దుబ్బాక ఉప ఎన్నిక మరింత హీటెక్కింది. ఇక్కడ గెలుపు టీఆర్ ఎస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. బీజేపీ కూడా చావో రేవో అన్నట్టుగా చూస్తోంది. ఓట్లను చీల్చేందుకు ఇండిపెండెట్లుగా బరిలోకి దిగిన వారితో ఎవరి దెబ్బ పడుతుందనే గుబులు కూడా రెండు పార్టీలను వెంటాతుంది. ఆ రెండు పార్టీలకు ఊహించని ఝలక్ ఎదురైతే తాము లాభపడటం ఖాయమని కాంగ్రెస్ అంచనాలు వేసుకుంటుంది. ఇప్పటి వరకూ ఇదీ దుబ్బాకలో లెక్క.. కానీ సోమవారం దుబ్బాక నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలు టీఆర్ ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధాన్ని మరింత పెంచేశాయి. బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో భారీగా నగదు ఉందనే ఆరోపణలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సుమారు 20 లక్షల నగదు వరకూ స్వాధీనం చేసుకున్నారు. కానీ.. ఆ డబ్బంతా పోలీసులు తీసుకొచ్చారంటూ ఆరోపణలు వచ్చాయి. పట్టుబడినట్టుగా చూపుతున్న నగదును లాక్కున్న బీజేపీ శ్రేణులు మీడియాకు చూపారు.
అయితే మంత్రి హరీష్‌రావు మాత్రం ఇదంతా బీజేపీ సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా అంటూ ఎద్దేవాచేశారు. పోలీసులు తమ వాహనాలను కూడా తనిఖీ చేశారంటూ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధ్యక్షుడు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సిద్ధిపేట బయల్దేరారు. దారిలో అడ్డుకున్న పోలీసులు సంజయ్ పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. బౌతికదాడి జరిగినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ఒక ఎంపీను ఆ విధంగా బంధీగా తీసుకెళ్లటంపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు ఎక్కడికక్కడే పోలీసులు భారీగా మోహరించారు.
పోలీసులపై వస్తున్న ఆరోపణలను సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ కొట్టిపారేశారు. తాము ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నామంటూ స్పష్టంచేశారు. జితేంద్రరావు ఇంట్లో తనిఖీల సమయంలో డబ్బు దొరికినట్టు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆద్వర్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీ చేశామన్నారు. నోటీసు ఇచ్చినతరువాతనే తాము డబ్బు సీజ్ చేశామని వెల్లడించారు. ఇదంతా వీడియో చిత్రీకరించామని చెబుతున్నారు. అయితే.. ఇదంతా కారు పార్టీ గెలుపు కోసం ఆడుతున్న నాటకంగా బీజేపీ ఆరోపిస్తుంది. ఇప్పటికే నిప్పు, ఉప్పుగా మారిన దుబ్బాకలో ఆకస్మికంగా చోటుచేసుకున్న పరిణామాలతో ఒకేసారి మరింత హీటెక్కేలా చేసింది. మరి ఈ పరిణామాలు.. ఎవరికి లాభం చేకూర్చుతాయో.. ఇంకెవర్ని బొక్కబోర్లా పడేలా చేస్తాయో తెలియాలంటే.. నవంబరు 10వ తేదీ వరకూ ఆగాల్సిందే.
                


