ఆంధ్రప్రదేశ్ రాజకీయం మళ్లీ రసకందాయంలో పడింది. టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల వరుస అరెస్టుల తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నెక్స్ట్ టార్గెట్ ఎవరు, ఎవరిని ఫిక్స్ చేస్తారనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అటు టీడీపీ కూడా కౌంటర్ రాజకీయం మొదలుపెట్టింది. వాటినీ ఐసోలేట్ చేస్తూ.. మళ్లీ భయపెడుతూ అధికార పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎంట్రీ.
రఘురాముడు.. వదిలిన బాణం:
మా చిన్న కులంలో రచ్చ పెట్టొద్దంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు భలే డైలాగ్ వదిలారు. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో, ఆ మాటల తీవ్రత ఏ రేంజులో ఉన్నాయో.. తెలీనంత అమాయకులు అధికార పార్టీలో ఎవరూ లేరు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇచ్చే పరిస్థితి లేదంటూ ఆయన గతంలో చెప్పడం కూడా సెటైరే. ఎవరికి తగలాలో వారికి గట్టిగానే తగిలింది. సొంత పార్టీ ఎంపీకి ఎమ్మెల్యేలతో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది వైసీపీ. రఘురామ కృష్ణరాజు మళ్లీ డైలాగ్స్ పేల్చారు. నువ్వు పోక చెక్కతో ఒకటిస్తే.. నేను తలుపు చెక్కతో రెండిస్తా.. అన్నట్టుంది ఆయన వ్యవహారం. నాతో పెట్టుకోకు అనే రేంజులో పార్టీకి స్పష్టత ఇచ్చేశారాయన. ఇన్నాళ్లూ చూసీ చూడనట్టు ఊరుకున్న వైసీపీ నాయకత్వం, ఇక తేల్చేద్దాం అని డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
భలేగా సంధించిన అవినీతి అస్త్రం:
అందరికీ ఇళ్లు. దీన్ని ఫ్లాగ్ షిప్ పథకంగా భావిస్తోంది వైసీపీ. తప్పేం లేదు. ఆ స్కీం అలాంటిది. ఇళ్లు లేని వారికి స్థలాలు ప్రొవైడ్ చేసి.. అక్కడ ఇళ్లు కట్టించి.. వాళ్లతో గృహ ప్రవేశాలు చేయించి.. అంతటితో మా పనైపోయిందని భోజనాలు చేసి వెళ్లిపోకుండా.. ఆ ఇళ్లు అమ్ముకునే హక్కును లబ్దిదారులకు దఖలు చేయడం అంటే మామూలు విషయమా. ఒక్క జగన్ మోహన్ రెడ్డి మంచి మనసుకే సాధ్యమేమో.
అయితే అందరికీ ఇళ్ల స్థలాలు పథకం లబ్దిదారుల ఎంపికలో అవినీతి జరుగుతోందని చెప్పకనే చెప్పారు అధికార పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. తన దగ్గరకు కొందరు బాధితులు వచ్చారని చెప్పారాయన. అయితే ఎపరి దగ్గరా పైసా పుచ్చుకోకుండానే ముఖ్యమంత్రి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని గుర్తుచేస్తూనే.. ఎవరైనా డబ్బులు అడిగి ఉంటే నేరుగా జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఆ తర్వాత చూసుకోండి ఫిర్యాదులే ఫిర్యాదులు.
రఘురాముడి జోరు.. వాళ్లు బేజారు:
రఘురామ కృష్ణ రాజు వ్యాఖ్యలు చిచ్చుబుడ్లు పేలుతున్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకంటే.. నిత్యం అవినీతి ఆరోపణలు చేస్తున్న టీడీపీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం ఈ రేంజ్ అటెన్షన్ ని సొంతం చేసుకోలేకపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆవ భూములు, వేర్వేరు జిల్లాల్లో ఒకటి రెండు సంఘటనలు మినహా తెలుగు తమ్ముళ్లు చేసిందేమీ లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. అంతకుమించిన అటెన్షన్ రఘురాముడి మాటలకు దక్కింది. అంతెందుకు తాడిపత్రి వెళ్లి జేసీ కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ చినబాబు.. మేము వస్తే మీ లెక్క తేలుస్తాం అంటూ ఘీంకరించారు. (మీరు రావాలిగా చినబాబు. ఇంకా నాలుగేళ్లు ఉంది. అసలే జగన్. దూకుడుమీద ఉన్నారు. మళ్లీ రెచ్చగొడితే ఎలా?) ఆయన మాటల కంటే.. ఇప్పుడాయన పర్యటనను దగ్గరుండి చూసుకున్న నాయకులపై కేసులే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఔను.. లోకేశ్ పర్యటనలో భౌతిక దూరం పాటించలేదని, మాస్కులు పెట్టుకోలేదని ఆ కేసు సారాంశం. ఇప్పుడు ఇదో చిక్కు.
ఇక, చంద్రబాబు నాయుడు కూడా తనదైన శైలిలో, చట్టబద్ధంగా ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందులో మొదటిది గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవడం. ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడం. తాను ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినప్పుడు విపక్షాలు చాలాసార్లే గవర్నరుకు ఫిర్యాదు చేశాయి. మరి, ఎలాంటి చర్యలు ఉంటాయి? అలాంటివాటిపై చర్యలేమీ ఉండవని తెలీదా. కానీ ఏం చేస్తారు పాపం. బాధ,అక్కసు, ఆవేదన అలాంటిది మరి. రాజ్యాంగ వ్యవస్థల్ని జగన్ ధ్వంసం చేస్తున్నారని చెప్పేందుకు, మరో రాజ్యాంగ వ్యవస్థను ఆశ్రయించాల్సిందే. రాబోయే రోజుల్లో ఢిల్లీకి సైతం వెళ్తారేమో! ఏది ఏమైనా ముందే చెప్పుకున్నట్టు మరో నాలుగేళ్లు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బిందాస్. వాళ్లు చేయాలనుకున్నది చేసేస్తారు. సమయం కోసం చంద్రబాబు ఓపిక పట్టడం తప్ప.. చక్రం తిప్పడానికి స్టీరింగే లేదు.