ఎవరో సోనూసూద్. పుణేలో రైళ్లుపట్టుకుని ఉద్యోగం చేసిన సామాన్యుడు. సినీ రంగంలోకి వచ్చాక విలన్‌గా స్ధిరపడ్డాడు. కరోనా సృష్టించిన బీభత్సంలో అల్లాడిపోతున్న సగటు కుటుంబాలకు పెద్దదిక్కయ్యాడు. దేశం నలుమూలల ఎవరికి ఏ కష్ట మొచ్చినా కదులుతూ.. విలన్ కాస్తా హీరో అయ్యాడు. సామాన్యులకు ఆత్మీయుడుగా మారాడు. అంత వరకూ బాగానే ఉంది. మరి హిందీ, తెలుగు, తమిళం, మళయాళం ఇలా అన్ని వుడ్స్ లో స్టార్‌లుగా ఎదిగి… కోటానుకోట్లు సంపాదించిన హీరోలంతా ఏమయ్యారు. రిక్షా తొక్కి.. కూలీనాలీ చేసిన సొమ్ములతో సినిమా టికెట్లు కొని హీరోలను ఆరాధించిన అభిమానులకు వాళ్లేం చేశారు. పుట్టినరోజు వేడుకల్లో కాయకష్టం చేసిన సొమ్మంతా హీరోల పేరుతో ఖర్చుచేసిన నిరుపేద అభిమానులకు కష్టకాలంలో ఎవరైనా పలుకరించారా! బిగ్‌బీ నుంచి ఖాన్‌ల వరకూ… మోహన్‌లాల్ నుంచి రజనీకాంత్ వరకూ.. ఇకపోతే తెలుగు సినీరంగంలో ఒక్క చిరంజీవి మినహా ఎవ్వరూ ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయారు. లాక్‌డౌన్‌లో ఇల్లు ఊడ్చుతున్నానంటూ ఒకరు. మా
ఆవిడకు బట్టలు ఉతకటంలో సాయం చేస్తున్నానంటూ మరొకరు. ఇలా.. హీరోలంతా చీపుళ్లు, గరిటెలు తిప్పే పనిలో బిజీగా మారారు. కుర్రహీరోలు కూడా ధైర్యం చేయలేకపోయారు. ఐటీ ఉద్యోగులు, చిరువ్యాపారులు కూడా స్పందించి పేద, నిరుపేద కుటుంబాలకు సాయం అందించారు. ఓ కూతురు చదువు కోసం దాచిన రూ.3లక్షలూ పక్కవారి కోసం ఖర్చుచేసిందో కుటుంబం. ఓ ఉద్యోగి. తన ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రా చేయగా వచ్చిన రూ.5లక్షలు వృద్ధులు, పేద బ్రాహ్మణుల ఆకలి తీర్చేందుకు వెచ్చించాడు. ఇలా.. మనీ లేకపోయినా మనసుతో స్పందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, మహానటి సావిత్రి వంటి మహనీయులు.. తాము తారలుగా అగ్రపథాన ఉన్న సమయంలో రాయలసీమ కరవు, దివిసీమ ఉప్పెన, చైనాతో యుద్ధం, ఇలా దేశానికి.. తెలుగు రాష్ట్రానికి కష్టం వచ్చినపుడు జోలెపట్టి మరీ డబ్బులు సేకరించి సాయం అందించారు. వారి వారసులుగా వచ్చి.. తొడలు కొట్టి.. జబ్బలు చరస్తూ డైలాగ్‌తో కోట్లు జేబులో వేసుకున్న.. వేసుకుంటున్న స్టార్‌లు మాత్రం.. ఇంటి గుమ్మం దాటి బయటకు రాలేకపోయారు. దాచుకున్న సొమ్ములో కొంతైనా అభిమానులకు.. ఆదరించే ప్రేక్షకులకు పంచాలనే కనీస స్పందన మరిచారు. ఎవరో ఒక విలన్ పాత్రధారి చేస్తున్న పనిని కూడా అభినందించే సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే.. మీరేం చేశారంటూ జనం నిలదీస్తే.. ఆ హీరోల వద్ద సమాధానం లేదుకాబట్టి.