చిన్నారులలో పెరుగుతున్నక్యాన్సర్ కేసులు

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏటా మూడు లక్షలకు పైగా చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారని అంచనా.  అభివృద్ది చెందుతున్న దేశాలలో కన్నా అభివృద్ది చెందిన దేశాలలో కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ చనిపోతున్న వారి సంఖ్య అభివృద్ది చెందిన దేశాల కన్నా అభివృద్ది చెందుతున్న దేశాలలో ఉండడం ఆందోళన కలిగించే అంశం.

ఇలా నానాటికీ పెరుగుతున్న కేసుల పట్ల ఆందోళన చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, సెప్టెంబర్ మాసాన్ని చిన్నారులలో క్యాన్సర్ అవగాహన మాసం గా నిర్వహించాలని నిర్ణయించింది.  తద్వారా ఈ అంశంపై విస్తృతంగా అవగాహన కలిగించడంతో పాటూ తత్సంబందిత పరిశోధన, సదుపాయాలు, చికిత్స వంటి అంశాలపై దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లి తగిన పరిష్కారం కనుగోవడానికి సాధ్యపడుతుంది.  ఇప్పటికే చిన్నారుల మరణాలకు క్యాన్సర్ ఒక ప్రధాన కారణంగా మారుతున్న నేపధ్యంలో ఇది అత్యంత ఆవశ్యకరమైన అంశంగా పరిగణించబడుతోంది.

భారత దేశ విషయానికొస్తే  దేశ వ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం క్యాన్సర్ కేసులలో 4.5 శాతం నుండి 5.5 శాతం కేసులు చిన్నారులకు సంబంధించినవేనని 2017 లో నిర్వహించిన పరిశోధనలో అంచనా వేశారు.  ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ మరియు పీడియాట్రిక్ జర్నల్ లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం 0-19 సంవత్సరముల చిన్నారులలో షుమారు యాభై వేలకు పైగా క్యాన్సర్ బారిన పడుతున్నారని అర్థమైంది.  ఇలా చిన్నారుల మరణానికి కారణమవుతున్న అంశాలలో క్యాన్సర్ 9 వ స్థానంలో ఉండడం గమనార్హం.

చిన్నారులలో ఏర్పడే క్యాన్సర్  

చిన్నారులలో ఏర్పడే క్యాన్సర్ లలో  బ్లడ్ క్యాన్సర్ ప్రధానమైంది.  ఇందులో ప్రధానంగా రెండు రకములున్నవి.

లుకేమియా – ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్.  ఈ క్యాన్సర్ ప్రధానంగా రక్తం ఉత్పత్తి చేసే కణాలు మరియు ఎముకులలో ఉండే గుజ్జు లేదా మూలుగు (the bone marrow) లలో వస్తుంది.  తద్వారా చిన్నారి శరీరంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో తెల్ల రక్త కణాలు తయారై అవి చేయాల్సిన పని చేయకుండా ఎముకల గుజ్జు లేదా మూలుగు లలో ఉండే ఆరోగ్యకరమైన రక్త కణాలను చుట్టుముట్టి తద్వారా వారిలోని వ్యాధి నిరోధక శక్తిని పూర్తిగా నిరోధించడం జరుగుతుంది.  దీంతో వారు ఇన్ఫెక్షన్ లేదా ప్రమాదాల భారిన పడడడం జరుగుతుంది.

లింఫోమా – శరీరంలో ఏర్పడే మళినాలను తరలించడానికి వీలుగా ఏర్పడిన నాళాల వ్యవస్థనే లింఫోటిక్ నెట్ వర్క్ గా పిలుస్తారు.  ఈ నాళ వ్యవస్థలో ఏర్పడే క్యాన్సర్ నే లింఫోమా అంటారు.  ఇది శరీరంలోని టాన్సిల్స్, ధైమస్ గ్రంది, ఎముకలు, చిన్న పేగు, ప్లీహము లేదా లింఫ్ గ్రంధులలో ఏర్పడుతుంది.  అక్కడ నుండి నాడీ వ్యవస్థ తో పాటూ ఎముకుల మూలుగు లేదా గుజ్జ లోనికి (the bone marrow) చేరుతుంది.

