తెలంగాణలో దుబ్బాక.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలికేంటీ. మోకాలికి.. బోడిగుండుకు ముడి వేయటం అంటే ఇదేనేమో. ఇలా అనుకునేవారూ ఉంటారు. కానీ ఎన్నికలయ్యాక ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. ఫలితం వచ్చేంత వరకూ పార్టీల అధినేత ల నుంచి సామాన్య కార్యకర్తల నుంచి అదో తుత్తి. అమెరికాలో ట్రంప్ చీటి చిరగబోతుంది. బైడెన్‌కు దాదాపు మార్గం సుగుమం అయినట్టుగానే గణాంకాలు చెబుతున్నాయి.కోర్టులు.. వివాదాలు.. పరిష్కారాలు ఇవన్నీ తరువాత వచ్చే లెక్కలు. కానీ.. అమెరికాలో బైడెన్ ఎందుకు గెలుస్తున్నాడంటే.. ఇంకేముంది.. ట్రంప్‌ల మారి తిక్క చేష్టలు. స్వదేశీయులు.. విదేశీయులు ఎవర్నీ వదలకుండా దులిపి పారేయటం.. కరోనా వైరస్ కూడా ట్రంప్ ఎదురుగా నిలబడేందుకు భయపడి.. ముఖానికి మాస్క్ కట్టుకున్నట్టుగా అప్పట్లో వచ్చిన ఓ కార్టూన్ ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. అందుకే.. ట్రంప్ నోటిదురుసు.. పసలేని పాలన రెండోసారి జనం ఛీకొట్టేలా చేసిందట. ఎందుకిలా అనుకున్నారంటే.. గతానికి భిన్నంగా ఒక్కసారిగా ఓటింగ్ పెరగటం.. ఓటర్లు బారులు తీరి మరీ ఓటు హక్కు వినియోగించుకోవటంతో.. ఇదంతా అధికార పార్టీపై వ్యతిరేకతే అనేది అక్కడ విశ్లేషణ.
అమెరికా ఓకే.. మరి దుబ్బాక అంటారా.. ఇక్కడ కూడా బీజేపీ చాలా బలంగా ప్రచారం చేసింది. బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్‌రావు పట్ల సానుభూతి ఉంది. తెలంగాణ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకెత కూడా మాకు కలసి వస్తుందంటున్నారు. పైగా 81శాతానికి పైగా ఓటింగ్ పెరగటంతో కమలనాథులు తమకే లక్ కలసి వస్తుందని బేరీజు వేసుకుంటున్నారు. మూడు మండలాల్లో బీజేపీ బాగానే పుంజుకుంది. ముఖ్యంగా మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల్లో పరిహారం అందని మండలాల ఓటర్లుకమలం గుర్తు వైపు మొగ్గుచూపారట. ఓటింగ్ శాతం పెరగటం తమకే కలసి వస్తుందం టున్నారు బీజేపీ నేతలు. కానీ టీఆర్ ఎస్ మాత్రం.. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కకుండా చేసేందుకు ఓటర్లు పోలింగ్‌బూత్ లకు కదిలారంటోంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం.. టీఆర్ ఎస్ గెలుపు అంత తేలిక కాదనీ.. ఒకవేళ గెలిచినా కూడా కేవలం 20,000 ఓట్ల మెజార్టీ మాత్రమే వస్తుందని లెక్కలు కడుతోంది. అదే బీజేపీ గతానికి భిన్నంగా ఓట్లను దక్కించు కుంటుంది. ఒకవేళ ఏదో మూలన రఘునందన్‌కు అదృష్టం ఉంటే మాత్రం.. 1000 ఓట్ల తేడాతో అయినా బయటపడే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి డిపా జిట్లు రావటంపై కూడా బెట్టింగ్‌లు జరుగుతున్నాయట. ఈనెల 10 వతేదీ ఎన్నికల లెక్కింపు జరుగనున్న నేపథ్యంలోనే మూడు పార్టీలు లెక్కలు వేసుకునే పనిలో పడ్డాయన్నమాట.