మంత్రులు చాలా మందిపై ఏడేళ్లలో ఎన్నో అభియోగాలు వచ్చాయి. ఏ ఒక్కరిపై కూడా విచారణ జరిపించలేదు. కనీసం సీఎం కేసీఆర్ నుంచి మందలింపులు కూడా లేవు. కానీ.. వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ భూబాగోతంపై విచారణ మొదలుపెట్టారు. ప్రాథమిక దర్యాప్తులు ఈటెల అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్టుగా గుర్తించామంటూ రెవెన్యూ అధికారులు తేల్చారు కూడా దీంతో ఈటల చుట్టూ కబ్జామంటలు.. కాకపుట్టిస్తున్నాయి. ఈటల కు జమున హేచరీస్ పేరుతో మూసాయంపేటలో 120 ఎకరాల భూమి ఉందట. ఆ పక్కనే మరో 100 ఎకరాలు కూడా తీసుకుని కోళ్ల ఫారం విస్తరించాలనే ఆలోచనతో రూ.100 కోట్లు అప్పుచేసి మరీ పనులు మొదలుపెట్టానంటూ స్వయంగా ఈటల ప్రకటించారు. పనిలో పనిగా తాను ముదిరాజ్ అని.. భార్య రెడ్డి అంటూ.. రెండు కులాలను గుర్తు చేశారు. ఈ లెక్కన.. ఈటల మనసులో మాట చెప్పకనే చెప్పారు. గత సారి రెడ్డి వర్గంపై కక్షగట్టిన పార్టీ పెద్దతలకాయ ఈ సారి.. ముదిరాజ్‌లను లక్ష్యంగా చేసుకుందంటూ బయటపెట్టినట్టుగానే విశ్లేషకులు అంచనా వేసుకుంటున్నారు. వాస్తవానికి ఈటలపై మాటల దాడి ఇప్పుడు కొత్తేం కాదు. ఈటల మాత్రం మంత్రింగా స్వతంత్రులుగా వ్యవహరిస్తున్నారు. పైగా చినబాబు పెత్తనంపై తొలిసారి గట్టిగా మాట్లాడింది కూడా ఆయనే. తనకు మంత్రి పదవి ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాలేదంటూ పెద్దలకే చురకలేశారు. గతంలోఈటలను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది . ఆ సమయంలోనూ ఈటల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పదవి తనకు జస్ట్ వెంట్రుక అన్నంతగా స్పందించారు. ఇప్పుడు కరో్నా కష్టకాలంలో ఈటల చురుగ్గా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యం మీడియా దాచిపెట్టినా సోషల్ మీడియా మాత్రం దుమ్మెత్తిపోస్తుంది. ఇవన్నీ పార్టీ పెద్దలకు చిరాకుగా అనిపించే ఉండవచ్చు.
ఈటల మాత్రం తాను ఎక్కడ భూములు కొన్నా.. ఏం చేసినా సీఎం కేసీఆర్‌కు చెప్పాకే మొదలు పెడతానంటూ మెలికపెట్టారు. ఈ లెక్కన మెదక్‌లో భూముల కొనుగోలు కూడా ఆయన చెవిలో వేశానంటారు. ఇదంతా నిబంధనల ప్రకారం సాగుతుందనే ఆయన మాటలు. మరి రైతులు ఎందుకిలా అకస్మాత్తుగా కక్షగట్టారనే వెనుక పెద్ద వ్యవహారమే జరిగింది. గతంలో భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉన్నతాధికారి ధర్మారెడ్డి ఏసీబీకు పట్టుబడ్డారు. ఆ తరువాత బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన తూచ్… దీనివెనుక నా పాత్ర లేదు.. అంతా ఈటల చెబితేనే చేశానంటూ భారం మంత్రిపై నెట్టారు. అదను కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశం వచ్చినట్టయింది. అంతే.. గురిచూసి కొడితే గట్టిగానే తగిలింది. అక్కడున్న ఆధారాలు కూడా మంత్రినే తప్పు అనేంత బలంగా ఉన్నాయి. కాబట్టి.. దీనిపై ప్రభుత్వ తప్పిదం లేదనేది బహిర్గతమైంది. చీకటి చాటున జరిగిన లావాదేవీలు ఎట్టాగూ బయటపెట్టలేరు కాబట్టి.. ఎవర్ని దోషిగా నిలపాలని పథకరచన చేశారో.. వారే తమకు తాము ఇరుక్కున్నట్టయింది. ఎంతైనా రాజకీయ నేతలు.. ఒన్ షాట్ టూ బర్డ్స్ కాదు.. వన్ షాట్… 100 ఎకరాలు అని చాటారన్నమాటే.