ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టారు. హమ్మయ్య.. పేద్ద కుర్చీలోకి చేరారు. నిజమే.. సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్సీ తరువాత పార్టీ అధ్యక్ష పదవి. చాలా కష్టపడే ఉంటారు. ఎన్నో వ్యక్తిగత ఇష్టాయిస్టాలు త్యాగం చేసి ఉండొచ్చు కూడా. కానీ.. పీఠంపై చేరగానే అధికారపీఠం దక్కుతుందనేది ఆశ.. తీరటం అంత శులభమేం కాదు. అసలే రాజకీయ ఉద్దండులు..అంతకు మించిన ఎత్తులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపగల అపర రాజకీయ చాణక్యులు చాలామందే ఉన్నారు. పైగా బిహార్ నుంచి దిగుమతి అవుతున్న సలహాదారులు.. కుల, మత రాజకీయాలను ఏపీకూ అంటించారు. కానీ.. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి.. సోము వీర్రాజుకు పదవి వచ్చినట్టు తెలియగానే.. అమాంతం చిరంజీవి వద్దకు వాలిపోయారు. మరుసటి రోజు.పవన్ కళ్యాణ్. అంతేనా.. మాజీ దళపతి కన్నా వద్దకు చేరి కొద్దిసేపు మంతనాలు జరిపారు. అన్నా.. నీకు నేనున్నా నంటూ పదవి నాదే కానీ.. పలుకుబడి అంతా నీదేనంటూ కాస్త కన్నాగారికి కంటగింపుగాకుండా జాగ్రత్త కూడా పడ్డారు. ఎంతైనా ఏపీలో ఉండటం వల్ల రాజకీయాలు.. సమీకరణల వ్యూహాలు బాగానే వంటపట్టించుకున్నట్టుగా సోము వీర్రాజుపై పార్టీ నేతలు కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
ప్రత్యర్థులు మాత్రం.. అబ్బే.. ఆయన కార్పోరేటర్‌గా కూడా గెలవలేడంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీనికి ప్రతిగా.. బీజేపీ నేతలు కూడా వెంకయ్యనాయుడు కూడా అంతే.. కానీ బీజేపీ ఆయన్ను ఉపరాష్ట్రపతికి చేసిందంటూ కౌంటర్ ఇస్తున్నారు. పోన్లే వారి అంతర్గత గొడవ మనకెందుకు అనుకుంటే.. ఇప్పుడు సోముకు చాలా సవాళ్లున్నాయి. అదే జనసేనానితో కలసి పనిచేయటం.. పవన్ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ.. ఆయనలోని తిక్కను కూడా అంచనా వేసుకోగలగాలి. మరోవైపు టీడీపీ మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే.. మీడియా.. దాని ముందు ఎమోషన్‌కు గురైతే.. అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని గమనించాలి. ఏపీలో భిన్నమతాలు గెలుపోటముల్లో కీలకం. కుల పంచాయతీలు ఉండనే ఉన్నాయి. కాబట్టి.. కేవలం ఉత్తరాధిన భుజాన వేసుకున్నట్టుగా ఓన్లీ హిందుత్వం అనుకుంటే అసలుకే మోసం వస్తుంది. అదే మాదిరిగా కేవలం కాపులకే వత్తాసు పలికితే మిగిలిన కులాలు దూరమయ్యే ప్రమాదం లేపోలేదు. స్థానిక ఎన్నికల్లో ఎంతోకొంత మెరుగైన పరిస్థితి చూపాలి. ఆర్ ఎస్ ఎస్, భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ వంటి అనుంగులను నొప్పించకుండా అడుగులు వేయాలి. ఏమైనా.. అధ్యక్షపీఠం సాధించుకున్న వీజీ కాదు… ఏపీలో రాజకీయాలను తట్టుకుని నిలబడటం అనేది కొందరి వాదన. కానీ.. అదే ఆంధ్రలో పుట్టిన తనకు ఇవేం కొత్త కాదనేది వీర్రాజు అభిమానుల అభిప్రాయం.