ఇది నిజమా.. పుకారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రపంచంలో కేవలం భారత్‌లో అది కూడా మన చిత్తూరు అడవుల్లో మాత్రమే దొరికేది ఎర్రచందనం. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్. శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు దీన్ని ఆయుర్వేద మందుల్లో వాడతారని ప్రచారం ఉంది. జపాన్, చైనాలో ఎర్రచందనం ఇంట్లో ఉండటాన్ని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. కొద్ది ముక్క ఉన్నా కూడా అది ఇంట్లో చికాకులను దూరం చేస్తుందనే నమ్మకం కూడా ఉంది సుమా. సెంటిమెంట్స్, మెడిసన్స్ పుణ్యమాంటూ ఎర్ర చందనం ఇప్పుడు హాట్‌కేక్. తమిళనాడు నుంచి కూలీలను తీసుకొచ్చి మరీ కొట్టిస్తుంటారు స్మగ్లర్లు. ఇక్కడ వాటాలు పంచుకునేందుకు రాజకీయ, పోలీసు, అటవీశాఖలన్నీ పోటీపడుతుంటాయి. దొరికినపుడు ఏవో నాలుగు దుంగలు పట్టు కుని కేసులు పెడుతుంటారనే ఆరోపణలున్నాయి. సినీ, రాజకీయ, పోలీసు అధికారులు పలుమార్లు అరెస్టయ్యారు కూడా. గత ప్రభుత్వం ఎర్రచందనం వేలం వేసింది. ఇప్పటి ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. కానీ.. తాజాగా ఏపీ మంత్రి తనయుడు.. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి హవాలా రూపంలో ఏకంగా రూ.10 కోట్ల వరకూ సేకరించాడనే పుకార్లు ఊపందుకున్నాయి. ఏపీ నుంచి తమిళనాడుకు గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో ఆరంబాక్కం పోలీసులు తనిఖీలు చేసినపుడు ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్ ఉన్న కారును సోదా చేసినపుడు ఈ అడ్డగోలు వ్యవహారం బయటపడింది. అయితే అరెస్ట్ అయిన వ్యక్తులు కేవలం డ్రైవర్ , అనుచరులు అని చెబుతున్నారు. కానీ దీనివెనుక మంత్రివర్యుడి తనయుడు
ప్రమేయం కూడా ఉందని తెలుస్తోంది. దీనివెనుక దాగిన వాస్తవాలు వెలుగుచూడాలంటే… అధికారులు పారదర్శకంగా విచారణ చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.