పోలీస్ అంటే ఇలా ఉండాలి.. చెల్లి కోసం పోరాడే అన్నయ్య . విలనిజంలో ఆ నాటి విలన్లను గుర్తుచేశాడు. సింహాచలం.. ఒక్కటే జననం.. ఒకటే మరణం అంటూ.. ఎంతగా స్పూర్తినింపాడు. మగధీరలో షేర్‌ఖాన్ పాత్రను ఎవరు మరచిపోగలరు. అందుకే.. రియల్‌స్టార్ అయ్యాడు. సామాజిక సేవలో ప్రజల మనిషిగా నిలిచిపోయాడు
కంచుకంఠం.. నవ్వులు పలికించగల అభినయం. బావోద్వేగాలను అవలీలగా పలికించిన నటుడు శ్రీహరి. పరిచయం చేయాల్సిన అవసరం లేని స్టార్. అగస్టు 15న రియల్‌స్టార్ జయంతి. కృష్ణాజిల్లా స్వస్థలమే అయినా బతుకుబాటలో హైదరాబాద్ చేరారు. పెద్ద కుటుంబం.. చాలని ఆదాయం. అయినా ఏ రోజు అధైర్యపడలేదు. చదువుకుంటూనే.. మెకానిక్ షాపు నడుపుతూ కన్నవారికి అండగా ఉండేవారు అన్నదమ్ములు. పెద్దవాడు శ్రీహరికి మాత్రం.. ఏదో సాధించాలనే తపన. బాడీబిల్డింగ్‌పై దృష్టిపెట్టారు. బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు బస్సుఛార్జీల్లేవు.
రోజూ 11 కిలోమీటర్ల పరుగు. వానొస్తే.. తడుస్తూ మెకానిక్‌షాపులో తలదాచుకునేవారు. పేదరికాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించానంటూ శ్రీహరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వాన చినుకులకు తడుస్తూ ఉండేందుకు అన్నదమ్ములు సరదాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేశామంటూ వెల్లడించారు. ఆ తరువాత బాడీబిల్డింగ్‌లో సాధనతో మిస్టర్ హైదరాబాద్‌గా ఎంపికయ్యాడు. అప్పుడే ఎస్సై ఉద్యోగం వరించినా.. ఇన్‌స్పెక్టర్ అయితేనే చేరతానంటూ వదిలేశాడు. బాలానగర్‌లో థియేటర్‌లో సినిమాలు చూస్తూ.. బయట హీరోల కటౌట్ల మాదిరిగా తాను ఉండాలనే సంకల్పం.. సినిమాల వైపు నెట్టింది.
అంతే.. వెండితెరపై వెలగాలనే తలంపుతో దాసరి నారాయణరావు వద్దకు చేరారు. శ్రీహరిలోని పట్టుదల చూసి నేనే నిన్ను హీరో చేస్తానంటూ హామి కూడా ఇచ్చారట. అలా బ్రహ్మనాయుడు సినిమాలో తొలిసారి ముఖానికి రంగేసుకున్న శ్రీహరి బ్రేక్ నిచ్చింది మాత్రం తాజ్‌మహల్ సినిమాయే. ఫైట్స్‌లో వైవిధ్యం.. నటనలో ప్రత్యేకతలు శ్రీహరిని విలన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ఆ తరువాత హీరోను చేశాయి. షేర్‌ఖాన్ పాత్రలో మగధీరలో శ్రీహరిని తప్ప ఎవ్వర్నీ ఊహించలేనంతగా చెలరేగాడు. గణపతి సినిమాలో కన్నీరు పెట్టించాడు. హలోబ్రదర్, బావగారూ బాగున్నారా వంటి వాటిలో నవ్వులు కురిపించి కమెడియన్లకు సవాల్ విసిరాడు. తాను ఏ పాత్ర చేసినా ఒదిగేవాడు.. ఢీ సినిమాలో డాన్‌గా వావ్ అనిపించాడు.
శ్రీహరి ఉంటే.. ఆ సినిమా మినిమం గ్యారంటీ అనేంతగా ఎదిగారు. పాత్ర ఏదైనా… బాడీలాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేసే రియల్‌స్టార్.. గొప్ప మనసున్న అన్నయ్య… పెద్దవాళ్లకు బిడ్డ. సాయం కోసం ఎవరొచ్చినా లేదనకుండా చేయూతనిచ్చేవారు. ఎందరో నటీనటులు ఇబ్బందుల్లో ఉన్నపుడు అన్నీ తానై అండగా ఉన్నాడు. బెదిరింపులు.. బ్లాక్‌మెయిల్ చేసిన వారికి చేతితో సమాధానం చెప్పిన రియల్‌హీరో. డిస్కోశాంతితో వివాహం చేసుకున్నాడు.. ఇద్దరు పిల్లలు. సజావుగా సాగుతున్న సమయంలో కొన్ని అలవాట్లు శ్రీహరి ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. కూకట్‌పల్లి నియోజకర్గం నుంచి పోటీచేసి గెలవాలనే ఆశ తీరకుండానే.. మరణించేందుకు కారణమయ్యాయి. ముంబైలో ఓ షూటింగ్‌లో అకస్మాత్తుగా అనారోగ్యం పాలైన శ్రీహరి 2013 అక్టోబరు 9న కన్నుమూశారు. ఏళ్లు గడిచినా… అభిమానుల గుండెల్లో ఉండిపోయారు. శ్రీహరి వారసుడు మేఘాంశ్ రాజ్‌దూత్ సినిమాతో మెప్పించాడు. మున్ముందు శ్రీహరి ఆశయాలను.. ఆలోచనకు వారధిగా ఉండాలని అభిమానులు ఆశీర్వదిస్తున్నారు. గీతాఆర్ట్స్ సంస్థ శ్రీహరి జయంతి సందర్భంగా ట్వీట్టర్‌లో షేర్‌ఖాన్ చిత్రం ఉంచి నివాళులర్పించింది.
చాలా బాగా రాసారు