ముంబైలో అంతే.. ముంబైలో అంతే.. డైలాగ్ గుర్తుందా! రౌడీఅల్లుడు సినిమాలో అల్లు రామలింగయ్య నోటి నుంచి వచ్చే డైలాగ్. అప్పుడు కామెడీ పంచ్‌కు ఇప్పుడు ముంబయిలో పరిస్థితులు అద్దం పడుతున్నాయి. కంగనారౌత్ పుణ్యమాంటా ముంబై పేరు మారుమోగుతోంది. చివరకు పాకిస్తాన్ నెటిజన్లు కూడా అమ్మ కంగనమ్మ.. ముంబైను మా పాకిస్తాన్‌తో పోల్చవద్దంటూ కౌంటర్లు ఇచ్చేంత వరకూ చేరిందన్నమాట. సుశాంత్‌సింగ్ రాజపుత్ ఆత్మహత్య తరువాత పరిస్థితులు మారాయా! లేకపోతే.. బాలీవుడ్‌లో చీకటి కార్యకలాపాలను వెలికితీసేందుకు సుశాంత్ మరణం వేదికగా మారిందా! అనే అంశం కూడా చర్చనీయాంశం. ఎందుకంటే.. గతంలోనూ కునాల్(ప్రేమికులరోజు ఫేం) వంటి కుర్రహీరోలు అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకున్న సంఘటనలున్నాయి. అప్పటికి కంగనా లాంటి వాళ్లు లేకపోవటం వల్ల అవన్నీ మరుగున పడి ఉంటాయనే బ్యాచ్ కూడా లేకపోలేదు. ఏమైనా.. శుశాంత్ కేసులో రియాచక్రవర్తి అరెస్టుతో కేసు మరోమలుపు తిరిగింది. అది ఎంత వరకూ దారితీస్తుందనే అంచనా వేయటం కూడా కష్టమే. నటి కంగనా రనౌత్ ఆఫీసును ముంబై మున్సిపాలిటీ కూల్చివేస్తుంది. దీనిపై ఠాక్రే సర్కారు గట్టిగానే ఉంది. అయితే.. గవర్నర్ మాత్రం మండిపడ్డారు. మున్సిపాలిటీ మాత్రం.. అబ్బే మేం కావాలని కూల్చివేయట్లేదు.. రెండేళ్ల క్రితమే వాళ్లకు నోటిసులిచ్చాం.. స్పందించకపోవటంతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటున్నారు. మహారాష్ట్ర సీఎంపై కంగనా కామెంట్స్‌పై కేసులు నమోదయ్యాయి. ముంబై వస్తానంటూ సవాల్ విసిరిన కంగనా.. వచ్చేసింది. చుట్టూ 11 మంది పోలీసులతో ఏ వీఐపీకు లేనంత రక్షణచట్రం మధ్య దర్జాగా వచ్చింది. తాను చెప్పాలనుకుంది చెప్పేసింది. కథ ఇంతటితో ముగిస్తే బాగానే ఉంటుంది.. ఈ కేసులో సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ .. రేపు కొత్తగా ఏమైనా ఆధారాలు దొరికితే ఎన్ ఐ ఏ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అసలు కేసేమిటీ.. దీనిచుట్టూ జరుగుతున్న వ్యవహారం ఏమిటో.. ఒక్క పట్టాన అర్ధం కావట్లేదు. అందుకే.. ముంబైలో అంతేనంటూ పక్కకు తప్పుకోవాల్సిందే అనేది నెటిజన్ల గుసగుసలు.