ముక్కుసూటితనం.. మాటలో కరకుదనం.. వెన్నలాంటి మనస్తత్వం.. కులమతాలకు అతీతంగా అందరినీ అక్కునచేర్చుకునే పెద్దరికం.. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయంటే గుర్తొచ్చేది నందమూరి హరికృష్ణ. తెలుగువారికి శీతయ్య.. నిజంగానే మాటతీరులో శీతయ్యే. మాట ఇచ్చామంటే నిలబడాలి. మా వల్ల కాదనుకుంటే.. అస్సలు మాటే ఇవ్వకూడదనే నాయకత్వ లక్షణం. నందమూరి తారకరామారావు తనయుడు హరికృష్ణ.. 1952 సెప్టెంబరు 2న నిమ్మకూరులో పుట్టారు. తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ చైతన్యరథానికి హరికృష్ణ సారథి. నడిచింది.. ఎన్టీఆర్ అయినా.. నడిపించింది మాత్రం హరికృష్ణ అంటారు. తాతకు నచ్చిన మనువడు. వాస్తవానికి హరికృష్ణను హీరోచేయాలని ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్యచౌదరి భావించేవారట. ఒకనొక సమయంలో ఆయన కొడుకు ఎన్టీఆర్‌పై మండిపడ్డారట కూడా. హరికృష్ణ హీరో అయితే ఎన్టీఆర్ కు పోటీ అవుతారనే భయమే కారణమంటూ కొడుకును నిలదీశారట. హరికృష్ణ బాలనటుడుగా తొలిసారి 1964లో తండ్రితో కలసి శ్రీకృష్ణావతారం నటించారు. ఆ తరువాత రామ్‌రహీమ్, తల్లా పెళ్లామా, రామ్ రాబర్ట్ రహీమ్‌లో మెప్పించారు. దానవీరశూరకర్ణలో అర్జునుడుగా హరికృష్ణ ఆకట్టుకునే నటనకు ఎన్టీఆర్ వందమార్కులు వేశారట. సీతారామరాజు, లాహిరిలాహిరిలో మల్టీస్టారర్ సినిమాల్లో మెప్పించారు. శీతయ్య సినిమాతో అప్పటికే హీరోలుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లకు ధీటుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టైగర్‌హరిశ్చంద్రప్రసాద్, స్వామి వంటి వాటితో అన్న వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో రాణించే అవకాశం ఉన్నా ముక్కుసూటితనం, నిజాయతీ ఆయన్ను రాజకీయంగా ఎదగకుండా చేశాయంటారు అభిమానులు. 2018 అగస్టు 29 నల్లగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు. హరికృష్ణ 64వ జయంతి సందర్భంగా అభిమానులు నివాళులర్పించారు. తండ్రిని స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్‌గా ట్వీట్టర్‌లో స్పందించారు.