బాలుగారు కూడా భ‌య‌ప‌డేది దేనికంటే…!

కొంద‌రు కార‌ణ‌జ‌న్ములు.. పుడ‌తుంటారు. వారి పుట్ట‌క‌కు సార్ధ‌క‌త దొర‌క‌గానే అలా వెళ్లిపోతారు. ఎక్క‌డో నెల్లూరులో మామూలు హరిక‌థ క‌ళాకారుడి ఇంట పుట్టిన శ్రీ పండితారాధ్యుల బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం.. ఇంత‌గా ఎదిగారంటే అది క‌న్న‌వారి దీవెన‌లే అంటా రాయ‌న‌. ఎంత ఎదిగినా ఒదిగే ఉండ‌టం.. పిల్ల‌లు క‌నిపిస్తే.. చంటిపిల్ల‌వాడిగా మార‌టం ఆయ‌న‌కే చెల్లింది. వారితో క‌ల‌సి ఆట‌పాట‌ల్లో మునిగితేలుతూ బాల్యాన్ని గుర్తుచేసుకునేవారు. మ‌న‌సు క‌డిగిన ముత్యం.. మ‌నిషి నిండు మాన‌వ‌త్వం అంటారాయ‌న‌. త‌న వెంట వ‌చ్చే ఆర్కెస్ట్రా, సింగ‌ర్స్‌కు కూడా త‌న‌కు ఇచ్చే గౌర‌వ‌మే ఇవ్వాలంటూ డిమాండ్ చేసేవార‌ట‌. ఎవ‌రైనా కాదు సార్‌.. మీరు అంటే.. నేనేమిటీ.. అంద‌రూ స‌మాన‌మేనంటూ పోట్లాడేవార‌ట‌. అందుకేనేమో.. ఆయ‌న వెంట ఉండే ఆర్కెస్ట్రా బృందం.. పాతికేళ్లుగా బాలు వెంట న‌డుస్తూనే ఉన్నారు. బాలు ఎవ‌రినీ ఎదుగ‌నీయ‌డంటూ జ‌రిగే విష‌ప్ర‌చారం కూడా నిజంగా బూట‌క‌మే.. ఎందుకంటే.. ఎవ‌రైనా జూనియ‌ర్ సింగ‌ర్స్ ట్రాక్ పాడితే.. అది బావుంటే.. సార్‌.. ఆ కుర్రాడు చ‌క్క‌గా పాడాడు.. అత‌డితో ఆ పాట పాడించ‌మంటూ పెద్ద‌మ‌న‌సు చాటుకోవ‌టం బాలుకే చెల్లింది. ఇంజ‌నీర్ కావాల‌ని ఇటు వ‌చ్చినా.. స్వ‌రాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేసిన ఇంజ‌నీరింగ్ సింగ‌ర్‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానుల మ‌న‌సు దోచుకున్నారు. తాను లేక‌పోయినా..పాట‌తో ఆనందాన్ని పంచుతూనే ఉంటారు.

అంత‌గొప్ప బాలు గారికి ఓ భ‌యం ఉండేద‌ట‌. అది కూడా పాడేముందు ఉండేద‌ట‌. ఔనా… ఆశ్చ‌ర్య‌పోవ‌ద్దు. 40,000 పాటలు పాడిన బాలు.. మిత్రులంద‌రూ ముద్దుగా పిలుచుకునే మ‌ణిలోనూ ఆ భ‌యం ఇప్పుటి వ‌ర‌కూ ఉండేదంటున్నా ఈ త‌రం గాయ‌కులు. దేశంలో.. విదేశాల్లో ఎక్క‌డ మ్యూజిక్ ప్రోగ్రామ్‌కు వెళ్లినా.. ముందు రోజు.. స్టేజ్ ఎక్కేంత వ‌ర‌కూ బాలు ఒక్క‌టే భ‌యాందోళ‌న‌తో ఉండేవార‌ట‌. కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి.. స‌జావుగా ముగిసేంత వ‌ర‌కూ చాలా నిబద్ద‌త‌తో ప్రోగ్రామ్ ఫినిష్‌చేసేవార‌ట‌. ఇది భ‌యం కాదు.. త‌న వృత్తిప‌ట్ల గౌర‌వం.. ఎక్క‌డా త‌న పాట‌లో అప‌స్వ‌రం ప‌ల‌కకూడ‌ద‌నే అప్ర‌మ‌త్తం. క్ర‌మ‌శిక్ష‌ణ‌.. ప‌నిప‌ట్ల ఏకాగ్ర‌త్త‌.. అంద‌రినీ స‌మానంగా గౌర‌వించ‌గ‌ల మ‌న‌స్త‌త్వం.. అచ్చంగా చెప్పాలంటే మూర్తీభవించిన మాన‌వ‌త్వం బాలు త‌త్వం.. కేవ‌లం పాట‌తోనే కాదు.. క‌రోనా స‌మ‌యంలో ల‌క్ష‌లాదిరూపాయ‌లు సేక‌రించి ఎంతోమంది పేద క‌ళాకారుల క‌డుపు నింపిన మ‌హ‌నీయుడు గాన‌గంధ‌ర్వుడు.

పాట మూగ‌బోయంది.. క‌రోనా ర‌క్క‌సి గొప్ప గాయ‌కుడిని బ‌లితీసుకుంది.. గంధ‌ర్వ‌లోకంలో పాట‌కచేరి కోసం బాలుడు క‌ద‌లి వెళ్లాడు. శ‌నివారం ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అంత్య‌క్రియ‌లు చెన్నైలో నిర్వ‌హించారు.

Previous articleగాన గంధర్వుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా పై పాడిన పాట – WATCH VIDEO
Next articleభార‌త్ దెబ్బ‌కు దిక్కులు చూస్తున్న చైనా సైన్యం??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here