వీటితో పాటూ మెదడు లేదా వెన్నుముక వ్యవస్థ లలో వచ్చే గడ్డలు కూడా కొన్ని సందర్భాలలో క్యాన్సర్ గడ్డలుగా మారుతాయి.  ఇక చేతులు లేదా కాళ్లలలో మోకాలు లేదా మోచేయి క్రింద భాగాలతో పాటూ కీళ్ల చుట్టూ కూడా గడ్డలు ఏర్పడి క్యాన్సర్ గడ్డలుగా మారుతాయి.  వీటితో పాటూ పొత్తి కడుపులో ఉండే అడెర్నల్ గ్రంధులలో వచ్చే న్యూరోబ్లాస్టోమా అనబడే క్యాన్సర్ వ్యాధి కూడా చిన్నారులలో చూడవచ్చు.

వీటితో పాటూ చిన్నారులలో అందులోనూ ముఖ్యంగా రెండు నుండి నాలుగు సంవత్సరముల చిన్నారులలో కిడ్నీ క్యాన్సర్ ఏర్పడుతోంది.  దీన్ని విలింమ్స్ ట్యూమర్ అని పిలుస్తారు.  గతంలో ఈ తరహా క్యాన్సర్ బారిన పడిన చిన్నారులలో ఎక్కువశాతం చనిపోయే వారు.  ఇక రెటినో బ్లాస్టోమా అనబడే కంటి క్యాన్సర్ మన దేశపు చిన్నారులలో ఎక్కువగా వస్తోంది.  ముఖ్యంగా చిన్నారులలో వచ్చే క్యాన్సర్ లలో 2 శాతం ఈ క్యాన్సర్ కేసులే.  ఇది ప్రధానంగా వంశపారంపర్యంగా వచ్చే జన్యులోపం కారణంగా వస్తోందని గుర్తించిన పరిశోధకులు దీనికి తగిన చికిత్స అందించడంలో సఫలీకృతమవుతున్నారు.  ఇక రాబ్డోమియోసార్కోమా అనబడే క్యాన్సర్ రకం కూడా చిన్నారులలో గమనించవచ్చు.  ఇది ప్రధానంగా శరీరంలోని కండరాలకు సంబంధించిన కణాలు అందులోనూ ముఖ్యంగా తల భాగంలో ఉండే కణాలు పాడుకావడం వలన ఏర్పడుతుంది.  ఇందుకు ఈ ప్రాంతాలలో ఏర్పడే ప్రమాదకరమైన సార్కోమా అనబడే కణం కారణంగా తేలింది.

చిన్నారులలో క్యాన్సర్ వస్తే ఏర్పడే లక్షణాలు

ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గడం, తరచుగా తలనొప్పి లేదా వాంతులు చేసుకోవడం, ఎముకలు లేదా కీళ్లు లేదా వెన్నుముక లేదా కాళ్లలలో వాపు లేదా నొప్పి వచ్చి తగ్గకపోవడం, పొత్తి కడుపులో లేదా మెడ మీద లేదా నడుం లేదా చేతుల క్రింద చంక బాగంలో గడ్డలు ఏర్పడడం, ఎక్కువగా చర్మం లో రాషెస్ రావడం లేదా రక్త స్రావం జరుగుతుండడం,  తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడడం, కళ్లు ఎర్రబారడం లేదా వాచడం, ఎటువంటి వికారం లేకుండా వాంతులు చేసుకోవడం, తరచుగా అలసిపోవడం లేదా పాలిపోవడం, కంటి చూపులో మార్పులతో పాటూ చివరగా తరచుగా కారణం తెలియకుండా జ్వరం రావడం వంటి లక్షణాలు చిన్నారులలో ఏర్పడితే అవి క్యాన్సర్ కు సంబంధించినవి గా భావించాలి.

చిన్నారులలో క్యాన్సర్ కు అందించే చికిత్స

చిన్నారులలో వచ్చే క్యాన్సర్ కు కీమోథెరపీ, రేడియేషన్ లేదా శస్త్ర చికిత్సల ద్వారా చికిత్స అందిస్తారు.  అయితే ఏ చికిత్స సరైనదన్న విషయాన్ని క్యాన్సర్ రకం, తీవ్రతను బట్టి వైద్యులు నిర్ణయిస్తారు.

శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను నిర్మాలించడానికి, వాటిని చంపడానికి అవసరమైన మందులను కీమో థెరపీ అన్న చికిత్స ద్వారా నేరుగా రక్త నాళాలలోనికి వైద్యులు పంపిస్తారు.  శరీరంలోనికి వెళ్లిన మందు క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నాశనం చేస్తుంది.  అయితే ఈ కీమోథెరపీ ఎంత కాలం ఇవ్వాలనే అంశం మాత్రం వ్యాధి రకం తీవ్రతను పట్టి వైద్యులు నిర్ణయిస్తారు.

