రాంగోపాల్ వర్మ.. శిష్యులు ఆయనొక గ్రంథం. అభిమానులకు అతడొక వేదిక. వివాదాలకు కేరాఫ్ అడ్రస్. బెజవాడలో పుట్టిపెరిగిన వర్మ ముంబయిలో సెటిలయ్యాడు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏ సంఘటన జరిగినా దాన్ని కెలుకుతూ తనదైన శైలిలో వివాదాస్పదం చేస్తాడు. వంగవీటి నుంచి ఎన్టీఆర్ వరకూ ఎవ్వర్నీ వదల్లేదు. పోయినోళ్లను మాత్రమే కాదు.. ఉన్నోళ్లను కూడా బయటకు లాగి వికటాట్ట హాసం చేయదగ్గ ఘటికుడు. పోయిన సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన దారుణం.. దిశ ఘటన. నలుగురు యువకులు.. వెటర్నరీ వైద్యురాలిపై సాగించిన లైంగికదాడి. అఘాయిత్యం చేయటమే కాదు.. విషయం బయటకు చెబుతుందనే భయంతో దారుణంగా చంపేశారు. శవం ఆనవాళ్లు దొరక్కుండా తగులబెట్టే ప్రయత్నం చేశారు. చివరకు వీరంతా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ ఘటనపై వర్మ చూపులు పడ్డాయి.
అంతే అకస్మాత్తుగా హైదరాబాద్ వాలిపోయారు.. ఎన్‌కౌంటర్ అయిన నలుగురులో ఒక నిందితుడి బార్యతో ఇంటర్వ్యూ చేశాడు. దిశ కథను సినిమాగా మార్చాలని రెడీ అయ్యాడు. గతంలో మిర్యాలగూడలో మారుతీరావు ఆయన కుమార్తె అమృత.. ఆప్యాయ త. ఆ తరువాత ఇష్టంలేని పెళ్లి చేసుకుందనే ఉద్దేశంతో అల్లుడు ప్రణయ్ మర్డర్ చేయించిన మారుతీరావుల కథలను సినిమాగా తీయాలనుకున్నాడు. అమృత హైకోర్టును ఆశ్రయించటంతో అలా ఆగింది. ఇప్పుడు దిశతో మరోసారి సంచలనం రేకెత్తించాడు. దీనిపై దిశ తండ్రి కూడా స్పందించారు. ఇప్పటికే తాము ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నామని.. దీన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు. ఇటువంటి సమయంలో వర్మ దిశ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. దీనిపై దిశ తండ్రి ఆందోళనకు దిగారు. రౌడీ వర్మ అంటూ నినాదాలు చేస్తూ.. వర్మ నివాసం వద్ద నిరసనకు దిగారు. అందరూ పవన్ కళ్యాణ్ మాదిరిగా మౌనంగా ఉంటారనుకుంటే పొరపాటు అంటూ వర్మను పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు.