కడప జిల్లాలో ఘర్షణలు భగ్గుమన్నాయి. రెండు వర్గాలుగా మారిన వైసీపీ కార్యకర్తలు కోట్లాటకు దిగారు. శుక్రవారం మొదలైన రచ్చ ఆదివారం కూడా కొనసాగింది. ఇప్పటి వరకూ సుమారు 10 మంది వరకూ గాయపడినట్టుగా తెలుస్తోంది. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇడుపులపాయలో ఈ గొడవ మొదలైంది. పులివెందుల అధికార పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణకు వీరన్నగట్టుపల్లి గ్రామం కేంద్రంగా తెలుస్తోంది. గండికోట నిర్వాసితులకు పరిహారం అందజేతలో జరిగిన అవకతవకలకు గొడవలకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో సొమ్ములు చిచ్చుపెట్టినట్టుగా మారాయి. గతంలో వైసీపీ, టీడీపీలో ఉన్న నేతలు ఇప్పుడు వైసీపీలోకి చేరారు. అయితే వీరందరూ ఒకే పార్టీలో ఉండటంతో ఆధిపత్యం కోసం మొదలైన ఫ్యాక్షన్ తగాదాలు మున్ముందు ఇంకెంతగా ముదురుతాయనే ఆందోళన నెలకొంది. కడప జిల్లా గండిపోట ప్రాజెక్టు నిర్మాణం కోసం స్థల సేకరణ ఏ నాడో చేపట్టారు. దీని పరిధిలోకి 24 గ్రామాలు ముంపు గ్రామాలను గుర్తించారు. గతంలో పరిహారం కూడా పంపిణ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాల కేటాయింపు కూడా జరిగాయి. ప్రస్తుతం మరోసారి పరిహారం అందజేత చెల్లింపులు వివాదాస్పదంగా మారాయి. కొందరు అధికారులు, నాయకులు కలసి కోట్లాదిరూపాయలు కాజేస్తున్నారు.
గండికోట ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లోని గ్రామం బి.అనంతపురం. ఇక్కడ ఇప్పటికే 270 మంది ని బాధితులను గుర్తించారు. ఇటీవల మరో 250 మంది ముంపు కుటుంబాల జాబితాలో చేర్చారు. రూ.30కోట్లు కాజేసేందుకు పథకం వేశారు. ఈ విషయం గుర్తించిన గ్రామస్తుడు, మాజీ పోలీసు గుర్నాథరెడ్డి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం 12 మంది స్థానికేతర అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టేందుకు డోర్ టు డోర్ సమాచార సేకరణకు అధికారులు గ్రామానికి వెళ్లారు. రీ సర్వే చేపట్టిన సమంయలోనే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరులు, మాజీ మంత్రి రాంసుబ్బారెడ్డి అనుచరులు అక్కడకు చేరారు. అధికారులు ఆలయం వద్ద విచారణ చేపట్టారు. అక్కడే ఇరు వర్గాలు కవ్వింపుకు పాల్పడ్డాయి. గుర్నాథరెడ్డిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ముందస్తు పథకం ప్రకారం దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనలో మాజీ పోలీసు గుర్నాథరెడ్డి మరణించారు. దీంతో గ్రామంలో పరస్పర దాడులు మొదలయ్యాయి. దీంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. నిన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో మళ్లీ పగ ప్రతీకార దాడులు మొదలయ్యాయనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ విషయాన్ని సీఎం జగన్ మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారంఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో ఘర్షణలు తలెత్తటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. దీనివెనుక ఎవరైనా అసాంఘికశక్తుల కుట్ర దాగుందా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సీమలో ఒకచోట మొదలైన ఇటువంటి గొడవలు అదుపు చేయకపోతే మరో ప్రాంతానికి పాకే ప్రమాదం ఉందనే ఆందోళన లేకపోలేదు. దీంతో సీమలోని అన్ని జిల్లాల పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.



