జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ దూకుడు పెంచింది. 2016లో కేవలం 4 సీట్లకే పరిమితమైన భాజపా ఈ సారి ఏకంగా గ్రేటర్ పీఠంపై గురిపెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ముందు వరకూ అబ్బే బీజేపీకు అంత సీన్ లేదనే అభిప్రాయం ఉండేది. కానీ ప్రస్తుతం అంచనాలు తారుమారయ్యాయి. గులాబీగూటిలోనూ గుబులు పుట్టించేంత వరకూ చేరారు. తమకు 40 సీట్లు వచ్చినా మేయర్ అవుతామంటూ సాక్షాత్తూ టీఆర్ ఎస్ మంత్రులు చెప్పేంత వరకూ తీసుకెళ్లారు. ప్రజల్లోనూ కార్పోరేటర్ల పనితీరుపై నెగిటివ్ ఉంది. కానీ కేసీఆర్‌పై నమ్మకంతో ఓట్లేస్తారనే భావిస్తూ వచ్చారు. కానీ దుబ్బాకలో సానుభూతి, కేసీఆర్ మంత్రాంగం, హరీష్ రావు చాణక్యత ఏవీ పనిచేయకపోవటంతో జనాల్లోనూ బీజేపీ బలం పెరిగిందనే భావన వచ్చింది. ఇది పరోక్షంగా బల్దియా ఎన్నికలపై ఉంటుందనేది కూడా అంచనాలున్నాయి.
బండి సంజయ్ , కిషన్‌రెడ్డి, రఘునందన్ రావు ముగ్గురు ఆద్వర్యంలో వ్యూహ, ప్రతివ్యూహాలతో దూసుకెళ్తున్నారు. తొలి విడత 21 మందితో జాబితా సిద్ధం చేశారు. మరికొందరి పేర్లను ఈ రోజు వెల్లడించనున్నారు. దుబ్బాక ఫలితం తరువాత బీజేపీ చేపట్టిన సర్వేలో దాదాపు 40 సీట్లు వస్తాయనే అంచనాకు వచ్చారట. జీహెచ్ఎంసీ పరిధిలోని కీలకమైన డివిజన్లపై బీజేపీ ఫోకస్ పెంచింది. బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం, సనత్‌నగర్, బాలాజీనగర్, అమీర్‌పేట్, సోమాజీగూడ, కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ వంటి చోట కూడా కాషాయ పార్టీకు అనుకూల వాతావరణం ఉండటంతో అక్కడ బలమైన అభ్యర్థులను ఉంచారు. ప్రజల్లోకి మరింతగా దూసుకెళితే సీట్ల సంఖ్య పెరుగుతుందనే బలమైన నమ్మకం కూడా వారిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏమైనా కమలం పార్టీ కారు దూకుడు బ్రేకులు వేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. దుబ్బాకలో ఎదురైన సానకూల వాతావరణం గ్రేటర్‌లోనూ కమలం పార్టీకు ఎంత వరకూ కలసివస్తుందనేది చూడాలి.