చార్మినార్ రేకులంత దృఢంగా పార్టీ ఉన్నా.. పాపం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రం కష్టాలు తప్పట్లేదు. ప్రజల్లో చరిష్మా ఉన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలుచున్నా.. స్వీయ తప్పిదాలు వారిద్దరినీ వెంటాడుతున్నాయి. నిత్యం జగన్నామస్మరణ చేస్తూ.. ఉన్నా అయినోళ్లతోనే తగువులాట మొదలైంది. చివరకు సీఎం వద్దకూ పంచాయతీ చేరటంతో రేపటి రాజకీయ భవిష్యత్‌పై కూడా ఇద్దరూ మల్లగుల్లాలు పడుతున్నారట. మొదట్లో హింట్ ఇచ్చినప్పుడైనా.. సైలెంట్ అయితే బావుండేదని ఇప్పుడు అనుకుంటున్నారట అయినా. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఏం ప్రయోజనమంటూ పార్టీ శ్రేణులు ఎద్దేవా చేయటం కొసమెరుపు. ఇంతకీ.. ఆ ఇద్దరూ ఎవరంటారా… ఒకరు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మరొకరు తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి. ఇద్దరూ వివాదాలకు కేరాఫ్ చిరునామాగా నిలిచేవారే. సంయమనం పాటించాల్సిన చోట కూడా నోటికి పనిచెబుతారు. వివాదాలు.. వీరిని వెతక్కుంటూ వస్తాయో.. వీరే వివాదాలను కనిపెడతారనేది కూడా ఎవ్వరికీ అంతుబట్టిని విషయం. జగన్ మొదట్లోనే ఎమ్మెల్యేలు, ఎంపీలకు హింట్ ఇచ్చారు. ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు తేలితే.. పార్టీ నుంచి తప్పిస్తానంటూ గట్టిగానే హెచ్చరించారు. కానీ. వీరిద్దరూ అవే అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కోనే పరిస్థితికి చేరారు. సత్తెనపల్లిలో అంబటిని ఓ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. అసలు ఎన్నికలపుడు సీటు కేటాయిస్తే.. మేం అంబటితో నడవమంటూ జగన్ వద్దకు వెళ్లారు. ఏదోలాగా గండం గట్టెక్కి.. ఎమ్మెల్యే అయినా స్వపక్షంలోని వ్యతిరేకవర్గం ఏకంగా అక్రమైనింగ్‌లో అంబటి ఉన్నాడంటూ కోర్టును ఆశ్రయించారు. తూచ్ నాకేం తెలియదంటూ అంబటి ఎంతచెబుతున్నా.. నిప్పులేకుండా పొగ వస్తుందా! అంటూ పార్టీ సీనియర్లు కూడా అనేశారట.
మరో ఎమ్మెల్యే తాడికొండ శ్రీదేవి.. అమరావతి రాజధాని పార్టీ ఎమ్మెల్యే. రాజకీయనేతగా కలుపుగోలు తనం చాలా తక్కువ. మొదట్లోనే బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో గొడవైంది. తన నియోజకవర్గంలోకి ఎలా వస్తావంటూ గొడవ చేసేంత వరకూ ఎంపీ చేరారు. ఆ తరువాత వినాయచవితి వేడుకల్లో తనను రానివ్వలేదంటూ రాజధాని ప్రాంతంలో గొడవ కు దిగారు. ఇసుక, అక్రమమైనింగ్, అధికారుల బదిలీల పేరిట అనుచరులు భారీగా వసూళ్లకు దిగుతున్నా చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ మధ్యనే ఆమె పేకాట ఆడిస్తుందనే ఆరోపణలూ వెల్లువెత్తాయి. సొంత సామాజికవర్గానికి చెందిన వారు కూడా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఓ బాధితుడు తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమంటే పోలీసు కేసు పెట్టిస్తానంటూ బెదిరించిందంటూ.. ఏకంగా సెల్ఫీవీడియో తీసి సీఎం జగన్ మోహన్‌రెడ్డికి పంపారు. ఇప్పటికే ఆమెపై రాజధాని ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. రాజధాని తరలింపుపై ఎలాంటి స్పందన లేదంటున్నారు. తమకు అన్యాయం జరగకుండా కాపాడాల్సిన శాసనసభసభ్యురాలు ముఖం చాటేయటంపట్ల పార్టీలకు అతీతంగా వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. ఎటు చూసినా.. ఇటు స్వపక్షంలోను.. అటు వ్యతిరేకవర్గంలోనూ మహిళా ఎమ్మెల్యేగా సాధించాల్సిన సానుభూతిని దూరం చేసుకున్నారంటూ పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇదంతా స్వయకృతమా.. విధి వైపరీత్యమా అనేది మాత్రం.. ఆ ఎమ్మెల్యేలకే ఎరుక.