిరి తీసిన వారిని ఏమనాలి? బతికించాల్సిన ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం అంతమంది ఉసురు తీస్తే ఎవర్ని నిందించాలి? కళ్లెదుట ఇంత జరుగుతున్నా చూసీచూడనట్టుగా వ్యవహరించిన అధికారులనా! కొవిడ్ ఆసుపత్రులపై సరైన పర్యవేక్షణ మరచిన సర్కారునా? కేవలం డబ్బుపై ఆశ తప్ప మరే విధమైన ఆలోచన లేని ఆసుపత్రి యాజమాన్యాన్నా? కళ్లెదుట ఇంత దారుణమైన సంఘటన జరిగిన తరువాత కూడా రాజకీయం చేస్తున్న విపక్షాలనా? మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే.. అధికారులను స్వేచ్ఛగా విచారణ చేయనివ్వాలి. విపక్షాలు, అధికార పక్షం.. రాజకీయం వదిలేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి. నిందితులకు కఠినంగా శిక్షపడేందుకు చొరవచూపాలనేది సామాజిక వేత్తల సూచన.