ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి పాలన భేష్ అంటూ ఇటీవల ఇండియాటుడే- కార్వే ఇన్‌సైడ్ మూడ్ ఆఫ్‌ది నేషన్ సర్వే తేల్చింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది అనుభవం ఉన్న సీఎంలుండగా.. మూడోస్థానంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్‌రెడ్డి నిలవటం విశేషం. నిజానికి జగన్ ఇంతగా ఎదుగుతారని.. మొండితనం.. దూకుడు స్వభావం ఉన్న ఆయన సీఎం అవుతారని చాలా మంది పార్టీ సీనియర్లే అంచనా వేయలేకపోయారు. కానీ.. అదే మొండితనం.. అదే దూకుడు ఆయన్ను సీఎంను చేసింది. జనం మెచ్చేలా మార్చేసింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చినా… జగన్ అనే పేరును జనం గుండెల్లో చిరకాలం ఉండేలా తనదైన ముద్రవేసుకోవటంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి జగన్ మోహన్‌రెడ్డి బాల్యం.. నుంచి నెమరవేసుకుందాం.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, విజయమ్మ దంపతులకు వివాహమైన మరుసటి ఏడాది అంటే.. 21 డిసెంబరు 1972 లో జగన్ మోహన్‌రెడ్డి పుట్టారు. కొడుకును పెద్ద చదువులు చదివించాలనే బలమైన ఆకాంక్ష ఉండేది. జగన్‌కూ తల్లి వద్దనే చనువు. ఇంతకీ పసితనంలో జగన్‌ను ముద్దుగా ఏమని పిలిచేవారో తెలుసా.. సన్నీ. మొదట పులివెందులోని కాన్వెంట్‌లో అక్షరాలు దిద్దిన ఆ పిల్లవాడు తమిళనాట పేరున్న కొడైకెనాల్ బోర్డింగ్ స్కూల్‌లో మొదటితరగతిలో చేరాడు. కానీ… అమ్మమీద బెంగ… తల్లికి బిడ్డమీద మమకారం ఉన్నా చదువు అక్కడే కొనసాగింది. వైఎస్ఆర్ ఎమ్మెల్యే అయ్యాక కుటుంబం హైదరాబాద్ మారింది. అలా జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు మారాడు. ఎక్కువ సమయం చదకవపోయినా ఎప్పుడూ టాపర్‌గానే ఉండేవారట. అమ్మ నేర్పిన క్రమశిక్షణతో ఉదయం పెందలాడే నిద్రలేవటం.. చదువు.. ఆటల్లోనూ.. జీవితంలోనూ అలవాటుగా మారింది. చిన్నపుడు జగన్‌కు గోళ్లు కొరికే అలవాటు ఉండేదట. దీనిపై తండ్రి వైఎస్ గట్టిగా మందలించారట. దీంతో అప్పటికే స్మోకింగ్ అలవాటున్న తండ్రివైపు కోపంగా చూస్తూ నవ్వు కూడా సిగరెట్లు కాలుస్తున్నావ్ కదా అంటూ ఎదురు ప్రశ్నవేశాడట. దీంతో
ఆ తండ్రి మనసు నేను సిగరెట్లు మానేస్తాను.. నువ్వు గోళ్లు కొరకటం మానేస్తావా అంటూ అడిగేశారట.. ప్రశ్నించే గుణం పసితనంలో అలవడిందనేందుకు ఇదో నిదర్శనంగా జగన్ బాల్యమిత్రులు గుర్తుచేస్తుంటారు.
