ఒక అంగుళం భూమి పోతుందంటే రైతుల ప్రాణం విలవిల్లాడుతుంది. ప్రాణాన్నైనా వదలకుంటాం కానీ.. పంటనిచ్చే భూములను వదలకునేందుకు అన్నదాతకు మనసురాదు. పంటలు పండకపోయినా భూమితల్లిపై రైతన్నకు అంతటి అపేక్ష. కానీ.. అమరావతి చుట్టుపక్కల 29 గ్రామాల రైతులు మాత్రం.. కేవలం రాజధాని కోసం 34000 ఎకరాలు అప్పగించారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే.. అదే రైతుల కంటకన్నీరు తెప్పిస్తున్నారు. ఈ పాపం శాపంగా వెంటాడుతుందనేది పాలకులు గ్రహించాల్సి ఉంది. మాట తప్పం.. మడమతిప్పం.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడుగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తరచూ చెప్పే మాట. తండ్రిబాటలో మాట పై నిలబడతాడనే ఏపీ ఓటర్లు నమ్మకం పెట్టుకున్నారు. నవరత్నాల అమలుతో ఇది నిజమనే భావించారు. కానీ.. ఇక్కడే ఘోరమైన తప్పిదం చేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ తప్పిదంలో తిలాపాప తలా పిడికెడు అన్నట్టుగా చంద్రబాబు నిర్ణయాలు కూడా ఉన్నాయనేది మేధావివర్గం అభిప్రాయం. రాజధానిగా అమరావతిలో శాశ్వత నిర్మాణాలు, గెజిట్ నోటిఫికేషన్ లేకపోవటం వల్ల రాజధాని తరలిపోవటానికి బాబు తప్పు కూడా ఉందనేది సగటు ఏపీ ఓటరు ఆవేదన. 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించినపుడు విపక్షంలో ఉన్న వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ సమ్మతి తెలిపింది. కేంద్రంలోని ఎన్డీఏ తరపున ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అమరావతికి జై కొట్టారు. అమరలింగేశ్వరుడు కొలువైన ప్రాతం. పచ్చని పొలాలు.. గలగల పారే కృష్ణమ్మతో వాస్తుపరంగా కూడా అద్భుతమంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. ఇలా అందరూ అంగీకారంతో ప్రజారాజధాని అమరావతి రూపుదిద్దుకుంది. ఆ తరువాత భూకంపాల ముప్పు, కొండవీడు వాగు వరదనీటి ఉదృతి వల్ల అమరావతికి ప్రమాదమంటూ ఏవో కట్టుకథలు అల్లారు. అవన్నీ అభూత కల్పనగా కొట్టిపారేస్తూనే చంద్రబాబు రాజధాని నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కానీ.. ఐదేళ్ల సమయంలో అక్కడ పూర్తి వసతులతో నిర్మాణాలు పూర్తిచేసి రాజముద్ర వేయించినట్టయితే జగన్‌కు అవకాశం ఉండకుండా పోయేది. కానీ బాబు తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు మాత్రం జరిగింది.
ఇప్పుడు ఏపీ సీఎం జగన్ వంతు వచ్చింది. బాబు నిర్మించిన.. ప్రకటించిన రాజధాని అమరావతిలో పాలన సాగించటాన్ని ఎందుకో అంగీకరించలేకపోతున్నారు. చంద్రబాబు కనుసన్నల్లో ఉండే అమరావతిలో తాను ఉండలేననే భావనకు వచ్చారు. గతంలో విజయలక్ష్మిని ఓడించిన విశాఖను రాజధాని చేయటం ద్వారా తన చెప్పుచేతల్లో విశాఖను ఉంచుకోవాలనే ఆలోచన కూడా దాగుందనేది విజ్ఞుల అంతరంగం. అందుకే.. ఏకపక్షంగా మూడు రాజధానులకు ముడివేశారు. ఇది న్యాయపరంగా చెల్లుబాటు కాదంటున్నారు న్యాయనిపుణులు. సీఆర్ డీఏ చట్టం తీసివేయటం ద్వారా రాష్ట్రపతి ఆమోదముద్రకు వ్యతిరేకంగా వ్యవహరించినట్టుగా పేర్కొంటున్నారు. ఒకవేళ రాజధాని తరలింపు చేసినట్టయితే.. 29 గ్రామాల్లో రైతులు ఇచ్చిన 34000 ఎకరాలకు భారీగా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దిక్కరించినట్టవుతుందనేది అమరావతి రైతులు అభిప్రాయం. విశాఖను పరిపాలన రాజధానిగా చేయటాన్ని సవాల్ చేస్తూ తాము హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్తామంటున్నారు అమరావతి రైతులు. పైగా తమకున్న న్యాయపరమైన హక్కులు జగన్ సర్కార్ మెడకు చుట్టుకోవటం తథ్యమంటున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా గత ఎన్నికల్లో చెప్పినట్టుగా.. ఏపీలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా
రాజధానులు మార్చుకుంటూ పోతే.. అది రాష్ట్రానికి ప్రమాదమన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి నెలకొంది. మరి దీనిపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన నిర్ణయానికి కారణాలను ఏపీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదే సమయంలో చంద్రబాబు గెజిట్ నోటిఫికేషన్ జారీచేయకపోవటానికి వివరణ ఇచ్చుకోవాల్సి ఉందనేది ఏపీ ప్రజల అభిప్రాయం. కానీ కేంద్రంలో బీజేపీ తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందనేది మరో ప్రశ్న. ఎటుచూసినా.. కేవలం రాజకీయ చందరంగంలో అమరావతిని పావుగా వాడుకుంటున్నారు. దీని తాలూకూ ప్రతిఫలం కూడా ఎలా ఉండబోతుందనేది భవిష్యత్ ఎన్నికల్లో గానీ తేలదు.