పవన్‌కళ్యాణ్.. ఆ పేరు ఫ్యాన్స్‌లో ఉత్తేజాన్నిస్తుంది. రాజకీయాల్లో మార్పు రావాలనుకునే యువతకు ఉత్పేరకంగానూ మారుతుందంటారు పవర్‌స్టార్ అభిమానులు. జనసేన అధినేతగా రెండుచోట్ల ఓటమి చవిచూసినా… ఆయన వెంటే ఉంటామంటూ లక్షలాది మంది కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. మరి రాజకీయంగా ఎలా ముందడుగు వేయాలి. 2024 నాటికి ఏ విధంగా సిద్ధమవ్వాలి. అధికారం చేపట్టేందుకు ఎలాంటి వ్యూహాలు పన్నాలి. కుల, మతాలకు అతీతంగా ఓటుబ్యాంకును ఏ విధంగా దక్కించుకోవాలనే ప్రణాళిక ఎలా! దీనికి జనసేనాని తనదైన వ్యూహాలకు పదను పెడుతున్నారట. ఏపీ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను ఈ సారి తమ అనుకూలంగా తిప్పుకునేందుకు వీలుగా సిద్ధమవుతున్నారట. జనసేన, బీజేపీ కలసి ఏ విధంగా నడవాలనే దానిపై రాజకీయ నిపుణులతో చర్చలు సాగిస్తున్నారు.

ఇన్నేళ్లుగా.. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయలేదు. పోలింగ్‌బూత్‌ల వారిగా కూడా నియామకాలు చేపట్టలేదు. అందుకే ఇప్పుడు.. పల్లె, పట్టణం, నగరాలు అనే బేధం లేకుండా.. వార్డు స్థాయి వరకూ జనసేన బలాబలాలను బేరీజు వేస్తున్నారు. అక్కడ సమర్థుడైన కార్యకర్తలకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక టీమ్‌లు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే టీవీ99 ఛానల్ పార్టీ తరపున ఉన్నా పూర్తిగా వాడుకోవట్లేదని గుర్తించారు. ఛానల్‌ను మరింత చేరువ చేయటం ద్వారా జనాల్లోకి తమ నినాదం.. చేస్తున్న సేవా కార్యక్రమాలు తీసుకెళ్లబోతున్నారు. కాపు కుల పార్టీ అనే ముద్రను కూడా దూరం చేసేందుకు పార్టీ సభ్యత్వం, బాధ్యతలు చేపట్టేవారిలో సమర్థతను మాత్రమే గుర్తించాలని పవన్
గట్టిగానే చెప్పారట. బీజేపీ శ్రేణులు చేపట్టే కార్యక్రమాలకు జనసైనికులు కూడా అందుబాటులో ఉండాలని..కోఆర్డినేషన్ చేసుకుంటూ జనాల్లోకి వెళ్లాలంటూ దిశానిర్దేశం చేశారట సేనాని. గ్రౌండ్ లెవల్లో ఇది ఖచ్చితంగా అమలు చేయగలిగితే పార్టీపరంగా మంచి పట్టు సాధిస్తామని జనసైనికులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
ఏపీ పీకే.. పవన్ కళ్యాణ్‌ను దెబ్బతీసేందుకు బిహార్ పీకే.. ప్రశాంత్‌కిషోర్ రావాల్సి వచ్చింది. వాస్తవానికి ప్రశాంత్‌కిషోర్ ఏపీలో అంత పెద్దగా వ్యూహాలు పన్ని జగన్ మోహన్‌రెడ్డి సీఎం కావటానికి చేసిందేమీలేదనేది రాజకీయ కురువృద్ధుల అభిప్రాయం. యావత్ భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేయగల రాజకీయ ఉద్దండులకు కేరాఫ్ చిరునామా ఆంధ్రప్రదేశ్. నాటి సంజీవరెడ్డి నుంచి చంద్రబాబునాయుడు వరకూ ప్రతి ఒక్కరూ.. తమదైన పంథాలో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేశారు. 2019లో చంద్రబాబుపై వ్యతిరేకత.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడిగా జగన్‌కు ఒక్కఛాన్స్ ఇద్దామనే ఏపీ ఓటర్ల అంతరంగం వైసీపీను గద్దెనెక్కించాయి. అది ఒక్కసారి కావచ్చు.. రెండోసారి కూడా ఏపీ ప్రజలు దీవించనూ వచ్చు. ఎన్నికలకు ముందు ఉండే రాజకీయ పరిస్థితులు. ఆ సమయంలో ప్రభుత్వం చేస్తున్న మంచిచెడులు కూడా కావచ్చు.

ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయం ఉన్నా.. ప్రతిపక్ష పార్టీకు ఒక్క అవకాశం ఇద్దామనే సానుభూతి ఓటర్లలో వచ్చిందంటే చాలు.. ఆ ఒక్కటి ఎంత గొప్ప ప్రభుత్వాన్నైనా ఒకే రోజులో ప్రతిపక్షంలోకి చేరేలా చేస్తుంది. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చేసిందల్లా.. ఆ సానుభూతి జనాల్లో ఉండటాన్ని ముందుగానే గుర్తించి.. జగన్ ఎంత దూకుడుగా ఉండాలనే విషయంలో సలహా ఇచ్చాడు. ఏపీ ప్రజల ప్లానింగ్‌ను తన ఎన్నికల వ్యూహంగా భావించిన ప్రశాంత్‌కిషోర్ జబ్బలు చరచుకుంటున్నాడనే విమర్శలూ లేకపోలేదు. ఎన్నికల వ్యూహాలకు పదనుపెట్టే ఉద్దండులు ఉన్న ఏపీలో పల్లెపల్లెకో ప్రశాంత్‌కిషోర్‌లు ఉంటారంటున్నారు. మరి దీనికి ధీటుగా తాము చెప్పబోయే సమాధానం 2024లో ఎంత ఘాటుగా ఉంటుందో చూపేందుకు జనసేనాని ఇంకెంతగా ఎన్నికల యుద్ధతంత్రాలు ప్రయోగిస్తారనేది ఆసక్తిగా మారింది.



