జ‌గ‌న్ గెలిచాడు.. బాబు ఓడాడు!

రెండూ ఒక్క‌టే క‌దా! అనుకోవ‌చ్చు. కానీ.. ఇక్క‌డే రాజ‌కీయం క‌నిపిస్తుంది. కొట్ట‌డం వేరు.. క‌సితీరా కొట్ట‌డం వేర్వేరు. 2014కు ముందు ప‌దేళ్ల‌పాటు ఏలుబ‌డిలో ఉన్న కాంగ్రెస్ ఆరేళ్ల‌పాటు వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న‌తో బాగా పుంజుకుంది. ఆయ‌న మ‌ర‌ణంతో 2009 త‌రువాత ప‌రిస్థితులు మారాయి. రోశ‌య్య‌, న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సీఎంలుగా ఏం చేశారంటే.. ఏం చేయ‌లేదంటూ మ‌రో ప్ర‌శ్న ఎదుర‌వుతుంది. ల‌క్ష‌కోట్లు మాయ చేశారంటూ వైఎస్ పై అంత దుమ్మెత్తిపోసినా.. విప‌క్షాల‌న్నీ ఏక‌మైన కూట‌మి క‌ట్టినా 2009లో వైఎస్‌ను చూసి జ‌నం ఓట్లేశారు. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పాల‌న సూప‌ర్ అంటూ. జ‌నం మెచ్చుకున్నా ఎందుకో న‌ల్లారిని నాయ‌కుడుగా జ‌నం భావించ‌లేక‌పోయారు. 2014 ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్ చేసిన పెద్ద త‌ప్పిదం.. రాష్ట్ర విభ‌జ‌న‌. అదే ఏపీలో హ‌స్తం పార్టీను క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌కుండా మార్చింది. అప్పుడు జ‌గ‌న్ గెలుపు గుర్రం ఎక్కేందుకు రెఢీగా ఉన్నాడు. కానీ.. కొత్త రాష్ట్రం అనుభ‌వం లేని జ‌గ‌న్‌తో పోల్చితే.. ప‌రిపాల‌న ద‌క్ష‌త ఉన్న నేత‌గా చంద్ర‌బాబును నెత్తిన పెట్టుకున్నారు. ప‌వ‌న్‌, న‌రేంద్ర‌మోదీ హ‌వా మ‌రింత క‌ల‌సివ‌చ్చింది. 2019 నాటికి బాబు అదే న‌మ్మ‌కాన్ని ఏపీ ప్ర‌జ‌ల్లో కొన‌సాగించ‌టాన్ని మ‌ర‌చిపోయారు. తానే ఏపీకు దిక్కు అనేంగా మితిమీరిన ఆత్మ‌విశ్వాసం బాబును రాజ‌కీయంగా చోటుచేసుకుంటున్న మార్పుల‌ను క‌నిపించ‌కుండా చేసింది. ప‌క్క‌న చేరిన భ‌జ‌న‌బ్యాచ్ కూడా తోడైంది. ఐదేళ్ల‌పాటు టీడీపీ నేత‌ల చుట్టూ మూగిన మందీమార్భ‌లం అందిన‌కాడికి దోచుకుంది. అవినీతి ఉన్నా.. ఏదో నామ‌కేవాస్త్ అనే బాబు పాల‌న‌లో మ‌రో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని చూశారు. క‌మ్మ వ‌ర్గ ప్రాభ‌ల్యం పెరిగింద‌నే అభిప్రాయం మిగిలిన సామాజిక‌వ‌ర్గాల్లో జీర్ణించుకుంది. దీంతో 2019లో క‌మ్మ వ‌ర్సెస్ నాన్‌క‌మ్మ అనేంత‌గా వైసీపీ విప‌రీత‌మైన ప్ర‌చారం చేసింది. పోల‌వ‌రం టెండ‌ర్లు, అమ‌రావ‌తి నిర్మాణాన్ని
ఉదాహ‌ర‌ణ‌లుగా చూపింది. అప్ప‌టికే చంద్ర‌బాబు కేవ‌లం ఉత్స‌వ విగ్ర‌హం అనే బ‌ల‌మైన అభిప్రాయం ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డింది. ప‌వ‌న్ గ‌ట్టి పోటీ ఇస్తాడ‌నుకున్నా.. ప‌వ‌న్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ మిత్రులు అనే సంకేతాలు ప్ర‌జ‌లు కూడా విశ్వ‌సించారు. అందుకే… చంద్ర‌బాబును క‌సిగా ఓడించాల‌నే ల‌క్ష్యంతో బారులు తీరారు. జ‌గ‌న్ గెలిస్తే.. కొత్త‌వాడు కాబ‌ట్టి ఏదైనా చేస్తార‌నే న‌మ్మ‌కంతో గెలిపించారు. ఇలా.. జ‌గ‌న్ గెలిచాడు… బాబు ఓడాడు అంటూ విశ్లేష‌కులు జ‌గ‌న్ ఏడాది పాల‌న ముందు ప‌రిస్థితుల‌ను విశ్లేషిస్తున్నార‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here