ఆంధ్రులు.. ఆరంభశూరులు అనే నానుడి ఉండనే ఉంది. మనోళ్లే అప్పుడపుడూ అంతిమ వీరులం కూడా మేమేనంటూ జబ్బలు చరచుకుంటారు. నిజమే.. రాజకీయ.. సామాజిక.. ఆర్ధిక.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆంధ్రులు పాత్ర గర్వించదగ్గదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రాజకీయాలను కూడా మలుపుతిప్పిన నేతలు ఎంతోమంది ఉన్నారు. పైరవీలు.. లాబీయింగ్‌లు.. ఏమనుకున్నా.. ఏది కావాలనుకున్నా సాధించగల సమర్థులు కూడా. ఇది కాస్త అతిగా అనిపించినా లాబీయింగ్ కింగ్‌లు అనాల్సిందే. మరి ఇంతటి ఘటికులు ఉన్నచోట ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క భారతరత్న రాకపోవటం నిజంగానే విడ్డూరంగానే అనిపిస్తుంది. ఆంధ్రరత్నాలు ఇన్ని ఉన్నాఒక్కరంటే ఒక్కరికీ ఆ ముచ్చట తీరకపోయే అనే బాధ మాత్రం తెలుగుగోడిని వేధిస్తూనే ఉంటుంది. అక్కడా రాజకీయాలు చేసి.. వచ్చే అవకాశాన్ని చేజార్చిన ఖద్దరు దొరలు కూడా ఉండే ఉంటారు.
ఒకప్పుడు నందమూరి తారకరామారావు.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా తెలుగుజాతి కీర్తిని ప్రపంచవ్యాప్తి చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి కాంగ్రెస్ వెన్నులో వణకు.. జాతీయ రాజకీయాల్లో ఒక మలుపు తీసుకురాగలిగారు. ఎంత గొప్ప జీవితం.. ఎంతమందికి స్పూర్తిగా నిలిచినా చివరి అంకంలో వివాదాలు.. విషాధాలతో ముగించారు. ఆ తరువాత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు గట్టిగా నినదిస్తూ.. మా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ గోల చేయటం.. సంతకాలు సేకరించటం దాదాపు 20 ఏళ్లుగా జరుగుతూ వస్తూనే ఉంది. బీజేపీతో రెండు దఫాలుగా దోస్తీ చేసి ఎన్డీఏ సర్కారులో కీలకంగా మారిన చంద్రబాబు ఆ నాడు ఏం చేశారనే ప్రశ్నకు సమాధానం కనిపించదు. సారీ.. వినిపించదు. కానీ ప్రతిపక్షంలోకి చేరగానే మళ్లీ మా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ మళ్లీ రచ్చ మొదలు. కృష్ణాజిల్లాలో పుట్టిన ఆయనకు భారతరత్న ఎప్పటికి ఇస్తారనేది ప్రశ్నార్దకమే.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. గానగంధర్వుడు.. తెలుగు జాతి గర్వించదగిన కళాకారుడు. కరోనాతో పోరాడుతూ కొద్దిరోజుల క్రితమే మరణించారు. నెల్లూరు జిల్లాలో పుట్టిన బాలు మరణం యావత్ సంగీత లోకాన్ని అనాథను చేసిందనే భావనకు గురిచేసింది. ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి తాజాగా కేంద్రానికి రాసిన లేఖలో బాలుకు భారతరత్న ఇవ్వాలనే వినతి మరోసారి తెలుగు వాడికి ముఖ్యంగా ఆంధ్రులకు తొలిసారి భారతరత్న రాబోతుందనే ఆశను మొలకెత్తేలా చేసింది. దీనిపై వివాదాలు.. విమర్శలు ఎలా ఉన్నా.. జగన్ మోహన్‌రెడ్డి మరోసారి తెలుగోడికి భారతరత్న ఎందుకు ఇవ్వరనే ప్రశ్నకు కారణమైంది. జాతిపితగా పిలుచుకునే గాంధీకే ఇప్పటి వరకూ భారతరత్న ఇవ్వలేదనే ప్రశ్న కూడా వస్తుంది. కానీ.. ఆయన జాతిపిత.. ప్రపంచశాంతిదూత అనే ఎన్నో
వివరణలు కూడా వెంటనే వినిపిస్తుంటాయి.
భారతరత్న అనేది భారతదేశంలో భారతీయులకు అందే అత్యున్నత పురస్కారం. పద్మశ్రీ, పద్మభూషణ్, విభూషణ్‌లు ఎన్ని ఉన్నా భారతరత్నం అనేది గొప్ప పురస్కారంగా భావిస్తుంటారు. 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ హయాంలో భారతరత్న పౌర పురస్కారం ప్రారంభించారు. దేశంలో వివిధ రంగాల్లో అత్యున్నత సేవలకు గుర్తుగా పురస్కారం అందజేస్తారు. ఏటా దీన్ని ప్రకటించాలనే నిబంధన కూడా లేదు. మొదటి భారతరత్న పురస్కారం సర్వేపల్లి రాధాకృష్ణన్ అందుకున్నారు. ఇప్పటి వరకూ సుమారు 48 మంది వరకూ భారతరత్న పురస్కారం అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి మిస్సైల్ మ్యాన్ అబ్దుల్‌కలామ్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, రాజకీయ మేదావి.. మాజీ ప్రధాని వాజ్‌పేయి వంటి వారికి ఈ తరంలో
భారతరత్నలుగా మెరిశారు. ఖాన్ అబ్దుల్‌గఫార్‌ఖాన్, నెల్సన్‌మండేలా ఇద్దరు విదేశీయులకు భారతరత్న అందజేశారు. పశ్చిమబెంగాల్ నాటి సీఎం జ్యోతిబసు పేరు ప్రతిపాదించినా.. వద్దని ఆయనే వారించారు. రాజకీయజీవితంలో ఉన్నతనకు ఆ పురస్కారం ఇవ్వటం ద్వారా దాని విలువ తగ్గుతుందని స్వయంగా చెప్పటం విశేషం. 2019లో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, నానాజీ దేశ్‌ముఖ్, భూపెన్ హజారికలు భారతరత్నలుగా ఎంపికయ్యారు. భారతరత్న పురస్కారం కింద బంగారు పతకం మాత్రమే అందజేస్తారు. ఎటువంటి నగదు పురస్కారం ఇవ్వరు. రాజ్యాంగం ప్రకారం వారికి 7వ స్థాయి పౌరులుగా గౌరవమర్యాదలు లభిస్తాయి.
                