ఇక పలు సందర్భాలలో చిన్నారులకు వచ్చే క్యాన్సర్ కేసులలో కీమోథెరపీతో పాటూ వైద్యులు రేడియేషన్ చికిత్స కూడా అందిస్తారు.  ఈ రేడియేషన్ చికిత్సలో ఎక్కువ శక్తి కలిగిన తరంగాలను శరీరంలోని క్యాన్సర్ వచ్చిన భాగాలపై ప్రసరింప చేసి అక్కడున్న క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు.

ఇక రక్త క్యాన్సర్ లు కాకుండా ఇతరత్రా క్యాన్సర్ లలో చిన్నారులలో ఏర్పడే కణుతులు లేదా గడ్డలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించివేస్తారు.  దీని కారణంగా కీమోథెరపీ మరియు రేడియో థెరపీ కన్నా ఎక్కువ ప్రభావితంగా క్యాన్సర్ ను శరీరంలోనుండి తొలగించవచ్చు.

ఇక చిన్నారులలో ఎక్కువగా వచ్చే బ్లడ్ క్యాన్సర్ ల చికిత్సకై వైద్యులు బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స సూచిస్తారు.  ఈ చికిత్స లో భాగంగా కీమో థెరపీతో పాటూ పాడైపోయిన ఎముకుల గుజ్జు లేదా మూలుగ (బోన్ మ్యారో) లను నాశనం చేసి కొత్త కణజాలాన్ని అక్కడ ప్రవేశపెట్టడం చేస్తారు.  తద్వారా సరికొత్త రక్త కణాలను తయారు చేసే ప్రక్రియ ను ప్రారంభిస్తారు.  ఈ పద్దతిని ప్రధానంగా బ్లడ్ క్యాన్సర్ ను నయం చేయడానికి ఉపయోగిస్తారు.  ఇందుకు బయటి వ్యక్తి నుండి బోన్ మారో సేకరించి రోగికి ఎక్కిస్తారు.

వీటితో పాటూ ఇటీవల కాలంలో ఎక్కడైతే క్యాన్సర్ కణాలున్నాయో ఆ ప్రాంతలో నేరుగా మందులు అందించే నూతన ప్రక్రియ టార్గెటెడ్ థెరపీ కూడా వినియోగంలోనికి వచ్చింది.  దీని వలన సాధారణ కీమో థరెపీలోలా చెడ్డ కణాలను చంపే ప్రక్రియలో మంచి కణాలను కూడా నష్టపరిచే ప్రక్రియను తగ్గించవచ్చు.  వీటి కారణంగా లుకేమియా అనబడే బ్లడ్ క్యాన్సర్ ను నియంత్రణలో ఉంచడానికి వీలవుతోంది.

సహాయం ఎంతో అవసరం

ఇలా ఆధునిక వైద్య విజ్ఞానం కారణంగా చిన్నారులలో తలెత్తే క్యాన్సర్ లను పూర్తిగా తగ్గించవచ్చు.  సరైన సమయంలో తగిన చికిత్స అందించగలిగితే వీరిలో వచ్చే క్యాన్సర్ లను పూర్తిగా నయం చేయవచ్చు.  వీరిలో ఉండే సహజమైన నూతన కణ ఉత్పత్తి ప్రక్రియ కూడా ఇందుకు దోహదపడుతుంది.  అయితే వీరు వ్యాధి కారణంగా జీవితం మరియు మరణం మధ్య కొట్టు మిట్టాడుతున్నారు.  వీరికి కూడా ఇతర చిన్నారుల వలే సాదారణంగా జీవించాలి, ఎన్నో లక్ష్యాలు ఆశయాలు సాధించాలనే కోరికలుంటాయి.  వీటిని సాధించే క్రమంలో ఏర్పడిన ఈ ప్రాణాంతక వ్యాధిని వీరు అసాధారణ శైలిలో ఎదుర్కోవడం గమనించవచ్చు.  ఎందరో చిన్నారులు ఈ సందర్భంగా చేసిన పోరాటం, చూపే పట్టుదల అందరినీ కదలించి వేస్తాయి.

అయితే వీరు కోరుకొనేది సానుభూతి కాదు, సహాయం.  అంటే మంచి చికిత్స, అందుకవసరమైన ఆర్థిక, సామాజికమైన మద్దతు ఇలాంటి వారికి ఎంతో అవసరం.  ఈ దిశగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.

Dr. Koteswara Rao, Pediatrician, Apollo Cradle & Children Hospital, Hyderabad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here