అమంచి అలుగుతారు.. కరణం కన్నెర్ర చేస్తారు. వల్లభనేని విరుచుకుపడతారు. దుట్టా పంతం పడతారు. అవంతి సవాల్ విసురుతారు. ఆర్డర్.. బెదిరిస్తారు. శ్రీదేవి సైలెంట్ అవుతారు.. వైసీపీ అంతర్గత పోరు తారాస్థాయికి చేరుతోంది. ఎంత కప్పిపుచ్చుదామన్నా హద్దులు దాటుతున్న నేతల వార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు ఇబ్బందికరంగా తయారైందట.
పదేళ్ల పాటు పట్టువదలని విక్రమార్కుడుగా సాధించుకున్న సీఎం పీఠం. 16 నెలలు జైలు జీవితం గడపివచ్చినా తగ్గని హవా. ఇవన్నీ ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అంటే ఠక్కున గుర్తొచ్చేవి. రాజకీయ శూరులుగా చెప్పుకుని జబ్బలు చరచుకునే నేతలు కూడా సాధించలేని విజయం అందుకున్న జగన్‌ను అంతర్గతపోరు తెగ చికాకు పెడుతోందట. అప్పటికీ కులాలు, మతాల వారీగా అందరికీ సమానం అంటూ.. రెడ్లకు కాస్త ఎక్కువ సమానం అన్నా.. ఎవ్వరినీ నోరుమెదపకుండా చేయటంలో అనుకున్నది సాధించారు. ఇప్పుడు అసలు తంటా ఏమిటంటే.. పదేళ్లపాటు.. వైసీపీ నేతలకు చుక్కలు చూపిన అదే పచ్చబ్యాచ్‌ను మళ్లీ మా నెత్తిపై రుద్దుతున్నారనేది ఈ గొడవలకు కారణం. విశాఖ నుంచి గుంటూరు వరకూ ఇదే పరిస్థితి. రాజకీయంగా ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్‌లో తలనొప్పులు తప్పవనేది అధినేత అంతర్మథనానికి అసలు కారణమట.
ఇంతకీ ఏపీలో వైసీపీ అంతర్గత పోరుకు కృష్ణాజిల్లా కేరాఫ్ గా మారింది. గన్నవరంలో వల్లభనేని వంశీ వైసీపీ సానుభూతి పరుడైన ఎమ్మెల్యేగా మారారు. అప్పటికే అక్కడ వైసీపీ నేతలుగా ఉన్న అబ్బయ్యచౌదరి, దుట్టా రామచంద్రరావుకు ఇది కొరకరాని కొయ్యగా మారింది. పైగా పదేళ్లపాటు వైసీపీలో ఉన్న కార్యకర్తలను కాదని.. వంశీ అనుంగులకు పెత్తనం ఇవ్వటం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇరు వర్గాల మధ్య రోజూ ఏదోరూపంలో రచ్చ జరుగుతూనే ఉండటం పార్టీకు ఇబ్బందిగా మారిందట. విశాఖలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి చేరాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. మంత్రి అవంతి వర్గం మాత్రం.. తూచ్ అంటూ అడ్డుపడుతుంది. గంటా వస్తే.. మేం ఉండబోమంటూ పరోక్షంగా హెచ్చరించటం కొసమెరుపు. కర్నూలు జిల్లాలోని నందికొట్కూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్డర్ కూడా అలకబూనారు. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తన నియోజక వర్గంలో జోక్యం చేసుకోవటం తప్పుబట్టారు. వైసీపీ యువతనేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికే పార్టీ ప్రాధాన్యతనిస్తుందంటూ ఆవేదన కూడా చెందారట.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై సొంత పార్టీ కార్యకర్తలే అంబటి అక్రమ మైనింగ్ చేస్తున్నాడంటూ హైకోర్టును ఆశ్రయించారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వర్సెస్ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి . చిలకలూరిపేటలో ఎమ్మెల్యే రజనీ వర్గం.. సీనియర్ నేత మర్రి రాజశేఖర్ వర్గాల మధ్య అంతర్గత పోరు ఉండనే ఉంది. ప్రకాశంజిల్లా చీరాలలో మాజీ నేత అమంచి కృష్ణమోహన్.. ఎమ్మెల్యే కరణం బలరాం మధ్య వార్ షురూ అయింది. వైసీపీ కప్పుకోకున్నా.. తాను అదే పార్టీ అంటూ కరణం కర్రపెత్తనం అమంచి వర్గాన్ని ఇరుకున పెడుతోందట. అసలే ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలో.. పార్టీలో అంతర్గత పోరు అధినేతకు చికాకుగా మారిందట.




ఆంధ్ర రాష్జ్త్రంలో ఆధికార, ప్రతి పక్ష నాయకులు , మాటలు, విమర్శలు గురించి ఎంత మాట్లాడకుంటే అంత ప్రశాంతం..విషయమేమిటంటే ప్రజలు గొర్రెలుగా మారిపోతున్నారు…కానీ ప్రజలు గొర్రెలు కానే కాదు..గొర్రెకు పుట్టిన పొట్టేళ్లు కూడా ఉంటాయని నాయకులు గుర్తుంచుకోవాలి…దేనికైనా సమయం సందర్భం వస్తుందిగా…