శరణమంటే రక్ష. రణమంటే మరణభిక్ష శరణమా రణమా.. తెలుగు జాతి అధములం కాదు..ప్రధములం . సమయం లేదు మిత్రమా…! పౌరాణికంలో నటవిఖ్యాత నందమూరి తారకరాముడి వారుసుడి గా బాలకృష్ణ పలికిన డైలాగ్‌లు. తెలుగోడి పౌరుషానికి ప్రతీకగా నిలిచే గౌతమీపుత్ర శాతకర్ణిని కళ్లెదుట సాక్షాత్కరింపాయి.
ఈ డ్రస్ ఉంటేనే పోలీస్‌ను.. డ్రస్ విప్పితే నీకంటే పెద్ద రౌడీను.. ఏ సెంటర్‌లో కొట్టుకుందాం.. సమయం నువ్వుచెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే..
కంటిచూపుతో చంపేస్తా..
నా అడుగు పడితే.. నాకు ఎమోషన్స్ ఉండవ్. ఫీలింగ్స్ ఉండవ్.. కాలిక్యులేషన్స్ ఉండవ్..
నరికే కొద్దీ నీకు అలుపు వస్తదేమో.. నాకు ఊపొస్తదీ..
నేను గట్టిగా తొడకొట్టానంటే.. ఆ సౌండ్‌కే గుండాగి చస్తావ్.
మాస్ డైలాగ్‌లతో బాక్సాఫీసు వద్ద కలెక్సన్లు కురిపించి.. జనాలతో ఈలల వేయించిన బాలయ్య నిజంగా ఎన్టీఆర్‌కు అసలు సిసలైన వారుసుడే అంటారు దర్శకుడు బి.గోపాల్. రౌడీఇన్‌స్పెక్టర్ సినిమాలో బాలకృష్ణ డైలాగులు విని.. పొంగిపోయానంటారు. అక్కడ పలికిన హావభావాల్లో ఎన్టీఆర్ కనిపించారంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన అభిమానాన్ని వెల్లడించారు.
14 ఏళ్లకే తాతమ్మకల
బుద్దిగా బడికెళ్లే వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన బాలయ్య నటసింహంగా ఎదిగాడు. వారసత్వం కేవలం.. ఒకటీరెండు సినిమాల వరకే పరిమితం. ఆ తరువాత సత్తా చాటుకోవాలి. మాస్‌లో ఇమేజ్ కోసం ఎన్నో కొత్తపాత్రలు ధరించాలి. ఇవన్నీ తాను అలవోకగా చేశాడు కాబట్టే.. తెలుగు నాట నందమూరి అందగాడుగా 46 ఏళ్లుగా కొనసాగుతున్నాడు. నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు జూన్ 10 జరుపుకోపుతున్నారు. 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు వేడుకలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బాలయ్య 1974లో తొలిసారి తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో తాతమ్మకల సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలిసారి కెమెరా ముందుకు వచ్చినా ఏ మాత్రం తోట్రుపాడు పడకుండా సహజంగా నటించాడు. వాస్తవానికి ఎన్టీఆర్‌కు బాలయ్యను సినిమాల్లోకి తీసుకురావాలనే ఉండేది. కానీ.. ఎన్టీఆర్ తండ్రికి మాత్రం హరికృష్ణను హీరో చేయాలనే తపన కనిపించేది. దీన్ని ఎన్టీఆర్ అంగీకరించకపోవటంతో.. మనుమడు కోసం ఆయన గొడవ కూడా పడ్డారట. ఒకనొకదశలో హరికృష్ణ సినిమాల్లోకి వస్తే వెండితెరపై ఎన్టీఆర్‌కు పోటీ అనే భావన ఉందనే అనుమానం కూడా వెలిబుచ్చారట. హరికృష్ణ కొన్ని పౌరాణిక సినిమాల్లో నటించినా బాలయ్య మాత్రం సినీ, రాజకీయ వారసుడిగా నిలిచారు. 1984లో సాహసమే జీవితం తొలిసారి హీరోగా నటించారు. అంతకుముందు.. ఎన్టీఆర్‌తో అన్నదమ్ముల అనుబంధం నటించినా మురళీమోహన్, ఎన్టీఆర్‌లతో మూడో హీరోగా కనిపిస్తారు. 1984లో ఏడెనిమిది సినిమాలు విడుదలైనా.. అన్నీ బాగానే ఆడాయి. వాటిలో మంగమ్మగారి మనుమడు మాత్రం మాస్ హీరోగా నిలిపింది. ఆ తరువాత కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఎన్నో సినిమాలు నటించారు. ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, అల్లరికృష్ణయ్య, ముద్దుల మావయ్య, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి వంటి వాటిలో పంచకట్టుతో అలరించారు. బాలయ్య 50 వ సినిమా నారీనారీ నడుమమురారీ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మాంచి హిట్ అందుకుంది. ఆదిత్య 369, బైరవద్వీపం వంటి వాటితో తాను ప్రయోగాలకు రెడీ అని చాటారు. కృష్ణార్జున విజయం అనే సినిమా వచ్చినా అనుకున్నంత హిట్‌కాలేదు. గుండమ్మకథ, నర్తనశాల ఈ తరానికి తగినట్టుగా తీయాలనేది బాలయ్య కల. కానీ..ఆ నాటి పాత్రలను పోషించేందుకు సరైన నటీనటులు లేరనే ఉద్దేశంతో అలాగే ఉండిపోయాయి. 100 సినిమా గౌతమీపుత్రశాతకర్ణితో విజయదుందుబి మోగించారు. పైసావసూల్‌తో పాటపాడి అలరించిన.. బాలయ్య తాజాగా ఎన్టీఆర్ నటించిన జగదేకవీరునికథ సినిమాలోని శివశంకరీ.. పాటను ఆలపించి అభిమానులకు పుట్టినరోజు బహుమతిగా అందించటం.. నటసింహానికే చెల్లింది. బోళామనిషిగా.. సినీవర్గాల్లో పేరుంది. అందుకే.. కోపం వచ్చినా.. వెంటనే ప్రదర్శించాల్సిందే. సాయం కోసం వచ్చినా వెంటనే చేయాల్సిందే. బాలకృష్ణ తండ్రి అలవాట్లను పుణికి పుచ్చుకున్నారు. ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. షూటింగ్ ఉన్నా లేకపోయినా.. ప్రతిరోజూ 10 కిలోమీటర్ల నడక, యోగ, వ్యాయామం తప్పనిసరి. మితాహారిగా మారారు.