దేవతామూర్తులు , ఉత్సవరథాల విధ్వంసపై ప్రభుత్వ నిర్లిప్తతకు వ్యతిరేకంగా బీజేపీ-జనసేన సంయుక్తంగా ధర్మపరిరక్షణ దీక్షకు పిలుపునిచ్చాయి. దీనిలో భాగంగా జనసేనాని పవన్‌కళ్యాణ్ హైదరాబాద్‌లోని స్వగృహంలో దీక్ష ప్రారంభించారు. జనసేన-బీజేపీ కలసి తొలిసారి చేపట్టిన అధికారిక నిరసన ఇదే. ఉదయం 10-11 గంటల వరకూ దీక్ష ద్వారా ఏపీ సర్కార్‌కు నిరసన తెలపాలనేది ఉద్దేశం. మంత్రి వెల్లంపల్లి కూడా పవన్ దీక్షలు.. విమర్శలను ఎద్దేవాచేసినా.. మరో మంత్రి పవన్‌కు ఏపీతో పనిలేదంటూ విమర్శలు గుప్పించినా పవన్ తరపు నుంచి కౌంటర్ రావట్లేదు. దక్షిణాధిన కాషాయం ఎగురవేయాలనే తపన బీజేపీ నాయకత్వంలో ఉంది. తమిళనాట వర్కవుట్ కాలేదు. ఒడిషాలోనూ పట్నాయక్ ప్రభావం తగ్గలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వ నినాదం .. ధర్మపరిరక్షణ పేరిట హిందువులను ఏకం చేయాలనే భారతీయజనతాపార్టీ ఎజెండాకు రెండు రాష్ట్రాల్లోనూ సరైన సమయం వచ్చింది. ఏపీలో క్రైస్తవం.. తెలంగాణలో ముస్లింలకు ప్రయార్టీ ఇస్తూ.. హిందువులకు ద్రోహం చేస్తున్నారనే వాదన మరింత బలపడుతోంది. సోషల్ మీడియా వేదికగా హిందువులు ఏకతాటిపైకి వస్తున్నారు. అంతర్వేది వంటి ఘటనపై పెల్లుబుకిన నిరసనకు పోటెత్తిన ఆందోళనకారులే ఉదాహరణగా హిందుసంఘాలు విశ్లేషిస్తున్నాయి. క్రైస్తవం, ముస్లింల హక్కులకు భంగం వాటిల్లకుండా.. పరమతాలను గౌరవిస్తూనే.. తమ ధర్మాన్ని, దార్మిక సంస్థలను కాపాడుకుంటామనేది ఇప్పుడున్న మార్గంగా వీహెచ్‌పీ, భజరంగ్దళ, ఏబీవీపీ వంటి బీజేపీ అనుబంధ సంఘాల అభిప్రాయం.
బీజేపీ దేశభక్తి గురించి చెప్పాల్సిన పనిలేదు. అదే సమయంలో హిందుత్వ నినాదం కూడా ఎజెండాలో భాగమే. జనసేన మతప్రసక్తిలేని సర్కారు కావాలంటోంది. దేశభక్తి గురించి పవన్ తరచూ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూనే ఉంటాడు. పవన్ పుట్టినరోజు సందర్భంగా పాకిస్తాన్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన కొందరు హ్యాకర్లు.. పవన్ సినిమాలోని దేశభక్తి పాటను ఉంచారు. రెండు పార్టీలకు దేశభక్తి కామన్ పాయింట్. హిందుత్వం అనే అంశం లేకుండానే ధర్మపరిరక్షణగా.. అందరికీ.. అన్నిమతాలకు గౌరవం.. వారి సంప్రదాయాలకు విలువ ఇవ్వాలనే నినాదాన్ని జనసేన ప్రజల్లోకి తీసుకెళ్తోంది. జగన్ సర్కార్‌పై పెరుగుతున్న ఒత్తిడి.. టీడీపీ హయాంలో తిరుమలతిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో జరిగిన కొన్ని సంఘటనలు చంద్రబాబును అభాసుపాల్జేశాయి.

ఇప్పుడు జగన్ విషయంలోనూ తిరుమల, శ్రీశైలం, అంతర్వేది ఘటనలు పాలనపై అపనమ్మకాన్ని పెంచేందుకు కారణమవుతున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ.. జనసేన రెండూ ప్రజల్లోకి తీసుకెళ్లటం ద్వారా రాజకీయంగా ఒక మెట్టు ఎక్కే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఓ వైపు.. ప్రభుత్వ తప్పిదాలను వేలెత్తిచూపుతూ.. మరోవైపు జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తల మధ్య బావోద్వేగాలను దగ్గరయ్యేలా చేసేందుకు కలసి చేపట్టే ఆందోళనలు ఉపకరిస్తాయనేది కూడా తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రభుత్వంపై ఘాటునే స్పందించారు. గతానికి బిన్నంగా బీజేపీ కూడా స్పష్టమైన స్టాండ్ తీసుకుంది. కేంద్రంలో బీజేపీకు ఎవరి సపోర్టు అవసరంలేదు. ప్రజల్లోనూ మోదీకు క్లీన్‌చీట్ ఉంది. కాబట్టి.. ప్రాంతీయపార్టీల ఎంపీ సీట్ల కోసం జోలెపట్టాల్సిన పనిలేదనేది బీజేపీ నేతల అబిప్రాయం. అందుకే.. ఏపీలో వైసీపీ సర్కార్ తప్పిదాలను విమర్శిస్తూనే.. హిందువులను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు రెండు పార్టీలు మాంచి స్కెచ్గీశాయి. అంతర్వేది ద్వారా అనుకోని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలోనూ చాలా వరకూ సక్సెస్ అయ్యారు. అయితే సోము వీర్రాజు.. అందరినీ కలుపుకుని పోవాలంటున్నాయి బీజేపీ శ్రేణులు. పవన్ కూడా. ఏపీలో కొద్దికాలం మకాం వేస్తే మరింత రసవత్తరమైన రాజకీయం ఏపీ ప్రజలకు పరిచయం చేస్తామంటున్నారు కాషాయనేతలు.