2003 ఏప్రిల్ 9న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్ర యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కదిలించింది. విపక్షాలు కూడా ఇది కేవలం ఎన్నికల స్టంట్‌గా భావించాయి. క్రమంగా వైఎస్‌కు లభిస్తున్న ఆదరణ చూసి నివ్వెరపోయాయి. కాంగ్రెస్ పార్టీ ఇది తమకు లాభం అనుకుంది. కానీ.. ఆ యాత్రలో వైఎస్ పేదవాడి గుండెచప్పుడు వింటున్నాడని గుర్తించలేకపోయారు. పలితంగా 2004 ఎన్నికల్లో అద్భుతవిజయంతో వైఎస్ సీఎం అయ్యాడు. ఐదేళ్లపాటు జనం గుండెల్లో నిలిచి.. 2009లోనూ కూటములు కట్టినా.. కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా వైఎస్ విజయాన్ని ఆపలేకపోయారు. కానీ.. విధి మాత్రం.. ఇకచాలు.. పైలోకాల్లో నీకు పనుందంటూ ఇంద్రపదవి కోసం వైఎస్‌ను తీసుకెళ్లారు. పెద్దాయన లేడనే విషాధవార్త ఎన్నో గుండెలు ఆగేలా చేసింది.
తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించేందుకు 2010 ఏప్రిల్ 9న జగన్ ఓదార్పుయాత్ర ప్రారంభించారు. అలా దాదాపు 1,707 కి.మీ యాత్రలో నడిచారు. అప్పుడే ఏపీ ప్రజలు డిసైడ్ అయ్యారు. ఈయనే మా నాయకుడు.. వైఎస్ అడుగుజాడల్లో తమకు పెద్దన్నగా నిర్ణయానికి వచ్చారు. వైఎస్ జగన్‌కు సంఘీభావంగా ఆ నాడు 26 మంది హస్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తట్టుకోలేని నాటి యూపీఏ సర్కారు పెద్ద ప్లాన్‌కు శ్రీకారం చుట్టింది. నాటి ఎమ్మెల్యే శంకర్‌రావు తో ఫిర్యాదు చేయించారు. లక్షకోట్ల అబియోగాలతో సీబీఐను రంగంలోకి దింపారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఉండగానే 2012 మే 27న జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. జైల్లో ఉన్నపుడు కుంగిపోతాడని భావించిన ప్రత్యర్థులు ఉలిక్కిపడేలా జగన్ మరింత రాటుదేలాడు. శారీరకంగా, మానసికంగా దృఢంగా మారాడు. 2013 సెప్టెంబరు 23న బెయిల్‌పై విడుదలయ్యారు. 2014 ఎన్నికల్లో గెలుపు పక్కా అనుకుంటున్న సమయంలో బీజేపీ, జనసేనలతో రాజకీయపొత్తుతో టీడీపీ గెలిచింది.
2019లో మాత్రం… ఒక్కఛాన్స్. రావాలి జగన్ కావాలి జగన్ నినాదాలను జనం ఆదరించారు. విపక్షాలు గుంపుకట్టి దండయాత్ర చేసినా ఒంటరిగా దిగిన సింహం మాదిరిగా జగన్ మోహన్‌రెడ్డి భారీ మెజార్టీతో తన వారిని గెలిపించారు. ఇదంతా కేవలం ఒన్‌మ్యాన్‌షోగానే విశ్లేషకులు ఇప్పటికీ వర్ణిస్తుంటారు. ప్రమాణస్వీకారం కూడా నిరాడంబరంగానే పూర్తిచేశారు. విపక్షంలో ఉన్న దూకుడును రెట్టింపు చేస్తూ పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ ఏకతాటిపై నడిపిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. అటు టీడీపీకు చుక్కలూ చూపుతున్నారు. తండ్రే నయం.. చూసీచూడనట్టు వదిలేశాడు. బాబోయ్ ఈయనేమిట్రా అనేంతగా ప్రత్యర్థులకు చుక్కలు చూపుతున్నారనటంలో అతిశయోక్తి లేదేమో. ఏడాదిన్నర పాలనలో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు
విమర్శలు తెచ్చిపెట్టినా.. సామాన్య ప్రజల్లో మాత్రం.. జగన్ అసలు సిసలైన మా రాజన్న వారసుడే అనే భావనను మరింత బలపడేలా చేసుకున్నారు. అదే ఇప్పుడు దేశంలోనే అత్యంత సమర్తవంతమైన సీఎంలలో మూడో స్థానంలో నిలిచేలా చేసిందంటున్నాయి వైసీపీ శ్రేణులు.