వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన ప్రజారంజకం. సంక్షేమాన్ని మాత్రమే నెత్తినపెట్టుకున్న ప్రభుత్వం అభివృద్ధిని దూరం చేస్తుందనే అపవాదును మూటగట్టుకుంటోంది. సహజంగానే ఇది అధికార పార్టీను ఇరుకున పెట్టే అంశంగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉచితం ఇది వైసీపీను గట్టెక్కిస్తుందనేది పార్టీ వర్గాల అపారమైన విశ్వాసం. సామాజికవర్గాల వారీగా అందజేస్తున్న వ్యక్తిగత లబ్ది కూడా తమకు రాజకీయంగా లాభిస్తుందనేది వైసీపీ నుంచి వ్యక్తమయ్యే అభిప్రాయం. ఏడాదిన్నర పాలనలో జగన్ అధికశాతం సంక్షేమపథకాలకే ప్రాధాన్యతనిచ్చారు. రాజకీయంగా కూడా బీసీలకు అత్యథికంగా ప్రాముఖ్యత ఇస్తున్నాననే సంకేతాలు పంపారు. ప్రభుత్వ పరమైన నిర్ణయాల్లోనూ వివాదాలు… కోర్టు నుంచి మొట్టికాయలు చవిచూడాల్సి వచ్చింది. దాదాపు 67 సార్లు న్యాయస్థానాలు ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. ఒక ఎస్పీను ఏకంగా ఖద్దరుకు అనుకూలంగా పనిచేసేందుకు ఖాకీ వృత్తి అవసరమా! అనేంతగా హెచ్చరించింది. ఆలయ భూములు, విశాఖ రాజధాని, టీడీపీ నేతలపై దాడులు, మాజీ మంత్రులపై కేసులు. ఇవన్నీ వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేవే. కానీ.. సామాన్య ఓటర్లు ఏమనుకుంటున్నారు? కేసులు, దాడులతో తమ బంధువులు, స్నేహితులు ఇబ్బంది పడుతుంటే వారెలా భావిస్తారు? 2024లో వైసీపీ అధికారం చేపడితే ఇదే అరాచకం తాండవిస్తుందనే ఆలోచన జనాల్లోకి చేరితే నష్టపోయేదెవరు? నిస్సంకోచంగా వైసీపీయే అంటున్నారు సామాజికవేత్తలు. టీడీపీ గత ఐదేళ్లలో చేసిన తప్పులను ఇప్పుడు వైసీపీ కూడా చేస్తుంది. అవినీతి, అక్రమాలు, కేసులు బనాయించి వైసీపీను ఎలా ఇరుకున పెట్టారో.. దానికి ప్రతీకారంగా వైసీపీ కూడా అదే దారిన నడుస్తోంది. పల్నాడులో టీడీపీ నేతలు, కార్యకర్తలు సొంతూళ్లు వదలి తెలంగాణ వలస పోవటమే ఇందుకు కారణం. వైసీపీ చేస్తున్న ఈ తప్పులన్నీ టీడీపీ పట్ల సానుభూతిని పెంచుతాయి. భవిష్యత్‌లో వైసీపీ తరువాత ఎవరున్నారనన్నపుడు చంద్రబాబు గుర్తుకొస్తాడు. జగన్‌తో పోల్చితే
చంద్రబాబే చాలా ఉత్తమం అనే ఆలోచన సామాన్య ఓటర్లలో ఒక్కసారి బలపడితే వైసీపీ ఎన్ని సంక్షేమ పథకాలు, మరెన్ని ఉచిత
వరాలు అందించినా ప్రజల్లో అపనమ్మకం, అభద్రత అలాగే ఉంటాయి. జగన్ ఆలోచన మంచిదే కావచ్చు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకగణం విచ్చలవిడిగా రెచ్చిపోవటం ద్వారా ప్రజలు తమ భద్రత ప్రమాదంలో ఉందనే అంచనాకు వస్తారు. 2019లోనూ చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు తప్పుబట్టలేదు. ఐదేళ్లపాటు పల్లె నుంచి పట్టణం వరకూ అవినీతి, అక్రమాలతో చెలరేగిన తెలుగుతమ్ముళ్ల ఆగడాలపై తిరుగుబావుగా ఎగురవేశారు. ఇప్పుడు అదే దారిలో వైసీపీ కూడా బరితెగింపు ప్రదర్శిస్తే
2024లో ఏపీ ఓటర్లు కూడా జగన్ మంచోడే కానీ.. బాబోయ్ నేతల అరాచకాలు మనం తట్టుకోలేమనే అభిప్రాయానికి వస్తే..2019లో టీడీపీకు ఎదురైన చేదు అనుభవమే వైసీపీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనేది విశ్లేషకుల అంచనా. కాబట్టే.. వైసీపీ చేసే తప్పిదాలు టీడీపీను మరింత బలంగా.. ప్రజల్లో సానుభూతిని పెంచుతాయనేది తెలుగు తమ్ముళ్ల అంతరంగం.