టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ సంచలనం. ఇదంతా వైసీపీ ఆడుతున్న రాజకీయడ్రామా అంటూ టీడీపీ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, యనమల, బుచ్చయ్యచౌదరి ఆరోపిస్తున్నారు. చంద్రబాబు దీన్ని కిడ్నాప్‌గా వర్ణించారు. గత ప్రభుత్వంలో అచ్చెన్న కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. టెలీమెడిసిన్ పేరిట కొత్త ప్రయోగాలు చేశారు. కోట్లాదిరూపాయల నిధులతో పల్లెపల్లెకూ వైద్యమంటూ గట్టిగానే ప్రచారం చేశారు. హైటెక్‌సీఎం చంద్రబాబు ఏలుబడిలో ఇదంతా నిజమే అనుకున్నారు. మంత్రిగా లోకేష్‌బాబు కూడా చూశారా.. టెక్నాలజీ మేం వాడటం మొదలుపెడితే.. ఇంకెవరు ఆ వైపు చూడలేరనేంతగా స్పందించాడు. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. మెడికల్ కిట్లు, టెలీమెడిసన్ ఆలోచన కూడా చినబాబుదేనట. గతంలో ఆయనగారు చదువు పూర్తయ్యాక.. వ్యాపారి అవతారమెత్తారు. పక్కరాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో టెలీమెడిసిన్‌తో గ్రామీణ వైద్యం తక్కువ ధరకేనంటూ టెండర్లు కూడా పొందారు. పచ్చిగా చెప్పాలంటే మెడికల్ కిట్ల పేరిట భారీగానే టెండర్ వేశారు. ఆ తరువాత అంటే 2014లో ఏపీలో చక్రం తిప్పే అవకాశం. కేంద్రంలో బీజేపీతో దోస్తీ అన్నీ కలసివచ్చాయి. ఈఎస్ ఐ ద్వారా తమ పూర్వజ్ఞానాన్ని ఇలా క్యాష్ చేసుకునే అవకాశానికి మార్గం చూపిందనే గుసగుసలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే సుమారు రూ.950కోట్ల రూపాయల లావాదేవీల్లో ఏపీలో రూ.50కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ విజిలెన్స్ నివేదిక స్పష్టంచేస్తుంది. కేసును ఏసీబీకు బదిలీ చేయటంతో.. ఆరుగురు నిందితులపై కేసు నమోదుచేసిన ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడు, చక్రవర్తి, రమేష్‌కుమార్‌లను కస్టడీలోకి తీసుకుని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు. మరో ముగ్గురు కూడా కేసులో నిందితులుగా ఉన్నారని ఏసీబీ చెబుతుంది. ఈఎస్ ఐ మాజీ డైరెక్టర్ రమేష్‌కుమార్ బందువులను బినామీలుగా అవినీతికి పునాది వేశారు. నకిలీ పత్రాలు, ఇన్వాయిస్‌లు, బిల్లులు.. ఇలా అన్నీ నకిలీమయంగా కోట్లాదిరూపాయలు స్వాహా చేసినట్టు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఇదంతా మాజీ మంత్రి కనుసన్నల్లోనే
జరిగిందంటున్నారు. టెండర్ల ప్రక్రియ ద్వారా జరగాల్సి ఉండగా.. నామినేషన్ విధానంలోనే కోట్లాదిరూపాయల మందులు, వైద్యపరికరాలు 50-150శాతం అదనపు ధర చెల్లించి మరీ కొన్నారంటూ ఏసీబీ తమ అభియోగపత్రంలో పేర్కొంది. అయితే ఇదంతా జగన్ కక్షసాధింపు చర్యగా టీడీపీ వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. న్యాయపోరాటం చేస్తామంటున్నారు. ఏమైనా జగన్ ప్రభుత్వ నిర్ణయం వెనుక రాజకీయ కక్షసాధింపు చర్య దాగుందా.. ఇదంతా చట్టపరమైన నిర్ణయాల్లో భాగమా అనేది తేలాల్సి ఉంది. సీబీఐ, సీఐడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలతో తన, పర బేధం లేకుండా విచారణకు ఆదేశిస్తున్నసీఎం జగన్ పట్ల సామాన్యుల్లో మాత్రం విపరీతమైన ఇమేజ్ పెరుగుతుందని వైసీపీ వర్గాల నమ్మకం.