ఎస్.. తెలుగు సినిమా కోట్లాదిమంది ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే వేదిక.. పండుగ వేళ కొత్త సినిమా చూడటం వేడుక. బ్లాక్ అండ్ వైట్ నుంచి 70 ఎంఎం వరకూ పండగలు.. పుట్టినరోజులు.. పెళ్లిరోజులు.. బాధేసినా.. ఆనందం వచ్చినా అన్నింటికీ ఒకే ఒక్క మందు సినిమాకెళ్దామా! కొత్తగా పెళ్లయిన నవదంపతులు సినిమాకు వెళ్లటాన్ని గొప్ప అనుభూతిగా ఫీలవుతారు. అప్పట్లో సమాజాన్ని కదిలించిన వెండితెర.. మనిషి జీవితంలో భాగమైంది. విజయవాడలో సుమారు 2000కు సినిమా థియేటర్లు ఉండేవంటే ఊహించుకోండి.. సినిమా జనజీవనంలో ఎంతగా బాగమైందో. హిట్లు. సూపర్‌హిట్లతో కళకళలాడిన థియేటర్లన్నీ ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కరోనా వైరస్ లక్షలాది మంది జీవితాల్లో.. చీకట్లు నింపిందనే చెప్పాలి.
ఆర్ ఆర్ ఆర్, ఆచార్య, ఎఫ్3, ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఇలా ఎంతమంది స్టార్ సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అక్టోబరు 15న లాక్‌డౌన్ ఆంక్షలు సడలించి సినిమా థియేటర్లు తెరచిన పక్క రాష్ట్రాల్లో కనీసం 10-15 మంది ప్రేక్షకులు కూడా రావట్లేదట. కరెంటు బిల్లుకు అయ్యే ఖర్చులు కూడా రావట్లేదంటూ థియేటర్ల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. ఇకపోతే ఏపీ, తెలంగాణల్లో సుమారు 2000 వరకూ సినిమా థియేటర్లుంటాయి. మల్టీఫ్లెక్స్ అదనం. సుమారు 2 లక్షల మంది వరకూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పటికప్పుడు సినిమా షూటింగ్ లు మొదలుపెట్టినా.. ఏదోమూలన భయం. దీనికి నిదర్శనంగా ఇటీవల తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది కరోనా కాటుకు మరణించారు. బాలసుబ్రహ్మణ్యం మరణం యావత్ తెలుగు సినీ ప్రపంచాన్ని కదిలించింది. జయప్రకాశ్‌రెడ్డి వంటి నటుడు కూడా కరోనా వేటకు బలయ్యారు.
తాజాగా సినీ నటి తమన్నా కూడా షూటింగ్ లొకేషన్‌లో కరోనా భారినపడ్డారు. హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. తనను కష్టకాలంలో కాపాడిన వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ కుటుంబ సభ్యులందరూ వైరస్ కు గురైనట్టు ఆయనే స్వయంగా ట్వీట్టర్ ద్వారా తెలిపారు. బాలయ్య, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు సినిమాల షూటింగ్‌లు మొదలైనా.. ఏదోమూలన భయం మాత్రం వెంటాడతుందట. అందుకే.. స్టార్ హీరోలు తమ సినిమాలను కొద్దికాలం వాయిదా వేయాలనుకుంటున్నారట. ఒక్క పవన్ మినహా వెంకటేశ్, నాగార్జున, చిరంజీవి, బాలయ్య అందరూ 60 దాటినవారే కావటం.. ఈ వయసు దాటిన వారికి కరోనా వైరస్ ప్రమాదం అధికంగా ఉండటం కూడా దీనికి కారణమట.