న్యాయవ్యవస్థలో లొసుగుల కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడనుందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయకోవిదులు, విద్యావేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, మాజీ ప్రభుత్వ అధికారులతో దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో సంస్కరణల కోసం విశాలవేదికను రూపొందించేందుకు జనచైతన్య వేదిక కృషి చేస్తుందన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో
న్యాయవ్యవస్థ లోపాలను ఎత్తిచూపారు. ఇండియన్ జుడిషియల్ సర్వీస్ ద్వారానే న్యాయమూర్తుల ఎంపిక జరగాలని లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. ప్రాక్టీస్ లేనివారిని రాజకీయ పలుకుబడితో జడ్జిలుగా నియమించే వ్యవస్థను మార్చి..ప్రతిభ ఆధారంగా ఎంపికజేయాలని కోరారు. విలేజి రెవెన్యూ అధికారిని సైతం స్వగ్రామంలో నియమించరని..అలాంటిది హైకోర్టు న్యాయమూర్తులుగా అదే హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన వారిని నియమించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించేతత్వాన్ని పెంచాలని.. భావప్రకటనాస్వేచ్ఛను హరించరాదని ఆకాంక్షించారు. ఏపీలో మాజీ అడ్వకేట్ జనరల్ తో పాటు సుప్రీంకోర్టు జడ్జి బంధువుల అక్రమాలపై విచారణ జరగాలని జనచైతన్య వేదిక డిమాండ్ గా తెలియజేశారు. అక్రమాల కేసుల్లో ఎఫ్ఐఆర్ వివరాలను సైతం పత్రికలు ప్రచురించరాదని ఏపీ హైకోర్టు తీర్పునివ్వడంపై పలు సందేహాలకు తావిస్తుందని తెలిపారు. ఇది పౌరుల సమాచార హక్కును కాలరాయడమేనని..రాజ్యాంగ వ్యవస్థకు భిన్నంగా ఉందని పేర్కొన్నారు. సహజ న్యాయసూత్రాలకు భంగం కలిగిస్తున్న ఇలాంటి తీర్పులపై పునఃసమీక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్న నేపథ్యంలో దేశ న్యాయవ్యవస్థలో సంస్కరణల కోసం జనచైతన్య వేదిక డిమాండ్ చేస్తూ మేధావుల విశాల వేదిక రూపకల్పనకు కృషిచేస్తున్నట్లు లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.