రాక్షసుడిని చంపేందుకు రాక్షసుడుగా మారాలంటూ.. వీరప్పన్ సినిమాలా డైలాగ్ గుర్తుందా! రాజకీయం చేయాలనుకున్నపుడు.. రాజకీయాలే చేయాలి. లేకపోతే.. ఎక్కడో పడిపోతారు. మార్పుకోసం జనసేన పార్టీ స్థాపించానంటూ తరచూ జనసేనాని చెబుతుంటారు. కానీ. అక్కడా రాజకీయం చేయాల్సిందే అనేది ఇన్నాళ్లకు గుర్తించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సమాయత్తమవుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. కరోనా కాస్త తగ్గుముఖం పట్టాక పవన్‌కళ్యాణ్ ఏపీ వ్యాప్తంగా యాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ మేరకు ముందుగానే పల్లెపల్లెకూ జనసేన అనే నినాదంతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకుల మధ్య సయోధ్య కుదర్చటం.. అందరూ ఏకతాటిపైకి చేరి ఐకమత్యంతో ముందుకు సాగేలా వీరికి త్వరలో శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. గ్రామస్థాయిలో పార్టీను బలోపేతం చేయటం.. పోలింగ్‌బూత్‌ల వారీగా బలాబలాలను అంచనా వేయటం.. బలహీనంగా ఉన్నచోట ప్రత్యేకంగా దృష్టిసారించటం.. బీజేపీ, జనసేన రెండూ కలవటం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీసే అవకాశం ఉన్న నియోజకవర్గాలను కూడా పరిశీలిస్తున్నారట. దీనికోసం ప్రత్యేకంగా పవన్‌కళ్యాణ్ సారథ్యంలో ఒక బృందం త్వరలో ఏపీలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ తో దోస్తీ. 2019లో కమ్యూనిస్టులతో స్నేహం. ఇవేమీ జనసేన బలాన్ని పెంచాల్సింది.. కానీ తగ్గించాయనేది జనసైనికుల వాదన. ఇప్పుడు బీజేపీతో స్నేహహస్తం చాటినా.. కమలనాథులు మాత్రం వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. అధికారపార్టీతో ఉండే అవసరాలు కూడా దీనికి కారణమనే చెప్పొచ్చు. నిన్నటి వరకూ ధర్నాలు, నిరసనలతో హల్చల్ చేసిన ఏపీ బీజేపీ ఇప్పుడు మౌనం వహిస్తుంది. జగన్‌పై విమర్శలు కురిపించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఎందుకో సైలెంట్‌గా కనిపిస్తున్నారు. ఇదంతా రాజకీయ చర్చల తరువాత చోటుచేసుకున్న పరిణామమా! అనే అనుమానాలు లేకపోలేదు. ఇటువంటి సమయంలో ప్రతిపక్షంగా ప్రజల తరపున ఉద్యమం చేయాల్సింది విపక్ష నేతలే. కానీ కేసులకు భయపడి టీడీపీ కూడా ముఖం చాటేస్తుంది. మిగిలింది.. జనసేన మాత్రమే.. కరోనా సమయంలో సేవా కార్యక్రమాలతో గొప్ప మనసు చాటుకున్న జనసైనికులు ఇపుడు ఉద్యమ బాట పట్టబోతున్నారు.
జనసేనలో దాదాపు కోటిమంది వరకూ సభ్యులుంటారు. కానీ.. 25 లక్షల మంది మాత్రమే పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటేస్తున్నారు. మరి మిగిలిన వారంతా.. అందుకే.. ఈ సారి గ్రామీణ ప్రాంతాల్లో జనసేనను అభిమానించే వారిని ఆకట్టుకునేందుకు జనసేన సిద్ధమవుతుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యలపై పోరాటం చేయటం.. అదే సమయంలో ఉన్నతాధికారుల వద్దకు సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించటం వంటివి కూడా చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో జనసైనికులు మరో అడుగు ముందుకేసి తమ సొంత ఖర్చుతో రహదారులు నిర్మించటం, పేదలకు ఉపాధి కల్పించటం వంటి చేస్తున్నారు. వీటిని కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనేది జనసేనాని యాక్షన్‌ప్లాన్. నవంబరు, డిసెంబరు నెలల్లో జరగబోయే హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ జనసేన పలు డివిజన్లలో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరక ఆల్రెడీ డివిజన్ స్థాయిలో బలాబలాలపై సర్వే చేస్తున్నారు. గట్టిపోటీనిచ్చే చోట గెలుపే లక్ష్యంగా అందర్నీ కలుపుకుని పోవాలని భావిస్తున్నారు. బీజేపీ, జనసేన కలవటం ద్వారా హైదరాబాద్‌లో ఆంధ్రవాసులు ఉన్న డివిజన్లను గెలవటం కష్టమేం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.